NTV Telugu Site icon

Kangana Ranaut : ఆరేళ్ళకే లైంగిక వేధింపులు… క్వీన్ షాకింగ్ కామెంట్స్

Kangana

Kangana

బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు ‘లాక్ అప్’ అనే షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ షోలో కంటెస్టెంట్స్ తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించి దిగ్భ్రాంతికి గురి చేసే విషయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా జడ్జిమెంట్ డే స్పెషల్‌లో మునావర్ ఫరూఖీ అనే కంటెస్టెంట్ మాట్లాడుతూ “నా దగ్గరి బంధువులు ఇద్దరు నన్ను లైంగికంగా వేధించారు. అదికూడా చిన్నతనంలో… ఆరేళ్ళ వయసు ఉన్నప్పుడు ప్రారంభమైన ఈ దారుణం 11 ఏళ్ళు వచ్చే వరకు సాగింది. అంటే దాదాపుగా ఐదేళ్లు… కానీ చిన్న పిల్లాడిని అవ్వడం వల్ల అసలేం జరుగుతుందో అర్థం చేసుకోలేకపోయాను. ఒకరోజు అతను హద్దు దాటడంతో దీన్ని ఇక్కడే ఆపడం మంచిది అన్పించింది. అయితే ఈ విషయాన్ని అర్థం చేసుకోరని భావించి పెద్దవాళ్లకు చెప్పలేదు” అంటూ చెప్పుకొచ్చారు.

Read Also : Pratik Gandhi : ముంబై పోలీసుల వల్ల అవమానం… నటుడి ఆవేదన

ఈ విషయాన్ని విన్న కంగనా తన జీవితంలో కూడా జరిగిన అలాంటి దారుణమైన సంఘటనను వెల్లడించింది. ప్రతి సంవత్సరం పిల్లలు లైంగిక వేధింపులను ఎదుర్కొంటారని, దానిని హైలైట్ చేయడానికి లేదా చర్చించడానికి ఎప్పుడూ తగిన బహిరంగ వేదిక లభించదు అంటూ చిన్నప్పుడు తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను వెల్లడించింది. కంగనా మాట్లాడుతూ “నేను దాదాపు ఆరేళ్ళ వయసు ఉన్నప్పుడు మా ఊరిలో నాకంటే కొంచెం పెద్దవాడైన ఒక వ్యక్తి నన్ను అభ్యంతరకంగా తాకేవారు. కానీ ఆ సమయంలో అతని ఉద్దేశం నాకు అర్థం కాలేదు. మమ్మల్ని పిలిచి బట్టలు విప్పమని అడిగేవాడు, ఒళ్ళంతా తడిమేవాడు” అంటూ ఎవరూ ఊహించని విషయాన్ని వెల్లడించింది. ఇక మునావర్‌ను అభినందిస్తూ ఈ సమస్య మన సమాజంలో కళంకంలా మారిందని, ఈ కౄరమైన నేరం గురించి అవగాహన కల్పించడానికి ఈ వేదికను మాధ్యమంగా ఉపయోగించినందుకు ఆయనకు కంగనా కృతజ్ఞతలు చెప్పారు.