Lal Salaam Trailer: విష్ణు విశాల్, విక్రాంత్, జీవితా రాజశేఖర్, కపిల్ దేవ్, సెంథిల్, తంబి రామయ్య, అనంతిక, వివేక్ ప్రసన్న, తంగ దురై ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం లాల్ సలామ్. సూపర్ స్టార్ రజినీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహిస్తుంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘ఊర్లో ఒక్క మగాడు లేడా? ఊర్లో ఉన్నొళ్లందరినీ తీసుకెళ్లి బొక్కలో వేశారు’ అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం అయింది. ఆ తరువాత ఊరి వాతావరణం, క్రికెట్ ఆట, జాతర సీన్లు, రాజకీయంతో ముడిపడ్డ సన్నివేశాలను చూపించారు. ‘మందిని కూడ బెట్టేవాడి కన్నా.. ఎవడి వెనకాల మంది ఉంటారో వాడే చాలా ప్రమాదకరం.. వాడ్ని ప్రాణాలతో వదిల పెట్టకూడదు’ అనే డైలాగ్‌తో రజినీకాంత్ ఎంట్రీ అదిరిపోయింది. ‘బిడ్డ సంపాదిస్తే ఇంటికి గౌరవం.. బిడ్డ సాధిస్తే దేశానికే గౌరవం’, ‘మతాన్ని నమ్మితే మనసులో ఉంచుకో.. మానవత్వాన్ని అందరితో పంచుకో.. ఇండియన్‌గా నేర్చుకోవాల్సింది అదే’ అని తలైవా రజినీకాంత్ చెప్పే డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి.
ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమాలో కథ ఎలా ఉండబోతోందో అర్థం అవుతుంది. ఊరు.. ఊర్లోని రకరకాల మతాలకు చెందిన మనుషులు, రాజకీయ నాయకులు, క్రికెట్, మత ఘర్షణల మధ్య మొయినుద్దీన్ భాయ్ రాక వంటి అంశాలతో పవర్ ఫుల్ ట్రైలర్‌గా నిలిచింది. ఇక ట్రైలర్ చూసాకా అందరికి వస్తున్న ఒకే ఒక్క డౌట్ రజినీకాంత్ వాయిస్. మొదటినుంచి రజినీకి సింగర్ మనోనే డబ్బింగ్ చెప్తూ వస్తున్నాడు. ఆ గొంతునే ప్రేక్షకులకు అలవాటుగా మారింది. అయితే ఈసారి రజినీకి నటుడు సాయి కుమార్ డబ్బింగ్ చెప్పాడు. అది సెట్ అవ్వడం ఏమో కానీ, ట్రైలర్ మొత్తం సాయి కుమార్ ఉన్నట్లే అనిపిస్తుంది. రజినీ కనిపించినా కూడా ఆయన పాత్రలో జీవం లేనట్లు కనిపిస్తుంది. ఇక దీంతో ట్రైలర్ కన్నా ఎక్కువగా రజినీ వాయిస్ గురించే మాట్లాడుకుంటున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.