ప్రస్తుతం తెలుగులో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ‘బింబిసార’ ఒకటి. ఫస్ట్ లుక్ విడుదల అయినప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్‌కి మంచి బజ్ వచ్చిపడింది. ఆమధ్య వచ్చిన టీజర్ కారణంగా మరింత క్రేజ్ వచ్చింది. దీంతో, ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఆడియన్స్ వేచి చూస్తున్నారు. నిజానికి.. గతేడాదిలోనే ఈ సినిమా రావాల్సింది కానీ, కొన్ని అనుకోని కారణాల వల్ల ఆలస్యమవుతూ వస్తోంది. ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే మేకర్స్ ట్రైలర్‌ని విడుదల చేశారు.
‘‘మనం ఎక్కడికి వెళ్తున్నాం నాన్న.. ఓ మహా చక్రవర్తి బింబిసారుడు ఏలిన రాజ్యానికి’’ అంటూ మొదలయ్యే ఈ ట్రైలర్.. ఆద్యంతం ఆకట్టుకునే భారీ విజువల్స్, యాక్షన్ ఘట్టాలు, రొమాలు నిక్కబొడుచుకునే డైలాగులతో సాగుతుంది. అక్కడక్కడ గ్రాఫిక్స్ కాస్త నాసిరకంగా అనిపించినా, మిగతా షాట్స్‌లో మాత్రం ఔరా అనిపించేలా ఉంది. కళ్యాణ్ రామ్ అయిన నటవిశ్వరూపం చూపించాడని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఓ నిధి కోసం హీరో, విలన్ మధ్య సాగే పోరాటమే ఈ సినిమా స్టోరీలైన్‌గా అర్థమవుతోంది. ‘మగధీర’ తరహాలోనే టైమ్ ట్రావెల్ నేపథ్యంతో ఈ సినిమా సాగనున్నట్టు తెలుస్తోంది. ఓవరాల్‌గా ట్రైలర్ ఊహించిన దాని కంటే బాగా ఆకట్టుకొని, సినిమాపై మరిన్ని అంచనాల్ని పెంచింది.
వశిష్ట్ అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన కేథరీన్ తెరిసా, సంయుక్త మేనన్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమాని కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఆగస్టు 5వ తేదీన భారీఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
