ఎందరో దర్శకులకు అభిమాన దర్శకునిగా నిలిచారు మణిరత్నం. ఆయన తెరకెక్కించిన ‘నాయకన్’ చిత్రం ‘టైమ్’ టాప్ హండ్రెడ్ లో చోటు సంపాదించింది. ఇక ఆయన టేకింగ్ స్టైల్ కు ఎంతోమంది సినీజనం ఫిదా అయిపోయారు. మణిరత్నం చిత్రాల జయాపజయాలతో నిమిత్తం లేకుండా ఈ నాటికీ ఎంతోమంది ఆయన సినిమాలను చూస్తున్నారు. అంతటి ఘనత వహించిన మణిరత్నం, గత సంవత్సరం తన ‘పొన్నియిన్ సెల్వన్-1’ విడుదల సమయంలో తమకు ఇంటర్నేషనల్ మార్కెట్ లో రాజమౌళి డోర్స్ తెరిచారని వ్యాఖ్యానించారు. అప్పట్లో కొందరు మణిరత్నం ఫ్యాన్స్ కు ఈ మాటలు బాధ కలిగించాయి. ‘మణిరత్నం ఎక్కడా? రాజమౌళి ఎక్కడా?’ అనీ కొందరు కామెంట్స్ చేశారు. అలా కామెంట్స్ చేసిన వారికి రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’ మూవీ అంతర్జాతీయంగానూ తనదైన బాణీ పలికిస్తూ సమాధానం చెప్పింది. ఆ సంగతి వదిలేస్తే- రాజమౌళి బాటను ఇంకా మణిరత్నం ఫాలో అవుతున్నారనే కొందరు పరిశీలకులు అంటున్నారు.
‘బాహుబలి’ ఛాయల్లోనే తన భారీ చారిత్రక చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’ను రూపొందించారు మణిరత్నం. ఈ సినిమా తెలుగు వర్షన్ అంతగా అలరించలేదు. కానీ తమిళ వర్షన్ ప్రపంచ వ్యాప్తంగా రూ.400 కోట్లు పోగేసింది. ఈ నేపథ్యంలో మణిరత్నం తన ‘పొన్నియిన్ సెల్వన్-2’ చిత్రాన్ని ఏప్రిల్ లో జనం ముందు నిలపడానికి సిద్ధమవుతున్నారు. నిజానికి ఒకప్పుడు దక్షిణాదిన ఓ సెంటిమెంట్ ఉండేది. అదేమిటంటే, సౌత్ లో తీసిన సీక్వెల్స్ ఏవీ అంతగా విజయం సాధించవు అన్నదే ఆ నమ్మకం! కానీ, రాజమౌళి ‘బాహుబలి-2’ చిత్రం ‘బాహుబలి-1’ కంటే భారీ విజయం నమోదు చేసి, ఆ సెంటిమెంట్ ను చెరిపేసింది. అందువల్ల రాజమౌళి ఇచ్చిన స్ఫూర్తితో మణిరత్నం సైతం తన ‘పొన్నియిన్ సెల్వన్-2’పై ఆశలు మెండుగానే పెంచుకున్నారు. అంతేకాదు ‘పొన్నియిన్ సెల్వన్-2’ సినిమాను ‘బాహుబలి-2’ విడుదలైన ఏప్రిల్ 28వ తేదీనే మణిరత్నం కూడా విడుదల చేయడానికి పూనుకోవడం విశేషం! ఆరేళ్ళ క్రితం 2017లో ఏప్రిల్ 28న రిలీజ్ అయిన ‘బాహుబలి-2’ అనూహ్య విజయం సాధించింది. అదే తేదీన విడుదలకు సిద్ధమైన మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్-2’ కూడా గ్రాండ్ సక్సెస్ చూస్తుందేమో అని సినీఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా రూ.400 కోట్లు పోగేసిన ‘పొన్నియిన్ సెల్వన్-1’ సీక్వెల్ గా వస్తోన్న ఈ రెండోభాగానికి తెలుగునాట కొనుగోలుదారులు కరువయ్యారట! కనీసం రాజమౌళిని ఫాలో అవుతున్నందుకైనా ‘పొన్నియిన్ సెల్వన్-2’కు భారీ బిజినెస్ జరుగుతుందేమో చూడాలి.
