NTV Telugu Site icon

Sr NTR: అధ్యయనం చేయవలసిన యన్టీఆర్ 100 చిత్రాలు

Ntr Sr

Ntr Sr

మహానటుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు నటజీవితం భావితరాలను సైతం ప్రభావితం చేస్తూనే ఉంది. నవతరం ప్రేక్షకులు సైతం యన్టీఆర్ నటించిన చిత్రాలను బుల్లితెరపైనా, చిత్రోత్సవాల్లో చూసి ఆనందిస్తున్నారు. ఈ నాటి మేటి నటీనటులు సైతం ఆ మహానటుని అభినయపటిమను శ్లాఘిస్తున్నారు. నటనలో రాణించాలనుకొనేవారు నటరత్న నటనావైభవాన్ని అధ్యయనం చేయాలని తపిస్తున్నారు. నటసార్వభౌముని జయంతి సందర్భంగా అధ్యయనం చేయవలసిన ఆయన శత చిత్రాలను మీ కోసం ఎంపిక చేశాం. ఇవే కాకుండా మరో వందకు పైగా చిత్రాల్లో యన్టీఆర్ అభినయం జనాన్ని ఎంతగానో అలరించింది. ఈ ఎంపిక ఆయన అభినయ వైభవం ప్రదర్శించిన చిత్రాలుగా భావించాలి.

1. యన్టీఆర్ తొలి చిత్రం ‘మనదేశం'(1949). తొలి చిత్రంలోనే నాటి మేటి నటులతో కలసి యన్టీఆర్ నటించిన తీరును తప్పక యువతరం అధ్యయనం చేయవలసిందే!
2. యన్టీఆర్ హీరోగా నటించిన మొదటి సినిమా ‘షావుకారు’ (1950). తెలుగు వారికి మరపురాని చిత్రాలను అందించిన విజయా సంస్థ నిర్మించిన తొలి చిత్రం కూడా ఇదే. ఇందులో యన్టీఆర్ నవరసపోషణ చూసి తీరవలసిందే!
3. యన్టీఆర్ నటించిన తొలి జానపదం ‘పల్లెటూరి పిల్ల’ (1950). బి.ఏ.సుబ్బారావు రూపొందించిన ఈచిత్రంలోనే యన్టీఆర్, ఏయన్నార్ తొలిసారి నటించారు. ఆ తరువాత రికార్డుస్థాయిలో ఈ ఇద్దరు మహానటులు 13 సార్లు కలసి నటించడం విశేషం! మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా చూడవలసిందే!
4. యన్టీఆర్ ను సూపర్ స్టార్ గా నిలిపిన ‘పాతాళభైరవి’ (1951). ఈ సినిమాతోనే తెలుగునాట జానపద కథానాయకుడు ఎలా ఉండాలో ఓ గ్రామర్ ను లిఖించారు కేవీ రెడ్డి. తప్పక భావినటీనటులు చూడవలసిందే! తెలుగులో 200 రోజులు డైరెక్టుగా ఆడిన చిత్రం. తొలి తెలుగు స్వర్ణోత్సవ చిత్రం కూడా ఇదే కావడం విశేషం!
5. మల్లీశ్వరి (1951). బి.యన్.రెడ్డి యన్టీఆర్ లోని నటుణ్ణి తీర్చిదిద్దిన విధానాన్ని చూసి తీరవలసిందే!
6. పెళ్లిచేసిచూడు (1952). ఆ యేడాది లీఫు సంవత్సరం. ఫిబ్రవరి 29న విడుదలైన ఈ చిత్రం అఖండ విజయం సాధించింది. అప్పట్లో సాంఘిక చిత్రాలలో ఈ స్థాయి విజయం ఏదీ చూడలేదు. యన్టీఆర్ నటనకోసం ఈ సినిమా తప్పక చూడవలసిందే.
7. దాసి (1952). అప్పటికే ‘పాతాళభైరవి’ వంటి సూపర్ హిట్ ఉన్నా, డీగ్లామర్ రోల్ లో జట్కా బండి నడిపే రామునిగా నటించి మెప్పించారు రామారావు.
