NTV Telugu Site icon

KRISHNA Movie Eenadu: నటశేఖర కృష్ణ ‘ఈనాడు’కు 40 ఏళ్ళు!

Eenadu Movie

Eenadu Movie

Krishna’s movie ‘Eenadu’ completes 40 years: ‘నటశేఖర’గా, ‘సూపర్ స్టార్’గా అభిమానుల మదిలో చోటు సంపాదించిన కృష్ణ నటించిన 200వ చిత్రం ‘ఈనాడు’. మాస్ హీరోగా సాగుతున్న కృష్ణ ఇందులో నాయిక లేకుండా నటించడం అప్పట్లో ఓ సాహసంగా చెప్పుకున్నారు. అదీగాక ఈ చిత్రాన్ని కృష్ణ తమ సొంత ‘పద్మాలయా పిక్చర్స్’ పతాకంపై నిర్మించి, నటించారు. అందువల్ల తొలి నుంచీ ‘ఈనాడు’ పై సినీఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. 1982 డిసెంబర్ 17న విడుదలైన ‘ఈనాడు’ చిత్రం ఘనవిజయం సాధించింది.

‘ఈనాడు’లోకి తొంగిచూస్తే – అన్యాయాలను అక్రమాలను ఎదిరిస్తూ సగటు మనిషి పక్షం నిలచి పోరాడుతూ ఉంటాడు రామరాజు. కార్మిక పక్షం నిలచి వారి నేతగా పెట్టుబడిదారుల అన్యాయాన్ని ఎదిరిస్తూ బడుగుజీవులకు న్యాయం జరిగేలా చేస్తూంటాడు రామరాజు. అతనికి అక్కాబావ ఉంటారు. వారు రామరాజు దూకుడు చూసి భయపడుతూనే ఉంటారు. వారు భావించినట్టుగానే ఓ కార్మికుడిని చంపేసి ఆ నేరాన్ని రామరాజుపై మోపి జైలుకు పంపిస్తారు పెట్టుబడిదారులు. రామరాజు బావ, అతనిపై తప్పుడు సాక్ష్యం చెప్పిన పుల్లయ్య ఇద్దరూ పెట్టుబడిదారుల మోచేతి నీళ్ళు తాగుతూ బాగా సంపాదిస్తారు. జైలు నుండి విడుదలై వచ్చాక కూడా రామరాజు బడుగుల పక్షమే నిలచి పోరాడుతూ ఉంటాడు. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, ఆసుపత్రుల్లోనూ, సాగుతున్న అన్యాయాలను ఎండగడతాడు రామరాజు. బడుగు జీవులకు కులమతాలు అన్నవి లేవని, మనుషులంతా ఒక్కటే అనీ చెబుతూ వారిని ఏకం చేస్తూంటాడు. ఈ విషయాలన్నీ రాజకీయనాయకులకు, బడాబాబులకు కంటకింపుగా ఉంటాయి. దాంతో రామరాజును చంపడానికి పురమాయిస్తారు. అయినా సరే, రాజకీయ నాయకుల అసలు రంగు బయట పెట్టడానికి గళం విప్పుతాడు రామరాజు. అతని పాటకు జనం ఉత్తేజితులవుతారు. అసలు దోషులను చట్టానికి పట్టించి, రామరాజు ప్రాణత్యాగం చేయడంతో కథ ముగుస్తుంది.

ఇందులో జగ్గయ్య, సత్యనారాయణ, రావు గోపాలరావు, గుమ్మడి, కాంతారావు, త్యాగరాజు, చంద్రమోహణ్, శ్రీధర్, సుధాకర్, రాజా, అల్లు రామలింగయ్య, పేకేటి శివరామ్, సాక్షి రంగారావు, పి.యల్.నారాయణ, సారథి, త్యాగరాజు, జమున, రాధిక, కృష్ణకుమారి, శ్యామలగౌరి, గిరిబాబు, గోకిన రామారావు నటించారు.
మళయాళంలో విజయం సాధించిన ‘ఈ నాడు’ ఈ సినిమాకు మాతృక. తెలుగులో పరుచూరి బ్రదర్స్ రచన చేయగా, జె.వి.రాఘవులు సంగీతం సమకూర్చారు. శ్రీశ్రీ, కొసరాజు, గోపి పాటలు పలికించారు. ఈ చిత్రానికి పి.సాంబశివరావు దర్శకత్వం వహించగా, కృష్ణ సోదరులు జి.హనుమంతరావు, ఆదిశేషగిరిరావు నిర్మాణసారథ్యం వహించారు.

ఈ సినిమా ‘రండి కదలిరండి…’ అనే పాటతో మొదలవుతుంది. “నేడే ఈ నాడే ప్రజాయుద్ధ సంరంభం…”, “కానీ సరె కానీ…”, “ఏ వాడా చుక్కమ్మయినా…” అంటూ సాగే పాటలు అలరించాయి. పలు కేంద్రాలలో శతదినోత్సవం చూసిందీ సినిమా. కృష్ణ నూరవ చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’ కాగా, ఆయన రెండువందల సినిమా ‘ఈనాడు’లోనూ రామరాజు పేరుతోనే నటించడం విశేషం! మాతృక మళయాళంలో హీరో పాత్ర ముదుసలిది కాగా, దానిని తెలుగుకు అనువుగా మలిచారు పరుచూరి బ్రదర్స్. ఈ సినిమా విడుదల నాటికి యన్టీఆర్ ‘తెలుగుదేశం’ పార్టీ నెలకొల్పి ఎనిమిదిన్నర నెలలు అయింది. ఈ సినిమా టైటిల్ కార్డ్స్ ప్లే అయ్యే సమయంలో తెలుగుదేశం జెండాలను చూపించడం అప్పట్లో జనాన్ని విశేషంగా ఆకట్టుకుంది.