సూపర్ కృష్ణ 80వ పుట్టినరోజు నేడు. గతంలో ఆయన పుట్టినరోజు అంటే అభిమానుల కోలాహలం అంతా ఇంతా కాదు. సహజంగా వేసవి కాలంలో కృష్ణ ఊటీలో ఉండేవారు. తన సినిమాల షూటింగ్స్ ను అక్కడే ప్లాన్ చేసుకునేవారు. దాంతో రాష్ట్రం నలుమూలల ఉండే అభిమానులంతా మే 31వ తేదీకి ఊటికి చేరుకుని కృష్ణ బర్త్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొని వచ్చేవారు.
ఇక కెరీర్ కు ఆయన ఫుల్ స్టాప్ పెట్టి హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడా ఇంటిలో విశ్రాంత జీవితం గడుపుతున్న సందర్భంగా కొన్నేళ్ళుగా బర్త్ డే వేడుకలను అక్కడే జరుపుకుంటున్నారు. కరోనా కారణంగా రెండేళ్ళ పాటు కృష్ణ పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ మామూలు రోజులు రావడంతో ఇవాళ అభిమానులు ఆయన్ని ఇంటిలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అలానే ఫ్యామిలీ గెట్ టూ గెదర్ లోనూ ఆయన పాల్గొన్నారు. కృష్ణ భార్య ఇందిరతో పాటు వారి కుమార్తెలు, చిన్నల్లుడు సుధీర్ బాబు, వారి పిల్లలు, రమేశ్ బాబు పిల్లలు, ఆదిశేషగిరిరావు, హనుమంతరావు పిల్లలు ఈ విందులో పాల్గొన్నారు. మహేశ్ బాబు ఫ్యామిలీ ఫారిన్ టూర్ లో ఉండటంతో ఈ విందులో పాల్గొనలేదు.