ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘KGF 2’ ఫీవర్ పట్టుకుంది. ముఖ్యంగా దక్షిణాదిలో ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ మేనియా కొనసాగుతోంది. ఇక రాఖీ భాయ్ గా థియేటర్లలో అలరిస్తున్న యష్ సొంత గడ్డ కర్నాటకలో పరిస్థితి గురించి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఈరోజు ఉదయం నుంచే ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ మూవీని వీక్షించడానికి రాకింగ్ స్టార్ యష్ అభిమానులు థియేటర్‌లకు బారులు తీరుతున్నారు. ప్రస్తుతం థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. అయితే యష్ ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీలకు పని చెప్పక తప్పలేదట.
Read Also : KGF Chapter 2 : బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన మేకర్స్… మరో పార్ట్ లోడింగ్
కర్ణాటకలో గురువారం తెల్లవారుజామున 1 గంటలకు ప్రారంభమైన ఫస్ట్ షో సమయంలో ఫ్యాన్స్ ను నియంత్రించడం పోలీసులకు కష్టమైందట. భారీ సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో అక్కడ అనుకోని పరిణామాలు, తొక్కిసలాటలు జరగకుండా చూడడానికి పోలీసులు పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చిందని సమాచారం. ఉత్తర కర్ణాటక జిల్లాల్లో పోలీసులు ఏకంగా అభిమానులపై లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. ఒకసారి సినిమా చూసిన అభిమానులు మళ్ళీ ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ చూడడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. కర్ణాటకలో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు వేలాది మంది సినీ ప్రేమికులు థియేటర్లకు తరలివస్తున్నారు. కాగా “కేజీఎఫ్-2” కన్నడతో పాటు హిందీ, తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల్లో 12,000 స్క్రీన్లలో విడుదలైంది. ఒక్క కర్ణాటకలోనే 550 థియేటర్లలో సినిమాకు రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో రాకింగ్ స్టార్ యష్‌తో పాటు బాలీవుడ్ స్టార్స్ రవీన్ టాండన్, సంజయ్ దత్, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.