8. పల్లెటూరు (1952). ‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా…’ అంటూ ఇందులోనే యన్టీఆర్ నినదించారు. సావిత్రి ఆయన సరసన తొలిసారి నాయికగా నటించిన చిత్రమిది.
9. ‘పిచ్చిపుల్లయ్య’ (1953). యన్టీఆర్ సొంత సంస్థ యన్.ఏ.టి. బ్యానర్ లో తొలి చిత్రం. పిచ్చివాడిగా యన్టీఆర్ అభినయం విశేషంగా అలరిస్తుంది.
10. ‘చండీరాణి’ (1953). ఏకకాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలైన తెలుగు సినిమా. అంటే తెలుగువారి తొలి పాన్ ఇండియా మూవీ ఇదే. మూడు భాషల్లోనూ శతదినోత్సవం చేసుకుంది.
11. ‘వద్దంటే డబ్బు’ (1954). యన్టీఆర్ అమాయకత్వంతో కూడిన హాస్యం ఇందులో ఎసెట్. ఇదే కథ తరువాత ‘బాబాయ్ -అబ్బాయ్’గా బాలకృష్ణతో రూపొందింది. యన్టీఆర్ సినిమా సూపర్ హిట్.
12. ‘తోడుదొంగలు’ (1954). యన్టీఆర్ రెండవ సొంత చిత్రం. 31 ఏళ్ళలోనే ముదుసలిగా నటించి మెప్పించారు.
13. ‘రాజు-పేద’ (1954). యన్టీఆర్ లోని విలక్షణ నటుడు ఎలా ఉంటాడో జనానికి చూపిన చిత్రం.
14. ‘అగ్గిరాముడు’ (1954). తెలుగునాట తొలి మాస్ మసాలా చిత్రం ఇదే. ఇందులో యన్టీఆర్ మారువేషాలు భలేగా అలరిస్తాయి. ‘రాముడు’ టైటిల్ తో యన్టీఆర్ నటించిన తొలి చిత్రం. బ్లాక్ బస్టర్ హిట్.
15. ‘పరివర్తన’ (1954). యన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపించి అలరించారు.
16. ‘ఇద్దరు పెళ్ళాలు’ (1954). ఇందులోనే యన్టీఆర్ తొలిసారి తెరపై కృష్ణునిగా కనిపించారు. యన్టీఆర్,జమున జంట అందాల అభినయమే ఈ సినిమాకు ఎసెట్.
17. ‘మిస్సమ్మ’ (1955). ఈ చిత్రాన్ని త్రిభాషల్లో నిర్మించారు. తెలుగులో యన్టీఆర్ చేసిన పాత్రను తమిళ, హిందీ భాషల్లో జెమినీ గణేశన్ ధరించారు. యన్టీఆర్ అందాల అభినయం ఈచిత్రానికి ఎస్సెట్.
18. ‘కన్యాశుల్కం’ (1955). ఎందరు విమర్శించినా, గిరీశం పాత్రలో యన్టీఆర్ జీవించారు. అందుకు నిదర్శనంగా ఈ సినిమా తరువాతి రోజుల్లోనూ రజతోత్సవాలు చూసింది.
19. ‘సంతోషం’ (1955). ఇందులోనే యన్టీఆర్ తొలిసారి ద్విపాత్రాభినయం కాసేపు కనిపించారు. ఈచిత్రం హిందీలో ‘నయా ఆద్మీ’ పేరుతో రీమేక్ అయింది. యన్టీఆర్ నటించిన ఆ హిందీ చిత్రం గోల్డెన్ జూబ్లీ చేసుకుంది. రెండు భాషల్లోనూ యన్టీఆర్ అభినయం చూడదగ్గది.
20. ‘చిరంజీవులు’ (1956). వేదాంతం రాఘవయ్య రూపొందించిన ఈ చిత్రం మొదట్లో అంతగా అలరించలేదు. కానీ, గుడ్డివాడిగా యన్టీఆర్ అభినయం జనాన్ని ఆకట్టుకుంది. రిపీట్ రన్స్ లో మేటి చిత్రాలను సైతం తోసిరాజని విజయం చూసిందీ చిత్రం. అందుకు యన్టీఆర్ అభినయమే కారణమని చెప్పక తప్పదు.
