రెబల్ స్టార్ కృష్ణంరాజు అంటే ఈ తరం వారికి తెలియదు కానీ, ప్రభాస్ పెదనాన్నగా దాదాపు అందరికీ తెలుసు. సుమారు 1966లో ‘చిలకా గోరింక’ అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన, ఎన్నో పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఇప్పుడు ప్రభాస్‌ను రెబల్ స్టార్ అంటున్నాం కానీ, అసలైన ‘రెబల్ స్టార్’ బిరుదు ఆయనదే. ఆయన చేసిన ఎన్నో పాత్రలు తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. అయితే ఆయనకు రెండు పెళ్లిళ్లు జరిగాయి. ప్రస్తుతం ఉన్న భార్య శ్యామల ఆయనకు రెండవ భార్య. వాస్తవానికి ఆయన మొదటి భార్య సీతాదేవి, చెన్నైలో షాపింగ్‌కు వెళ్లి వస్తుండగా కారు ప్రమాదంలో మరణించారు. సీతాదేవి, కృష్ణంరాజు దంపతులకు ఒక మగ బిడ్డ పుట్టినా, అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. ఆ తర్వాత కొంతకాలానికి పెద్దలు మళ్లీ పెళ్లి చేయాలని భావించి శ్యామలా దేవితో సంబంధం కుదిర్చారు.
Also Read: Rashmi Gautam : అడ్డుగా ఉన్నాయని కుక్కలను చంపేస్తారా.. రేపు అమ్మానాన్నలను కూడా అంతేనా?
అయితే వారిద్దరి మధ్య 28 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉందని తాజాగా ఒక ఇంటర్వ్యూలో శ్యామలా దేవి పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. “నాకు కృష్ణంరాజు గారు ముందు నుంచి తెలుసు. ఎంతో మంచి మనిషి, ఎప్పుడూ దానధర్మాలు చేస్తూ ఉంటారని మా ఇంట్లో చెప్పుకునేటప్పుడు వినేదాన్ని. ఆయన భార్య, కొడుకుని పోగొట్టుకుని ఎంతో దుఃఖంలో ఉండేవారు. కృష్ణంరాజు గారి తండ్రి రెండో పెళ్లి చేయాలనుకున్నా ఆయన ముందు ఒప్పుకోలేదు. దీంతో ఆయన తండ్రి రెండు మూడు రోజులు నిరాహారదీక్ష చేస్తే, అప్పుడు పెళ్లికి ఒప్పుకున్నారట. మా బంధువుల ద్వారా నా గురించి తెలిసి నాతో సంబంధం కోసం ప్రయత్నాలు చేశారు. అయితే నాకు అప్పటికే ఆయనకు పెళ్లయిందని, భార్య, కొడుకు చనిపోయారని తెలుసు. ఆయన మంచితనం గురించి ముందే తెలుసు కాబట్టి పెళ్లికి ఒప్పుకున్నాను.
Also Read: Dhandoraa : ఎన్టీఆర్ ట్వీట్‌తో అమెజాన్ ప్రైమ్‌లో దూసుకెళ్తున్న ‘దండోరా’
కానీ మా అమ్మ మాత్రం పెళ్లికి ఒప్పుకోలేదు. రెండో పెళ్లి, ఇప్పుడు పిల్లలు కావాలనుకుంటారో లేదో అని రకరకాల అనుమానాలతో ఈ సంబంధాన్ని ముందు ఇష్టపడలేదు. నేనే నచ్చజెప్పి ఒప్పించాను. అయితే 28 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది కాబట్టి, మా ఇంట్లో వాళ్ళు నన్ను బలవంతంగా ఒప్పించారేమో అని.. నాకు అసలు పెళ్లి ఇష్టమేనా లేదా? అంటూ కృష్ణంరాజు గారు తన కజిన్‌ని నా దగ్గరికి పంపించి వాకబు చేయించారు. నేను ఇష్టప్రకారమే ఒప్పుకున్నాను అని తెలిశాక పెళ్లి జరిగింది. తర్వాత ఎప్పుడూ మా మధ్య ఏజ్ గ్యాప్ గుర్తే రాలేదు. పైపెచ్చు కర్ణాటక లాంటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు.. మా ఇద్దరిదీ లవ్ మ్యారేజ్ ఆ? అని అడిగేవాళ్లు” అంటూ ఆమె కృష్ణంరాజు గారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
