Dandamudi Box Office: కార్తీక్ రాజు, త్వరిత నగర్ జంటగా దండమూడి బాక్సాఫీస్, సాయి స్రవంతి మూవీస్ బ్యానర్స్ పై కొత్త సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. ఈ మూవీతో అంజీరామ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దీన్ని దండమూడి అవనింద్ర కుమార్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత అవనింద్ర కుమార్ క్లాప్ కొట్టగా, ప్రముఖ గాయకుడు మనో కెమెరా స్విచ్చాన్ చేశారు. ఆకాష్ పూరి గౌరవ దర్శకత్వం వహించారు. ప్రముఖ పాటల రచయిత భాస్కరభట్ల రవికుమార్ స్క్రిప్ట్‌ను అందించారు.
ఈ సందర్భంగా దండమూడి అవనింద్ర కుమార్ మాట్లాడుతూ, ”ఈ సినిమాను హైదరాబాద్, బ్యాంకాక్, పుకెట్ సహా పలు ప్రాంతాల్లో చిత్రీకరించటానికి సన్నాహాలు చేశాం. 35 నుండి 40 రోజుల్లో మూవీ షూటింగ్‌ను పూర్తి చేయాలనేది ప్లాన్. అందరూ మా యూనిట్‌ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం” అని అన్నారు. సాయి స్రవంతి మూవీస్ అధినేత, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గొట్టిపాటి సాయి మాట్లాడుతూ, ”కార్తీక్ రాజు, త్వరిత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రలను ప్రముఖ తారలు చేయబోతున్నారు. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నాం” అని చెప్పారు. హీరో కార్తీక్ రాజు మాట్లాడుతూ, ”నిజ ఘటనల ఆధారంగా రూపొందుతున్న లవ్, యాక్షన్, క్రైమ్ డ్రామా ఇది. అనుదీప్ దేవ్ సంగీతాన్ని అందిస్తున్నారు. కొత్తగా ఉంటుంది. డిఫరెంట్ స్క్రిప్ట్ అని కచ్చితంగా చెప్పగలను. మంచి టీమ్ కుదిరింది. మంచి సినిమాతో మీ ముందుకు వస్తాం” అని అన్నారు. దండమూడి బాక్సాఫీస్ బ్యానర్ లో హీరోయిన్ గా నటించడం ఆనందంగా ఉందని, ఇదో అమేజింగ్ స్క్రిప్ట్ అని హీరోయిన్ త్వరిత నగర్ తెలిపింది.
దర్శకుడు అంజీ రామ్ మాట్లాడుతూ, ”ఈ బ్యానర్ నుండి డైరెక్టర్ గా పరిచయం కావడం సంతోషంగా ఉంది. మంచి నిర్మాతలతో కలిసి పని చేయబోతున్నందుకు గర్వంగా ఉంది. దండమూడి అంటే ఓ బ్రాండ్. దాన్ని నిలబెట్టేలా మా వంతు ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సోషల్ క్రైమ్ ఇష్యూస్ ఆధారంగా రాసుకున్న కథ ఇది. స్క్రిప్ట్ అద్బుతంగా కుదిరింది. ఈ నెల 14 నుంచి సింగిల్ షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేయాలనేది ఆలోచన” అని అన్నారు. అలీ, నందినీరాయ్, భద్రం ఇతర కీలక పాత్రలు పోషించబోతున్న ఈ చిత్రానికి ప్రభోద్ దామెర్ల సంభాషణలు అందిస్తున్నారు.