Kamal Haasan’s movie with CM’s son!
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ కరుణానిధి మనవడు, ప్రస్తుత సీ. ఎం. స్టాలిన్ తనయుడు ఉదయనిధి ఎమ్మెల్యేగా ఉన్నారు. విశేషం ఏమంటే తాతయ్య కరుణానిధి అడుగు జాడల్లో నడుస్తూ చిత్రసీమలో నటుడిగా, నిర్మాతగా కొనసాగుతున్నాడు ఉదయనిధి. అంతేకాదు… రెడ్ జయింట్ మూవీస్ పేరుతో సినిమా నిర్మాణంతో పాటు పంపిణీ రంగంలోనూ తనదైన మార్క్ చూపిస్తున్నాడు. అతను డీఎంకే పార్టీకి చెందిన వాడైనా సినిమా రంగం విషయానికి వచ్చే సరికీ ఉదయనిధి రాజకీయాలను దూరంగానే పెడుతుంటాడు. బీజేపీకి చెందిన ఖుష్బూ భర్త సుందర్ డైరెక్ట్ చేసిన సినిమాలను పంపిణీ చేయడానికి ఉదయనిధి వెనుకాడడు. అలానే కమల్ హాసన్ కు తమిళనాడులో సొంతంగా ఓ పార్టీ ఉంది. అది డీఎంకేతో గత ఎన్నికల్లో ఢీ కొట్టింది. అయినా కమల్ తాజా చిత్రం ‘విక్రమ్’ను ఉదయనిధి స్టాలినే తన రెడ్ జయింట్ మూవీస్ ద్వారా విడుదల చేశాడు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో కమల్ పాత అప్పులన్నీ తీరిపోయాయని అంటున్నారు. ఇదిలా ఉంటే… సోమవారం రాత్రి చెన్నయ్ లో రెడ్ జయింట్ మూవీస్ 15వ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కమల్ హాసన్… తన రాజ్ కుమార్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ లో తీయబోతున్న 54వ చిత్రంలో ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటిస్తాడని ప్రకటించారు. గతంలో కమల్ హాసన్ తో ఉదయనిధి స్టాలిన్ ‘మన్మధన్ అంబు’ మూవీని నిర్మించాడు. అది తెలుగులో ‘మన్మథ బాణం’గా డబ్ అయ్యింది. ఇప్పుడు పుష్కర కాలం తర్వాత ఉదయనిధి హీరోగా కమల్ హాసన్ తన సొంత బ్యానర్ లో సినిమా నిర్మిస్తుండటం విశేషం. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటించాల్సి ఉంది.
