KV Reddy: తెలుగు సినిమా ఠీవి.. కేవీ రెడ్డి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కే.వి.రెడ్డిగా జనం మదిలో నిలచిన కదిరి వెంకటరెడ్డి తెలుగు సినిమాకు వెలుగులు అద్దిన వారిలో మేటి అనిపించుకున్నారు. దర్శకునిగా, నిర్మాతగా కేవీ రెడ్డి తనదైన బాణీ పలికించారు. ఆయన తెరకెక్కించిన చిత్రాలతో తెలుగు సినిమా పలు రికార్డులు నమోదు చేసుకుంది. ఈ నాటికీ కేవీ రెడ్డి బాణీని అధ్యయనం చేస్తూ దర్శకత్వ శాఖలో అడుగు పెట్టేవారు ఎందరో ఉన్నారు.
కే.వి.రెడ్డి 1912 జూలై 1న అనంతపురం జిల్లా తాడిపత్రిలో జన్మించారు. అక్కడే ఆయన విద్యాభ్యాసం సాగింది. మూలా నారాయణ స్వామి, కేవీ రెడ్డికి మంచి మిత్రుడు. తరువాత కేవీ రెడ్డి మేనమామల ప్రోత్సాహంతో మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజ్ లో మెట్రిక్, డిగ్రీ చదివారు. మిత్రుడు మూలా నారాయణ స్వామి ప్రోత్సాహంతో చిత్రసీమలో అడుగు పెట్టారు. వాహినీ సంస్థ నిర్మించిన చిత్రాలకు ప్రొడక్షన్ ఇన్ ఛార్జిగా పనిచేశారు. అదే సమయంలో చిత్ర నిర్మాణంపై మంచి అవగాహన అలవరచుకున్నారు. కేవీ రెడ్డిని దర్శకునిగా పరిచయం చేస్తూ వాహినీ సంస్థ ‘భక్త పోతన’ నిర్మించింది. ఈ సినిమా ఆ రోజుల్లో విశేషాదరణ చూరగొంది.
Also Read
తొలి చిత్రం ‘భక్త పోతన’లోనే తెలుగు సినిమాకు కావలసిన కొత్త గ్రామర్ ను తీసుకు వచ్చారు కేవీ. ‘గుణసుందరి’లో జానపదాలకు కొత్త బాణీ పలికించారు కేవీ. ఇక ‘పాతాళభైరవి’తో తెలుగు సినిమాకు తొలి స్వర్ణోత్సవం చూపించారు. ఇక ‘మాయాబజార్’తో కేవీ చేసిన సందడిని ఎవరు మాత్రం మరువగలరు? సమాజంలో పెద్దమనుషులుగా చెలామణీ అయ్యేవారి బాగోతం ఎలా ఉంటుందో తన ‘పెద్దమనుషులు’తో చాటింపేశారు కేవీ. అన్నపూర్ణ సంస్థ తొలి చిత్రం ‘దొంగరాముడు’ కూడా కేవీ నిర్దేశకత్వంలోనే రూపొందింది.
కొందరు ఏది చేసినా భలే బాగుంటుంది. మరికొందరు ఎన్ని తీసినా చూడలేం. కేవీ రెడ్డి తీసిన చిత్రాల జయాపజయాలను పక్కకు పెడితే, ఆయన తెరకెక్కించిన సినిమాల్లో అధికశాతం ఆకట్టుకున్నవే! నాటకఫక్కీలో సాగుతున్న తెలుగు సినిమాకు కూడా ఓ సరికొత్త వ్యాకరణం అవసరమని కేవీ భావించారు. అంతకు ముందు మన సినిమాల్లో నాటకఫక్కీనే పలకరించేది. గూడవల్లి, బి.యన్.రెడ్డి వంటివారు కూడా తెలుగు సినిమా గ్రామర్ ను మార్చినవారే! అయితే వారికన్నా మిన్నగా కేవీ రెడ్డి బోధించిన సినిమా వ్యాకరణం జనానికి భలేగా పట్టేసింది. ‘జై పాతాళభైరవీ’ అన్నారు కేవీ. అమ్మవారు, ‘నరుడా ఏమి నీ కోరిక’ అని ప్రశ్నించారు. జనాన్ని మెప్పించే చిత్రాలను తీయాలన్నదే తన అభిలాష అని చెప్పినట్టుంది. అమ్మవారి అనుగ్రహంతో కడదాకా జనం మెచ్చే చిత్రాలనే తెరకెక్కించారు కేవీ. ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’లో ఇద్దరు మేరునగ సమానులైన నటులతో అలరించిన కేవీ రెడ్డి, ఆ తరువాత ఎందుకనో అంతగా ఆకట్టుకోలేక పోయారు.