20 ఎ. ‘తెనాలి రామకృష్ణ’ (1956). ఇందులో తొలిసారి యన్టీఆర్ శ్రీకృష్ణదేవరాయలుగా నటించి మెప్పించారు. తెలుగులో ఏయన్నార్, తమిళంలో శివాజీగణేశన్ నటించగా, రెండు భాషల్లోనూ యన్టీఆర్ రాయలు పాత్రలో అలరించారు.
21. ‘చరణదాసి’ (1956). యన్టీఆర్, ఏయన్నార్ నటించిన మరో మల్టీస్టారర్. ఇందులోనే యన్టీఆర్ తొలిసారి శ్రీరామునిగా కనిపించారు.
22. ‘మాయాబజార్’ (1957).యన్టీఆర్ ను అపరశ్రీకృష్ణునిగా నిలిపిన చిత్రం. తెలుగు, తమిళ భాషల్లో యన్టీఆరే శ్రీకృష్ణునిగా నటించారు. రజతోత్సవం చూసిందీ చిత్రం. ఇందులో అసలు కథానాయకుడెవరో చివరలో శ్రీకృష్ణుని స్తోత్రంతో చూపించారు కేవీ రెడ్డి.
23. ‘వినాయకచవితి’ (1957). మరోమారు శ్రీకృష్ణునిగా యన్టీఆర్ అలరించి ఆకట్టుకున్న వైనం ఇందులో కనిపిస్తుంది. ‘మాయాబజార్’లోని కృష్ణునికి,ఇందులో కనిపించే కృష్ణునికి ఎంతో వ్యత్యాసం చూపించారు నందమూరి.
24. ‘పాండురంగ మహాత్మ్యం’ (1957). ఇందులో భక్త పుండరీకునిగా యన్టీఆర్ అభినయం నభూతో నభవిష్యతి. ఈ చిత్రం చూసి ఎందరో గాలితిరుగుళ్ళు తిరిగే కుర్రాళ్ళు పరివర్తన చెందారు.
25. ‘భూకైలాస్’ (1958). ఎదురుగా ఎందరు మేటి నటులున్నా, తనదైన వాచకాభినయంతో యన్టీఆర్ తొలిసారి రావణబ్రహ్మ పాత్రలో నటించి మెప్పించారు.
26. ‘మంచి మనసుకు మంచి రోజులు’ (1958). అన్నాచెల్లెళ్ళ అనుబంధంతో రూపొందిన చిత్రమిది.యన్టీఆర్ అన్నగా తెలుగువారి గుండెల్లో ఎలా నిలిచారు అన్న అంశానికి జవాబుగా నిలిచే చిత్రాలలో ఇదొకటి.
27. ‘సంపూర్ణ రామాయణం’ (1958) (తమిళం). తరువాత తెలుగులో డబ్ అయింది. యన్టీఆర్ పూర్తిస్థాయిలో శ్రీరామునిగా నటించిన తొలి చిత్రం. ఇందులో భరతునిగా శివాజీగణేశన్ నటించారు. తమిళనాట స్వర్ణోత్సవం చూసిందీ చిత్రం.
28. ‘శభాష్ రాముడు’ (1958). మాస్ కు యన్టీఆర్ ను చేరువ చేసిన చిత్రాలలో ఇదొకటి. యన్టీఆర్ అభినయంతో అలరించిన ఈ చిత్రం రజతోత్సవం చూసింది.
29. ‘శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం’ (1960). యన్టీఆర్ తొలిసారి శ్రీనివాసునిగా నటించిన ఈ చిత్రంతో తెలుగునేలపై అనేక థియేటర్లు దేవాలయాలుగా మారాయి. ఇందులో ఆయన అభినయంలోని వైవిధ్యం అలరించింది.
30. ‘రాజమకుటం’ (1960). ఇందులో యన్టీఆర్ అభినయంలోని విలక్షణత జనాన్ని భలేగా ఆకట్టుకుంది.
31. ‘దీపావళి’ (1960)లో మరోమారు శ్రీకృష్ణునిగా నటించారు యన్టీఆర్. వీరోచితం ప్రదర్శించి మెప్పించారు.
