తమిళ హీరో విశాల్ కి ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తుందా? అంటే అవుననక తప్పదు. 2017లో వచ్చిన ‘తుప్పరివాలన్’ (డిటెక్టీవ్) తర్వాత హిట్ లేదు. ఆ తర్వాత వచ్చిన ‘విలన్’, ‘ఇరుంబు తిరై’, ‘సండై కోళి2’, ‘అయోగ్య’, ‘యాక్షన్’, ‘చక్ర’, ‘ఎనిమీ’, ‘వీరమే వాగై చూడుమ్’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాల్చీ తన్నేశాయి. ఇవన్నీ తెలుగులో కూడా విడుదలయ్యా. అంతకు ముందు విశాల్ సినిమా అంటే తమిళనాడులోనే కాదు తెలుగునాట కూడా మినిమమ్ గ్యారంటీ ఉండేది. ఇప్పుడు విశాల్ సినిమా కొనాలంటే పారిపోతున్నారు. దాంతో తెలుగునాట కూడా ఏదో విధంగా ఎవరో ఒకరితో కలసి తనే విడుదల చేసుకుంటూ వస్తున్నాడు విశాల్.
ఇక కోలీవుడ్ చిత్ర పరిశ్రమలోని వివాదాల్లో కూడా విశాల్ ఎప్పుడూ హాట్ టాపిక్ నే. ఈ వివాదాలతో విశాల్ సినిమాపై సరైన దృష్టి పెట్టలేకపోతున్నాడని టాక్. ప్రస్తుతం విశాల్ ఫోకస్ మొత్తం రాబోయే సినిమా ‘లాఠీ’పైనే. వరుస డిజాస్టర్స్ ఎదుర్కొంటున్న విశాల్ కి ఈ సినిమా లిట్మస్ టెస్ట్ లాంటిది. తమిళంతో పాటు తెలుగులో కూడా మార్కెట్ పడిపోయిన విశాల్ రొటీన్ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమా తీస్తే ప్రేక్షకులు మరోసారి తిప్పికొట్టడం ఖాయం. ఇటీవల కాలంలో ఎక్కువగా తన సొంత సంస్థలోనే సినిమాలు తీస్తుండటంతో విశాల్ ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయినట్లు కోలీవుడ్ టాక్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగులో ‘లాఠీ ఛార్జ్’గా రానుంది. సునైన హీరోయిన్ గా నటిస్తున్న ఈ యాక్షన్ డ్రామాకు యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ పాన్ ఇండియా సినిమాతో మళ్ళీ బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ కొట్టాలని ట్రై చేస్తున్నాడు.
ఇక క్రమశిక్షణ లేక గతి తప్పిన శరీరాన్ని కూడా కష్టపెట్టి మరీ ఫుల్ ఫిట్ నెస్ తో పీటర్ హెయిన్స్ పీటర్ హెయిన్స్ ఆధ్వర్యంలో యాక్షన్ సీన్స్ చేశాడు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి ఆడియన్స్ ముందుకు రావాలన్నది విశాల్ ఆశ. తెలుగులో సినిమా చేయాలని ఎప్పటినుంచో ట్రై చేస్తున్న విశాల్ కోరిక నెరవేరలేదు. దానికి కారణం కూడా విశాల్ ప్రవర్తనే. నైట్ పార్టీలతో బిజీబిజీగా ఉండే విశాల్ ప్రెస్ మీట్స్ కి కూడా 2,3 గంటలు లేట్ గా వస్తాడన్నది పలు సందర్భాల్లో రుజువు అయింది. ఇప్పుడు ‘తుప్పరివాలన్ 2’తో మెగాఫోన్ కూడా పట్టాడు. ఈ సినిమా కూడా షూటింగ్ లో ఉంది. దీని తర్వాత ‘మార్క్ ఆంటోని’ సినిమా చేస్తున్నాడు. మరి దారి తప్పిన క్రమశిక్షణను కెరీర్ కోసం మళ్ళీ ఆచరణలో పెట్టి మునుపటిలా విశాల్ హిట్స్ తో అలరించాలని కోరుకుందాం.