ఇటీవల మలయాళ నటి గౌరీ కిషన్ ఎదుర్కొన్న బాడీ షేమింగ్ ఘటన సినీ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. ఓ ప్రెస్ మీట్‌లో రిపోర్టర్ చేసిన అసభ్యమైన ప్రశ్నకు గౌరీ ఇచ్చిన కౌంటర్‌కు చాలామంది ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ విషయంలో ఖుష్బూ సుందర్ కూడా గౌరీ కి మద్దతుగా నిలబడి గట్టి స్పందన ఇచ్చారు.
Also Read : Chinmayi : చిన్మయి ఫిర్యాదు పై కేసు నమోదు..
ఖుష్బూ తన ఎక్స్ (Twitter) అకౌంట్‌లో ఇలా రాసింది.. “జర్నలిజం అంటే గౌరవం ఉండే వృత్తి. కానీ ఇప్పుడు కొందరి చేతుల్లో అది పాతాళానికి పోతుంది. ఒక మహిళ ఎంత బరువు ఉందనేది మీ పని కాదు. అది మీకు సంబంధించిన విషయం కాదు. ఒక హీరోయిన్ బరువు గురించి హీరోని అడగడం అంటే ఎంత సిగ్గుచేటో మీకే అర్థం కావాలి. గౌరీ ఇచ్చిన సమాధానం నిజంగా అద్భుతం. ఆమె ధైర్యం అందరికీ పాఠం కావాలి. అమీరే చెప్పండి, ఇలాంటి ప్రశ్న ఒక మహిళా జర్నలిస్టు కుటుంబంలోని మహిళల్ని అడిగితే సరదాగా తీసుకుంటారా? గౌరవం ఎప్పుడూ రెండు దిశలో ఉండాలి. మీరు గౌరవం ఆశిస్తే, ముందు మీరు గౌరవం ఇవ్వడం నేర్చుకోండి” అని ఖుష్బూ మండిపడ్డారు.
అసలు విషయం ఏంటంటే.. గౌరీ కిషన్ నటిస్తున్న కొత్త మలయాళ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో, ఓ సీన్‌లో హీరో ఆదిత్య మాధవన్ ఆమెను ఎత్తుకుని తిప్పే షాట్ ఉంటుంది. అదే విషయాన్ని ప్రెస్ మీట్‌లో రిపోర్టర్ అడుగుతూ “హీరోయిన్ బరువు ఎక్కువగా అనిపించిందా?” అని ప్రశ్నించాడు. ఆదిత్య జిమ్ చేస్తానని, కాబట్టి కష్టం అనిపించలేదని సరదాగా చెప్పాడు. కానీ అక్కడితో ఆగకుండా అదే ప్రశ్నను మరుసటి రోజు మరో ఈవెంట్‌లో మళ్లీ అడిగాడు. దాంతో చిర్రెత్తు కున్న గౌరీ, “నా బరువు తెలుసుకుని నువ్వు ఏం చేయబోతున్నావు? ఇది బాడీ షేమింగ్! నా నటన గురించి, నా పాత్ర గురించి ఒక్క మాట లేదు, బరువు గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. మగ నటుల్ని ఇలా అడగగలరా? ఇది జర్నలిజం కాదు – వృత్తికి అవమానం!” అంటూ రిపోర్టర్‌పై గట్టిగా స్పందించింది. ఆమె సమాధానం నెట్టింట వైరల్ అయ్యింది. చాలా మంది నెటిజన్లు, సెలబ్రిటీలు గౌరీకి సపోర్ట్‌గా నిలబడ్డారు. ఇప్పుడు ఖుష్బూ కూడా ఆమెకు పబ్లిక్‌గా మద్దతు ఇవ్వడంతో ఈ వివాదం మరింత వేడెక్కింది.