32. ‘సీతారామకళ్యాణం’ (1961). ఓ నటునికి తాను అభిమానించే పాత్రపై ఎంతటి శ్రద్ధాభక్తులు ఉంటాయో చాటుతూ యన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నటించిన తొలి చిత్రమిది. ఇందులో రావణబ్రహ్మగా నందమూరి నటన నభూతో నభవిష్యతి అన్న చందాన సాగింది.
33. ‘ఇంటికి దీపం ఇల్లాలే’ (1961). యన్టీఆర్ తాగుబోతుగా నటించిన ఈ చిత్రం ఆయన నటనతోనే విజయపథంలో సాగింది.
34. ‘ఇంద్రజిత్’ (సతీ సులోచన), ‘పెండ్లిపిలుపు’ (1961). ఒకే రోజున రెండు చిత్రాలు విడుదలై రెండూ శతదినోత్సవాలు జరుపుకోవడం అన్న ఫీట్ ను తెలుగునాట యన్టీఆర్ నాంది పలికారు. ఆ తరువాత 1993లో బాలకృష్ణ ‘నిప్పురవ్వ’, ‘బంగారుబుల్లోడు’ సెప్టెంబర్ 3న విడుదలై అలరించాయి. ఇలాంటి ఫీటు తండ్రీకొడుకులకే సొంతమవ్వడం విశేషం!
35. ‘జగదేకవీరుని కథ’ (1961). జానపద చిత్రాల్లో తనకు తానే సాటి అనిపించుకున్న యన్టీఆర్ తనదైన అభినయంతోనూ,రాజకుమారుడు అంటే ఎలా ఉంటారో చూపించిన చిత్రమిది.
36. ‘కలసి ఉంటే కలదుసుఖం’ (1961). యన్టీఆర్ దైవాంగునిగా నటించిన ఈ చిత్రంలో ఆయన నటన విశేషాదరణ చూరగొంది.
37. ‘టాక్సీ రాముడు’ (1961). భగ్నప్రేమికునిగా యన్టీఆర్ అభినయం భలేగా అలరించింది.
38. ‘గులేబకావళి కథ’ (1962). స్వీయ దర్శకత్వంలో యన్టీఆర్ నటించిన ఈ చిత్రం జానపదాల్లో ఒక బాణీ పలికించింది.
39. ‘గాలిమేడలు’ (1962). యన్టీఆర్ అభినయం కోసమే కొన్నిసార్లు జనం సినిమాలకు పరుగు తీశారు. అలాంటి కోవకు చెందినదీ చిత్రం.
40. ‘భీష్మ’ (1962). నాలుగు పదులు దాటకుండానే కురువృద్ధుడైన భీష్మపితామహునిగా యన్టీఆర్ అలరించిన వైనం అనితరసాధ్యం.
41. ‘గుండమ్మకథ’ (1962). ఇదే కథ తమిళంలో వేరే హీరో నటించగా, పరాజయం పాలయింది. అదే యన్టీఆర్ అభినయంతో ఈ చిత్రం ఘనవిజయం సాధించి,రజతోత్సవం చూసింది.
42. ‘మహామంత్రి తిమ్మరుసు’ (1962). శ్రీకృష్ణదేవరాయలు అంటే ఇలాగే ఉంటాడు అని జనం నిర్ణయానికి వచ్చేలా చేసిన చిత్రమిది.
43. ‘రక్తసంబంధం’ (1962). రీమేక్స్ లోనూ తనదైన బాణీ పలికిస్తూ ఒరిజినల్ ను మరిపించేలా నటించి అలరించారు నందమూరి. రజతోత్సవం చూసింది యన్టీఆర్ అభినయం.
43 ఎ. ‘దక్షయజ్ఞం’ (1962). యన్టీఆర్ తొలిసారి శివుని పాత్ర దరించిన ఈ చిత్రంలో ఆయన అభినయం, రూపం అన్నీజనాన్నిభలేగా ఆకట్టుకున్నాయి.
