ఇప్పటికే మన స్టార్ హీరోలకు కావాల్సినన్ని కార్లు గ్యారేజ్ లో వున్నా, మార్కెట్ లో మరో మోడల్స్ మన హీరోలకు నచ్చితే వారి గ్యారేజ్ లో చేరాల్సిందే.. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మోజు పడి తీసుకున్న కారు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక ఆ కారు ఫీచర్లు కూడా అదరగొట్టేశాయి. ‘లాంబోర్గిన ఉరస్ గ్రాఫిటే క్యాప్సుల్’ మోడల్ కారు ఇప్పుడు కేవలం ఎన్టీఆర్ దగ్గర మాత్రమే వుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ గ్యారేజ్ లో ఉన్న ఈ కారు త్వరలోనే హైదరాబాద్ రోడ్ల మీద షికారు చెయ్యబోతుంది. కాగా, గతంలోనూ హార్లీ డేవిడ్సన్ బైక్ కొన్న ఫస్ట్ హీరోగా ఎన్టీఆర్ నిలిచారు.
ఇక తారక్ కారు ప్రత్యేకతలను గనుక ఓసారి చూస్తే.. అత్యాధునిక ఫీచర్లతో అత్యంత అద్భుతంగా డిజైన్ చేశారు. ఫుల్ ఆటోమేటేడ్ టెక్నాలజీతో కూడిన ఈ కారు విలువ రూ.3.16 కోట్లు. కారు పూర్తి బుల్లెట్ ఫ్రూవ్ కాగా.. 200 స్పీడులో వెళుతున్న ఎలాంటి కుదుపులు లాంటివి ఉండవట. ప్రస్తుతం ఈ లగ్జరీ కారును ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.
ఇదిలావుంటే, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కార్లకు భారీ టాక్స్ చెల్లించాల్సి రావడంతో సినీ తారలు టాక్స్ మినహాయింపులు కోరుతున్న సంగతి తెలిసిందే. గతంలో కోలీవుడ్ స్టార్ హీరోలు అయిన విజయ్ దళపతి, ధనుష్ టాక్స్ మినహాయింపు కోరుతూ కోర్టు చేత మొట్టికాయలు తిన్నారు. సెలబ్రిటీస్ అయివుండి టాక్స్ రద్దు కోరడం కోర్టు తప్పుబట్టింది. అంతేకాదు, చెల్లించటం ఆలస్యమైన కారణంగానూ భారీ జరిమానా విధించారు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ తీసుకున్న కారు సైతం విదేశాల నుంచి వచ్చినదే కాబట్టి.. తారక్ ఏంచేస్తారనేది చూడాలి. ఈ కారు విలువ కూడా భారీగానే ఉండటంలో టాక్స్ కూడా బాగానే చెల్లించాల్సి ఉంటుంది.
ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. ‘ఆర్ఆర్‌ఆర్’ షూటింగ్‌ని పూర్తి చేసుకున్నారు. ఉక్రెయిన్ లో జరిగిన చివరి షెడ్యూల్ పూర్తికావడంతో ఎన్టీఆర్ హైదరాబాద్ లో ప్రత్యక్షమైయ్యారు. త్వరలోనే ఆయన కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోతున్న చిత్రం ప్రారంభించనున్నారు. దీంతోపాటు ఆయన టీవీ హోస్ట్ గా చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోగ్రామ్ ఈ నెల 22న ప్రసారం కాబోతుంది.