K. Chakravarthy Special : చక్రవర్తి చెరగని ముద్ర!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చలనచిత్ర సంగీత సామ్రాజ్యంలో పేరుకు తగ్గట్టు చక్రవర్తిలాగానే చరించారు సంగీత దర్శకులు చక్రవర్తి. తెలుగు సినిమా సంగీతాన్ని దాదాపు ఒకటిన్నర దశాబ్దం శాసించారు చక్రవర్తి. ఆ రోజుల్లో ఏవీయమ్ రికార్డింగ్ థియేటర్స్ అన్నిటా చక్రవర్తి సంగీతమే వినిపిస్తూ ఉండేదంటే అతిశయోక్తి కాదు. అగ్రకథానాయకులు మొదలు వర్ధమాన నటుల దాకా అందరి చిత్రాలకు చక్రవర్తి సంగీతమే దన్నుగా నిలిచింది. దాదాపు 800 చిత్రాలకు చక్రవర్తి స్వరకల్పన చేశారు. ఆయన గాత్రం, నటన సైతం పులకింపచేశాయి.
చక్రవర్తి అసలు పేరు కొమ్మినేని అప్పారావు. 1936 సెప్టెంబర్ 8న గుంటూరు జిల్లా పొన్నేకల్లులో ఆయన జన్మించారు. ప్రముఖ దర్శకుడు కొమ్మినేని శేషగిరిరావు ఈయన సోదరుడే. అన్నదమ్ములిద్దరూ బాల్యం నుంచీ నాటకాలు ఆడేవారు. ఆ రోజుల్లో హార్మోనియం మీద మంచి పట్టు సాధించారు చక్రవర్తి. తన మిత్రులతో కలసి నాటకాలు వేసే రోజుల్లో కింద కూర్చుని నాటకానికి తగ్గట్టుగా హార్మోనియంపై వేళ్ళు కదిలించేవారు. ఆయన సైతం పలు నాటకాల్లో నటించారు. అసలు నటుడు కావాలనే చక్రవర్తి చెన్నపట్టణం చేరారు. అయితే అనుకున్నదొక్కటి అయినది ఒక్కటీ అన్నట్టు చక్రవర్తికి నటునిగా అవకాశాలేవీ లభించలేదు. దాంతో కొన్ని అనువాద చిత్రాలకు గాత్రదానం చేశారు. కొన్ని డబ్బింగ్ చిత్రాలకు రీ-రికార్డింగ్ లో పనిచేశారు. పలువురు సంగీత దర్శకుల వద్ద హార్మోనియం కూడా వాయించారు. మిత్రుల సలహా మేరకు సంగీత దర్శకునిగా మారారు. ‘చక్రవర్తి’ అని ఆయనకు నామకరణం చేసిందీ మిత్రులే. 1970లో ‘మూగప్రేమ’ చిత్రంతో తొలిసారి చక్రవర్తి పేరుతో సంగీత దర్శకునిగా పరిచయమయ్యారు.
Also Read
- Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
- Nani: మా డైరెక్టర్ ఎవరినీ కొట్టలేదు.. నాని కీలక వ్యాఖ్యలు
- The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!
- Hanuman Ansh: త్రివిక్రమ్ చేతుల మీదుగా తెలుగులోకి 'హనుమాన్ అంశ్' - సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
చక్రవర్తికి మంచి గుర్తింపు సంపాదించి పెట్టిన చిత్రం కె.విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘శారద’ . ఈ చిత్రంలోని పాటలు జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి. తరువాత ప్రముఖ దర్శకనిర్మాత కె.ఎస్.ప్రకాశరావు (కె.రాఘవేంద్రరావు తండ్రి) చక్రవర్తిని ప్రోత్సహించారు. తాను తీసిన ‘ఇదాలోకం’ చిత్రానికి చక్రవర్తితోనే స్వరకల్పన చేయించారు. ఇందులోని పాటలూ భలేగా అలరించాయి. ఆ తరువాత పలు చిత్రాలకు స్వరాలు సమకూర్చినా అంతగా పేరు రాలేదు. కె.రాఘవేంద్రరావు తొలి చిత్రం ‘బాబు’ కు కూడా చక్రవర్తి బాణీలు కట్టారు. అందులోని పాటలు మాస్ ను అలరించాయి. అదే సమయంలో కె.ఎస్.ప్రకాశరావు తెరకెక్కించిన ‘చీకటివెలుగులు’ లోనూ చక్రవర్తి స్వరాలు మంచి ఆదరణ పొందాయి. ఇక యన్టీఆర్ ‘అన్నదమ్ముల అనుబంధం’ చిత్రం ‘యాదోంకీ బారాత్’ హిందీ సినిమాకు రీమేక్. అందులో మాతృకను అనుసరిస్తూనే, తనదైన బాణీ పలికించారు చక్రవర్తి. ఆ పాటలు విశేషాదరణ చూరగొన్నాయి. దర్శకులు దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు చక్రవర్తిని బాగా ప్రోత్సహించారు. ఇక యన్టీఆర్ కూడా తన చిత్రాలకు చక్రవర్తి పేరును సిఫార్సు చేసేవారు. యన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘యమగోల’ అనూహ్య విజయం సాధించింది. ఆ సినిమాకు చక్రవర్తి సమకూర్చిన బాణీలు జనాన్ని కుర్చీలలో కుదురుగా కూర్చోనివ్వకుండా చేశాయి. దాంతో చక్రవర్తి సంగీతానికి క్రేజ్ పెరిగింది.