44. ‘ఆత్మబంధువు’ (1962). అంతకు ముందువచ్చిన ‘రక్తసంబంధం’లో అన్నాచెల్లెళ్లుగా నటించిన యన్టీఆర్,సావిత్రి వెనువెంటనే జంటగా నటించిన ‘ఆత్మబంధువు’ సైతం రజతోత్సవం చూడడం ఆ అభినయమూర్తులకు ప్రేక్షకులు చేసిన పట్టాభిషేకం అని చెప్పక తప్పదు.
45. ‘శ్రీకృష్ణార్జునయుద్ధం’ (1963). యన్టీఆర్ శ్రీకృష్ణుడు, ఏయన్నార్ అర్జునుడు. నటరత్ననటనావైభవం అలరించింది. ఘనవిజయం సాధించింది. ఈ సినిమా తరువాత యన్టీఆర్ తో మళ్ళీ 14 ఏళ్లవరకూ ఏయన్నార్ కలసి నటించలేదు.
46. ‘పెంపుడు కూతురు’ (1963). తొలిసారి కన్నా తరువాతి రోజుల్లో ఎంతగానో అలరించింది. ఇందులో యన్టీఆర్ విలక్షణమైన అభినయం ఆకట్టుకుంటుంది.
47. ‘వాల్మీకి’ (1963). పడచువయసులో మరోమారు ముదుసలిగా నటించి మెప్పించారు యన్టీఆర్.
48. ‘లవకుశ’^(1963). శ్రీరాముడంటే యన్టీఆరే అన్నరీతిలో సాగింది నందమూరి అభినయం. వజ్రోత్సవం చూసిన ఏకైక పౌరాణిక చిత్రం ‘లవకుశ’. ఈ సినిమా ఈ నాటికీ జనాన్ని అలరిస్తూనేఉంది. నటీనటులు అభినయంతో పాటు ఘంటసాల సంగీత వైభవం కూడా ఆకట్టుకుంటుంది.
49. ‘బందిపోటు’ (1963). అంతకు ముందే రాబిన్ హుడ్ తరహా పాత్రలో ‘అగ్గిరాముడు’లో అలరించిన యన్టీఆర్.ఇందులో మరోమారు అదే తీరున మురిపించారు. యన్టీఆర్, బి.విఠలాచార్య కాంబోలో రూపొందిన తొలి చిత్రం. ఆ తరువాత అనేక బ్లాక్ బస్టర్స్ చూశారు వీరిద్దరు.
50. ‘లక్షాధికారి’ (1963). తెలుగునాట తొలి సస్పెన్స్ థ్రిల్లర్. ఇప్పటికీ అలరిస్తుంది.
51. ‘నర్తనశాల’ (1963). మహావీరుడు అర్జునుడు శాపవశాన పేడి బృహన్నలగా మారడం. తరువాత మళ్ళీ వీరోచితంగా పోరాడటం. ఈ రెండు షేడ్స్ లో తనదైన అభినయంతో అలరించిన యన్టీఆర్ నటనావైభవం చూసి తీరవలసిందే!
52. ‘మంచి-చెడు’ (1963). పరిస్థితుల ప్రభావం వల్ల దొంగగా మారిన యువకుడు పరివర్తన చెందిన సమయంలోనే ప్రేయసితో పాటు కనుమూసే విషాదాంత చిత్రం.
53. ‘కర్ణన్’ (1964). తమిళంలో శ్రీకృష్ణునిగా నటించి మెప్పించిన వైనం. ఈ నాటికీ తమిళనాట కూడా శ్రీకృష్ణుడంటే యన్టీఆర్ అనేలా ఆయన అభినయం సాగింది.
54. ‘గుడిగంటలు’ (1964). తమిళ ఒరిజినల్ కన్నా మిన్నగా యన్టీఆర్ నటించి అలరించిన చిత్రం.
55. ‘రాముడు-భీముడు'(1964). యన్టీఆర్ తొలిసారి పూర్తిస్థాయిలో ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం విశేషాదరణ చూరగొనడమే కాదు ‘డ్యుయల్ రోల్స్’లో ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది.
56. ‘శ్రీసత్యనారాయణ మహాత్మ్యం’ (1964). భక్తునిగా, భగవంతునిగా యన్టీఆర్ నటించిన తొలిచిత్రం. ‘రాముడు-భీముడు’ రాగానే వచ్చిన ఈ ద్విపాత్రాభినయ చిత్రం కూడా అలరించింది.
