కేరళలోని కొచ్చిలో నటి అతుల్య చంద్ర అరెస్టు వ్యవహారంలో రోజుకో మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్ వెలుగుచూస్తోంది. తనను కిడ్నాప్ చేసి రూ.3 కోట్లు డిమాండ్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసి బాధితుడిగా సానుభూతి పొందిన డాక్టర్ జాన్సన్ కె. వర్గీస్.. ఇప్పుడు తానే స్వయంగా ఓ పచ్చి కామాంధుడిగా తేలడంతో ఏకంగా విదేశాలకు పారిపోయినట్లు తెలుస్తోంది. త్రిప్పుణిత్తురకు చెందిన 50 ఏళ్ల మహిళ (నటి అతుల్య బంధువు) ఇచ్చిన లైంగిక దాడి ఫిర్యాదుతో ఇన్ఫోపార్క్ పోలీసులు డాక్టర్ జాన్సన్‌పై శుక్రవారం రేప్ కేసు నమోదు చేశారు. తన బండారం బయటపడి కేసు నమోదు కాగానే ఈ కీచక వైద్యుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతడి కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసి గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఎలాంటి ఫలితం దక్కలేదు. పోలీసులకు చిక్కకుండా అతడు అప్పటికే విదేశాలకు చెక్కేసి ఉంటాడని దర్యాప్తు వర్గాలు గట్టిగా అనుమానిస్తున్నాయి. మరోవైపు డాక్టర్ అకృత్యాలను ఆసరాగా చేసుకుని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన కేసులో అరెస్టయిన నటి అతుల్య చంద్ర (32), నటుడు బిపిన్ పెరుంబిల్లి (42), డ్రైవర్ కె.బి. విష్ణు (31)లను సోమవారం కడవంత్ర పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఈ బ్లాక్ మెయిల్ గ్యాంగ్‌లో ఇంకా ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారు.
వాస్తవానికి, తన బంధువుకు ఆరోగ్యం బాగాలేదని, అత్యవసర చికిత్స కావాలని చెప్పి డాక్టర్‌ను పిలిపించి బంధించారని.. ఆ 50 ఏళ్ల మహిళపై చేసిన అఘాయిత్యాన్ని బయటపెట్టకుండా ఉండేందుకు ఏకంగా రూ.3 కోట్లు డిమాండ్ చేశారంటూ డాక్టర్ గతంలో వీరిపై ఫిర్యాదు చేశాడు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో అత్యంత ఆసక్తికరమైన అంశం డాక్టర్ మొబైల్ ఫోన్! దాడి సమయంలో నిందితులు డాక్టర్ నుంచి లాక్కున్న మొబైల్ ఫోన్.. నేరుగా బాధితురాలైన 50 ఏళ్ల మహిళ చేతికి ఎలా వెళ్లిందన్న దానిపై కడవంత్ర పోలీసులు ఇప్పుడు దృష్టి సారించారు. దీనిపై ఆ మహిళ వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. విశేషమేమిటంటే.. డాక్టర్ ఫోన్లోని అశ్లీల వీడియోలు, ఆధారాలతోనే ఆ మహిళ ఇన్ఫోపార్క్ పోలీసులకు ఫిర్యాదు చేయడం విశేషం. సెలబ్రిటీల హనీట్రాప్, బ్లాక్ మెయిల్ కోణంలో మొదలైన ఈ కేసు.. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసిన డాక్టరే ఒక రేపిస్ట్ అని తేలడం, అతడు పారిపోవడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.