ప్రతి యేడాది 60 నుండి 75 శాతం తెలుగు చిత్రాలకు చక్రవర్తి సంగీతమే పెద్ద ఎస్సెట్ గా నిలిచింది. ఆయన స్వరకల్పన చేసిన వందలాది చిత్రాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. ఆ రోజుల్లో రికార్డుల అమ్మకాల్లోనూ చక్రవర్తి సినిమాలు పలు రికార్డులు క్రియేట్ చేశాయి. నాలుగు తరాల స్టార్ హీరోస్ చిత్రాలను చక్రవర్తి బాణీలు మ్యూజికల్ హిట్స్ గా నిలిపాయి. ఆయన తరువాత తెలుగునాట ఆ స్థాయిలో అలరించిన సంగీత దర్శకుడు మరొకరు కానరారు. తనకు సంగీతపరిజ్ఞానం లేదంటూనే తెలుగు సినిమా సంగీతాన్ని శాసించారు చక్రవర్తి. ఆయన వద్ద అసోసియేట్స్ గా పనిచేసిన వారెందరో తరువాతి కాలంలో అగ్రసంగీత దర్శకులుగా పేరు సంపాదించారు.
నటుడు కావాలని మదరాసు చేరిన చక్రవర్తి తాను ఎంత బిజీగా ఉన్నా అడపా దడపా తెరపై కనిపించేవారు. యన్టీఆర్ ‘గజదొంగ’లో కాసేపు పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో కనిపించి అలరించారు. ఆ తరువాత ‘పక్కింటి అమ్మాయి’లో కామెడీతో కడుపుబ్బ నవ్వించారు. చక్రవర్తి సంగీతానికి క్రేజ్ తగ్గి, కొత్త తరం మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తున్న రోజుల్లోనే ఆయన నటనలోకి దిగారు. ఆయన స్వరకల్పనలో రూపొందిన చివరి చిత్రం ‘అమ్మోరు’. ఆ తరువాత పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు చక్రవర్తి. చివరి సారిగా ‘నిన్నే ప్రేమిస్తా’ చిత్రంలో చక్రవర్తి తెరపై కనిపించారు. తొలి రోజుల్లో అనువాద కళాకారునిగా, గాయకునిగా, తరువాత నటునిగా సాగిన చక్రవర్తి సంగీత దర్శకునిగానే సుప్రసిద్ధులు. ఆయన పేరు వినగానే ఈ నాటికీ నాటి అభిమానులకు చక్రవర్తి స్వరకల్పనలో రూపొందిన పాటలు గుర్తుకు వస్తూనే ఉంటాయి. ఆ నాటి టాప్ హీరోస్ అందరి అభిమానులు చక్రవర్తి సంగీతాన్ని అభిమానించారు. చక్రవర్తి సంగీతం ఉంటే చాలు తమ హీరో సినిమాలు భలేగా ఆడతాయనే నమ్మకంతో ఉండేవారు ఫ్యాన్స్. వారి అంచనాలను ఏ నాడూ వమ్ముచేయకుండానే చక్రవర్తి అందరు హీరోల సినిమాలకు వినసొంపైన సంగీతం సమకూర్చారు. 2002 ఫిబ్రవరి 3న చక్రవర్తి తుదిశ్వాస విడిచారు. ఈ నాటికీ చక్రవర్తి సినీఫ్యాన్స్ మదిలో చెరగని ముద్ర వేసుకొనే ఉన్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?