57. ‘అగ్గి-పిడుగు’ (1964). యన్టీఆర్ ద్విపాత్రాభినయంతో రూపొందిన తొలి జానపదం. విశేషాదరణ చూరగొంది. డ్యుయల్ రోల్స్ లో ఏ రీతిన వైవిధ్యం చూపించవచ్చో చూపించి అలరించారు యన్టీఆర్.
58. ‘దాగుడు మూతలు’ (1964). యన్టీఆర్ వైవిధ్యమైన నటనతో ఆదుర్తి సుబ్బారావు తెరకెక్కించిన చిత్రం.
59. ‘బభ్రువాహన’ (1964). ‘నర్తనశాల’ తరువాత అర్జునునిగా నటించి మురిపించిన చిత్రం.
60. ‘మంచి మనిషి’ (1964). ‘ఇంటిగుట్టు’ వంటి యన్టీఆర్ సూపర్ హిట్ తరువాత దాదాపు అదే ప్రధానాంశంతో రూపొందిన ‘మంచిమనిషి’లో రామారావు అభినయం మరింతగా అలరించింది.
61. ‘బొబ్బిలియుద్ధం’ (1964). రంగారావనాయుడుగా యన్టీఆర్ అభినయం ఎంతగానో అలరిస్తుంది.
62. ‘నాదీ ఆడజన్మే’ (1965). కళ కోసం తపించే కళాకారుడులోని అసలైన హృదయం ఎప్పుడు ఎలా ఆవిష్కరించుకుంటుందో వివరించిన నటనావైభవం.
63. ‘పాండవవనవాసము’ (1965). భీమునిగా అనితరసాధ్యమైనరీతిలో సాగిన యన్టీఆర్ అభినయం. రజతోత్సవ విజయం.
64. ‘దొరికితే దొంగలు’ (1965). యన్టీఆర్ తొలి సైంటిఫిక్ ఫిక్షన్.
65. ‘మంగమ్మ శపథం’^(1965). జగమెరిగిన కథలో తండ్రీకొడుకులుగా యన్టీఆర్ వైవిధ్యమైన అభినయం.
66. ‘సత్య హరిశ్చంద్ర’ (1965). అంతకు ముందు హరిశ్చంద్ర పాత్రలో అలరించిన వారిని సైతం మరిపించిన నటరత్న నటన.
67. ‘తోడు-నీడ’ (1965). భార్యావియోగంతో కుమిలి పోయే పాత్రలో యన్టీఆర్ అనితరసాధ్యమైన అభినయం.
68. ‘దేవత’ (1965). దాదాపుగా ‘తోడు-నీడ’ కథలాగే ఉన్నా, ఇందులోనూ వైవిధ్యం చూపించి అలరించిన అభినయరత్న!
69. ‘ఆడబ్రతుకు’ (1965). కళ్ళతో చూసిందే నిజం అని నమ్మి, బాధపడిన భర్త పాత్రలో యన్టీఆర్ అనితరసాధ్యమైన అభినయం. రజతోత్సవ విజయం.
70. ‘శ్రీక్రిష్ణపాండవీయం’ (1966). సవాళ్ళను ఎదుర్కొని నటించడంలో మేటి నటరత్న. సుయోధన పాత్రలో నభూతో నభవిష్యతి అన్న చందాన నటించి మెప్పించిన వైనం, శ్రీకృష్ణ పాత్రలోనూ అలరించిన తీరు తెలుగువారికి మరపురాని అనుభూతి కలిగించింది. దర్శకునిగానూ యన్టీఆర్ మరో మెట్టు ఎక్కి విజయం సాధించడం విశేషం!
71. ‘పల్నాటి యుద్ధం’ (1966). పాత్రకు తగ్గ అభినయాన్ని ప్రదర్శించడంలో యన్టీఆర్ తనకు తానే సాటి అని పలుమార్లు నిరూపించారు. అలాంటిచిత్రాల్లో బ్రహ్మనాయనిగా నటించిన ‘పల్నాటి యుద్ధం’ సైతం మరువరానిది.
