విశ్వవిఖ్యాత నటుడు, దర్శకుడు, నిర్మాత చార్లీ చాప్లిన్ జన్మతః క్రిస్టియన్ అయినా, తరువాతి రోజుల్లో ఆయన మతం, వర్ణం అన్నవాటికి దూరంగా ఉన్నారు. మానవత్వమే అసలైన మతం అని తెలుసుకున్నానని తరువాత చెబుతూ వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా చార్లీ చాప్లిన్ అంతటి ప్రాచుర్యం పొందిన నటుడు ఆయన కాలంలో లేరు. ఆ తరువాత కూడా లేరు అంటే అతిశయోక్తి కాదు. తాను యేసు క్రీస్తు కంటే ఖ్యాతి చెందానని ఒకప్పుడు చెప్పుకున్నారు చాప్లిన్. దాంతో ఆయన జన్మించిన ఇంగ్లండ్, తరువాత వలస వెళ్ళిన అమెరికాలోనూ అత్యధిక సంఖ్యలో ఉన్న క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీశారనే చెప్పాలి. అయినప్పటికీ మనసు బాగోలేనప్పుడు ఎంతోమంది చాప్లిన్ సినిమాలనే చూసి, ఆనందించేవారు. అలాంటివారు ఇప్పటికీ ఉన్నారు. ఒకానొక సందర్భంలో చాప్లిన్ అనారోగ్యం పాలయ్యారు. ఆయన భార్యాపిల్లలు ఓ క్రైస్తవ గురువును తీసుకు వచ్చి ప్రార్థన చేయించారు. అప్పుడు ఆ గురువు “యేసు నీతో ఉండును గాక…” అంటూ దీవించారు. అందుకు మంచాన ఉన్నా, చాప్లిన్ తనదైన రీతిలో “యేసు క్రీస్తు అధ్యక్షునిగా ఉన్నట్టయితే, నేను మళ్ళీ వెనక్కి వెళ్ళను. అది నాకు చేదుగా అనిపిస్తుంది” అని సెలవిచ్చారు. అక్కడా తనదైన హాస్యాన్ని చొప్పించారు చాప్లిన్.
అసలు దేవుడు లేడని, అంతా ప్రకృతిలోనే ఉందని తరువాతి రోజుల్లో చాప్లిన్ ప్రగాఢంగా విశ్వసించారు. యేసు క్రీస్తు పాత్రను కూడా ఎవరో సృష్టించారని ప్రఖ్యాత ఆంగ్ల గణితశాస్త్రవేత్త, తాత్వికుడు బెర్ట్రాండ్ రస్సెల్ అన్నారు. ఆ మాటతో చాప్లిన్ తానూ ఏకీభవిస్తాననీ చెప్పారు. మొత్తానికి చాప్లిన్ నటునిగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన తరువాత మతానికి దూరంగానే ఉన్నారు. యేసుక్రీస్తు అనేది కల్పిత పాత్ర అంటూ నమ్మిన చాప్లిన్ ఆశ్చర్యకరంగా 1977 డిసెంబర్ 25న అంటే ఏసుక్రీస్తు జన్మించారని ప్రపంచవ్యాప్తంగా అత్యధిక క్రైస్తవులు విశ్వసించే క్రిస్మస్ రోజున కన్నుమూశారు. ఇప్పటికైనా దేవుడు ఉన్నాడని చార్లీ చాప్లిన్ తెలుసుకొని ఉంటాడని ఆ తరువాత మతవిశ్వాసులు అనేవారు.