Site icon NTV Telugu

గుడ్ లక్ కీర్తి! ఒకే నెలల రెండు సినిమాలు!!

జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేశ్ ప్రస్తుతం ఉమెన్ సెంట్రిక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే ‘గుడ్ లక్ సఖి’ సినిమాతో ఆమె ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రాబోతోంది. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాలో కీర్తి సురేశ్ గ్రామీణ యువతిగా కనిపించబోతోంది. స్పోర్ట్స్ డ్రామాగా రూపుదిద్దుకున్న ‘గుడ్ లక్ సఖీ’ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు నాగేశ్‌ కుకునూర్‌ తెరకెక్కించారు. ‘దిల్’ రాజు సమర్పణలో సుధీర్ చంద్ర పదిరి దీనిని నిర్మించగా, శ్రావ్య వర్మ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి నవంబర్ 26న విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు తెలిపారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా, చిరంతన్ దాస్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు.

గత యేడాది కీర్తి సురేశ్ నటించిన ‘పెంగ్విన్, మిస్ ఇండియా’ చిత్రాలు ఓటీటీలో విడుదలై ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అలానే ఈ యేడాది థియేటర్లలో విడుదలైన ‘రంగ్ దే’ కూడా కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాలేదు. అయితే, నవంబర్ మొదటి వారం, నాలుగో వారంలో కీర్తి సురేశ్ నటించిన రెండు సినిమాలు వస్తున్నాయి. అందులో మొదటిది రజనీకాంత్ ‘పెద్దన్న’కాగా, రెండోది ఆమె టైటిల్ రోల్ ప్లే చేసిన ‘గుడ్ లక్ సఖీ’. ఈ రెండు సినిమాలతో కీర్తి నటిగా మరింత కీర్తిని పొందుతుందేమో చూడాలి.

Exit mobile version