72. ‘శ్రీకృష్ణతులాభారం’ (1966). శ్రీకృష్ణుని వైభవాన్ని చూపించిన చిత్రం. కృష్ణ పాత్రలో మరోమారు యన్టీఆర్ జీవించిన వైనం మరపురానిది.
73. ‘గోపాలుడు-భూపాలుడు’ (1967). అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయంతో అలరించిన మరో జానపదం. రెండు పాత్రల్లో నటరత్న కనబరచిన వైవిధ్యం అనితర సాధ్యం.
74. ‘నిర్దోషి’ (1967). ఎదురుగా ప్రేమించిన ప్రేయసికి భర్తగా తానున్నా, తానే అసలైన ప్రియుడిని అని చెప్పుకోలేని పరిస్థితి. ఇలాంటి పాత్రలో తనకు తానే సాటిగా సాగిన యన్టీఆర్ అభినయం.
75. ‘ఉమ్మడి కుటుంబం’ (1967). తన కథతో తెరకెక్కిన చిత్రంలో యన్టీఆర్ నాటకాల పిచ్చితో సాగే పాత్రలో అభినయించిన వైనం విశిష్టమైనది. ‘యముడి’ పాత్రలో తొలిసారి తెరపై ఆకట్టుకున్నారు యన్టీఆర్.
76. ‘భామావిజయం’ (1967). పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం అన్నది యన్టీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య. ఇందులో నిజంగానే మరో పాత్రధారిగా నటించి ఆయన మెప్పించిన తీరు అద్భుతం!
77. ‘నిండుమనసులు’ (1967). పరిస్థితుల ప్రభావం వల్ల దొంగ అయిన వ్యక్తి , ఓ స్త్రీ కారణంగా మారిన వైనాన్ని యన్టీఆర్ ప్రదర్శించిన అభినయాన్ని మరువలేం.
78. ‘శ్రీకృష్ణావతారం’ (1967). పేరుకు తగ్గట్టే శ్రీకృష్ణావతారంలో యన్టీఆర్ తన నటవిశ్వరూపం చూపించారు. రజతోత్సవ విజయం చూసినదీ చిత్రం.
79. ‘తిక్కశంకరయ్య’ (1968). మరోమారు ద్విపాత్రాభినయంలో ఎంతో వైవిధ్యం చూపిస్తూ నటించి అలరించిన యన్టీఆర్.
80. ‘రాము’ (1968). తమిళనాట అంతగా అలరించని కథతో తెలుగులో అందరూ వద్దన్నా యన్టీఆర్ తో ఏవీయమ్ సంస్థ నిర్మించి, బ్లాక్ బస్టర్ చూసిన చిత్రం ‘రాము’. యన్టీఆర్ అభినయమే ప్రధానాంశం.
81. ‘కథానాయకుడు’ (1969). మారువేషాల మాటునే అభినయవైభవం చూపిన వైనం ఆకట్టుకోక మానదు.
82. ‘విచిత్రకుటుంబం’ (1969). కుటుంబ పెద్దగా తమ్ముళ్ళ కోసం ఆరాటపడే అన్నగా యన్టీఆర్ నటన జనం జేజేలు అందుకుంది.
83. ‘భలేతమ్ముడు’ (1969). మరోమారు అన్నదమ్ములుగా యన్టీఆర్ ద్విపాత్రాభినయంలో ప్రదర్శించిన వైవిధ్యం ఆకట్టుకోక మానదు.
84. ‘తల్లా? పెళ్ళామా?’ (1970). టైటిల్ లోనే ప్రశ్నను సంధించి, దర్శకునిగానూ మెప్పిస్తూ నటనతో అలరించిన చిత్రం.
85. ‘కోడలు దిద్దిన కాపురం’ (1970). యన్టీఆర్ కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో ఒకే పాత్రలో ఆయన మూడు రకాలుగా ప్రదర్శించిన నటన అలరించక మానదు.
86. ‘ఒకే కుటుంబం’ (1970). కులమతాలకు అతీతంగా సాగే ఆదర్శ కాలనీలో ఓ ముస్లిమ్ యువకునిగా నటరత్న అభినయం అలరించింది.