‘సత్యహరిశ్చంద్ర, ఉమాచండీ గౌరీశంకరుల కథ, భాగ్యచక్రము’ వంటి చిత్రాలు చూసి, ఇవి కేవీ తీసిన సినిమాలేనా అని ఆ రోజుల్లో జనం ఆశ్చర్య పోయారు. అవి కేవీ తీసిన చిత్రాలే, కానీ, వాటిలో ఆయన ఠీవి కనిపించలేదన్నదే అభిమానుల ఆవేదన. కొందరు కేవీ పని అయిపోయిందన్నారు. మరికొందరు ఆయన గత చిత్రరాజాలనే తలచుకొని పులకించిపోయారు. మళ్ళీ ఏ మాయాబజారునో, లేదా ఏ జగదేకవీరుని కథనో వినిపిస్తారని ఆశించారు. అభిమానులు మాత్రం ఏదో ఒక రోజున కేవీ మునుపటి వైభవం చూపిస్తారనే విశ్వసించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ‘శ్రీకృష్ణ సత్య’ను తెరకెక్కించారు కేవీ. మళ్ళీ ఆయన ఠీవి నిలచింది. ‘శ్రీకృష్ణ సత్య’నే ఆయన చివరి చిత్రం. విచిత్రమేంటంటే- ‘మాయాబజార్’తో యన్టీఆర్ ను అపరశ్రీకృష్ణునిగా నిలిపిన కేవీ, ఈ తెరకృష్ణుడు నిర్మించిన ‘శ్రీకృష్ణసత్య’తోనే చిత్ర ప్రయాణం ముగించడం! ఏది ఏమైనా విజయంతో మొదలైన కేవీ సినీయానం సక్సెస్ తోనే ముగియడం అభిమానులకు ఆనందం పంచింది. జానపదాల ప్రసక్తి వచ్చిన ప్రతీసారి కేవీ బాణీ కోసం వెదుక్కోవలసి వస్తుంది. ఈ పరిస్థితి ఈ నాటి సినీజనానికీ తప్పడం లేదు. అందుకే కేవీ రెడ్డి పేరు ఇంకా ఠీవీగానే చిత్రసీమలో నిలచి ఉందని అంటారు! కాదనగలవారెవరు!?
తాజావార్తలు
-
Rahul Gandhi: రాహుల్ గాంధీకి ఊరట.. ఆ కేసులో నిర్దోషిగా ప్రకటించిన కోర్టు
-
Arnab Cyclone Alert: పెనుగండంగా ‘అర్నాబ్’ తుఫాన్.. కుంభవృష్టి వర్షాలు.. ఆ జిల్లాలకు పెను ముప్పు!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Rashtrapati Bhavan: రాష్ట్రపతి భవన్ సమీపంలో అగ్నిప్రమాదం కలకలం.. నార్త్ బ్లాక్‌కు 6 ఫైర్ ఇంజిన్లు!
-
AP Local Elections 2026: జెడ్పీ స్థానాలపై కూటమిలో ఉత్కంఠ.. మరో రెండు కావాలంటూ జనసేన డిమాండ్!
ట్రెండింగ్
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!
-
ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!
-
Harmanpreet Kaur: కెప్టెన్సీ లేకపోతేమి.. బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేయడమే నా లక్ష్యం..! హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు.!
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!