పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ ‘భీమ్లా నాయక్’.. ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగులతో బిజీగా వున్నాడు. ఈ సినిమాల నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. త్వరలోనే పవన్ – హరీష్ శంకర్ సినిమా కూడా ప్రారంభం కానుంది. ఇప్పటికే వీరిద్దరూ కాంబోలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఎప్పటి నుంచో ఒక ఇండస్ట్రీ హిట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు, హరీష్ శంకర్ ఈ చిత్రం ద్వారా అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని ఘన విజయాన్ని అందించారు.
అయితే, ప్రస్తుతం హరీష్ శంకర్.. పవన్ ను ఎలా చూపించబోతున్నాడని ఆసక్తిని కలిగిస్తోంది. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ పూర్తిగా కమర్షియల్ అంశాలతో రాసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లెక్చరర్‌గా కనిపించనున్నాడట. ‘సంచారి’ గా టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా అప్పట్లోనే వార్తలు వినిపించాయి. ఇదిలావుంటే, తాజాగా పవన్ సరసన నటించబోయే కథానాయిక పేరు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇదివరకు హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘దువ్వాడ జగన్నాథం’.. ‘గద్దలకొండ గణేష్’ సినిమాల్లో నటించిన పూజా హెగ్డే.. పవన్ కళ్యాణ్ జోడిగా నటించబోతోందని ప్రచారం జరుగుతోంది. మరో నాయికగా ప్రియమణి నటించనుందట. మరి దీనిపై చిత్రబృందం ఏమైనా స్పందిస్తారేమో చూడాలి!