87. ‘శ్రీకృష్ణ సత్య’ (1970). శ్రీకృష్ణునిగా మరోమారు తన నటవిశ్వరూపం ప్రదర్శించి, గురువు కేవీ రెడ్డికి దక్షిణగా యన్టీఆర్ సమర్పించిన చిత్రం అలరించక మానదు.
88. ‘కులగౌరవం’ (1972). తొలిసారి తాత, తండ్రి, మనవడుగా అభినయించి అలరించిన తీరు మురిపిస్తుంది.
88ఎ. ‘బడిపంతులు’ (1972). రీమేక్ అయినా తనదైన అభినయంతో చిత్రాన్ని విజయతీరాలకు చేర్చిన నటరత్న.
89. ‘ఆరాధన’ (1976). మూగవాడిగా నందమూరి నటన జనాన్ని మురిపించింది. బ్లాక్ బస్టర్ ను పట్టేసింది.
90. ‘మనుషులంతా ఒక్కటే’ (1976). రెండు తరాలకు చెందిన రెండు పాత్రల్లో యన్టీఆర్ ప్రదర్శించిన వైవిధ్యం ఆకట్టుకోక మానదు.
91. ‘దానవీరశూర కర్ణ’ (1977). అనితరసాధ్యం అన్న అభినయం అన్న ఒక్కమాట చాలు. ఈ సినిమాను చూడవలసిందే కానీ, వివరించ తరం కాదు.
92. ‘అడవిరాముడు’ (1977). తనను తాను కాలానుగుణంగా మార్చుకుంటూ రాణించిన రామారావు ఈ సినిమాతో ఒక్కసారిగా తెలుగు సినిమా గతినే మారుస్తూ అభినయించారు. తెలుగు చలనచిత్ర చరిత్రలో పలు చెరిగిపోని రికార్డులు నెలకొల్పిందీ చిత్రం.
93. ‘యమగోల’ (1977). యన్టీఆర్ వ్యంగ్య నటనావైభవానికి జనం జేజేలు పలికారు. ఈ సినిమాను ఈ నాటికీ సినీజనం అనుకరిస్తూనే ఉండడం గమనార్హం!
94. ‘శ్రీరామపట్టాభిషేకం’ (1978). శ్రీరామ, రావణ పాత్రల్లో వైవిధ్యం ప్రదర్శిస్తూ నటించిన నందమూరి నటనావైవిధ్యం ప్రధానాకర్షణ!
95. ‘సర్దార్ పాపారాయుడు’ (1980). తండ్రీకొడుకులుగా యన్టీఆర్ ద్విపాత్రాభినయంతో ఘనవిజయం సాధించిన చిత్రం. వాచాకాభినయంలో నటరత్న మరోమారు తనదైన బాణీ పలికించిన చిత్రం.
96. ‘కొండవీటి సింహం’ (1981). తండ్రీకొడుకులుగా యన్టీఆర్ అభినయం అఖిలాంధ్ర లోకాన్నీ అలరించింది. మళ్ళీ మళ్ళీజనం చూసేలా చేసింది నటరత్ననటన.
97. ‘జస్టిస్ చౌదరి’ (1982). వరుసగా తండ్రీకొడుకుల పాత్రల్లో నటిస్తూ ఈ సినిమాతో హ్యాట్రిక్ చూశారు యన్టీఆర్.
98. ‘బొబ్బిలిపులి’ (1982). యన్టీఆర్ వాచకాభినయానికి ప్రతీకగా నిలచిన ఈ చిత్రం కనీవినీ ఎరుగని రికార్డులు నెలకొల్పింది.
99. ‘శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’ (1984). డీ గ్లామర్ రోల్ తోనూ బ్లాక్ బస్టర్ సాధించవచ్చునని నిరూపించిన నటరత్న నటనావైభవం.
100. ‘మేజర్ చంద్రకాంత్’ (1993). యన్టీఆర్ చివరగా నటించిన చిత్రం. ఆయన అభినయంతోనే ఈ సినిమా ఘనవిజయం సాధించింది అంటే అతిశయోక్తి కాదు.