(ఏప్రిల్ 11తో జూ.యన్టీఆర్ కెరీర్ కు 25 ఏళ్ళు)
నందమూరి నటవంశంలో మూడోతరం స్టార్ హీరోగా జేజేలు అందుకుంటున్నారు యంగ్ టైగర్ యన్.టి.ఆర్. రాజమౌళి తాజా చిత్రం `ఆర్.ఆర్.ఆర్.`లో నటనాపరంగా అధిక మార్కులు పోగేసుకున్నది యన్టీఆర్ అని జనం ముక్తకంఠంతో ఘోషిస్తున్నారు. కొమురం భీమ్ పాత్రలో జీవించిన యంగ్ టైగర్ ఈ యేడాది ఏప్రిల్ 11తో నటునిగా పాతికేళ్ళు పూర్తి చేసుకుంటున్నారు. ఆ మాటకొస్తే మరింత పసివయసులోనే తాత నటరత్న యన్టీఆర్ తెరకెక్కించిన హిందీ `బ్రహ్మర్షి విశ్వామిత్ర`లో బాల భరతునిగానూ నటించారు ఈ బుల్లి రామయ్య. కానీ, యంగ్ టైగర్ కథానాయకునిగా రూపొందిన తొలి చిత్రం ఎమ్మెస్ రెడ్డి నిర్మించగా, గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన `రామాయణం` అనే చెప్పాలి. ఈ సినిమా 1997 ఏప్రిల్ 11న జనం ముందు నిలిచింది. ప్రేక్షకుల మదిని దోచింది. ఈ సినిమాలో అందరూ బాలలే నటించడం విశేషం! రాజమండ్రి – ఊర్వశిలో ఈ సినిమా నేరుగా శతదినోత్సవం జరుపుకోవడం విశేషం. ఈ సినిమాకు జాతీయ స్థాయిలో ఉత్తమ బాలల చిత్రంగా అవార్డు లభించింది. ఇందులో శ్రీరాముని పాత్రలో యన్టీఆర్ పిన్నవయసులోనే అద్భుతంగా నటించి జనాబిమానం సంపాదించారు. ఈ చిత్రం తరువాత పి.యన్.రామచంద్రరావు దర్శకత్వంలో `భక్త మార్కండేయ` అనే టీవీ సీరియల్ లోనూ టైటిల్ రోల్ పోషించి మెప్పించారు జూనియర్ యన్టీఆర్. వెండితెరపై స్టార్ అయిన తరువాత కూడా బుల్లితెరపై `బిగ్ బాస్` హోస్ట్ గా అలరించారు.
యంగ్ టైగర్ ఎనర్జీ!
చిత్రసీమలో అడుగుపెట్టక ముందే జూనియర్ యన్టీఆర్ నర్తకునిగా ఓ రికార్డు నెలకొల్పారు. చిన్నప్పటి నుంచీ శాస్త్రీయ నృత్యంలో శిక్షణ పొందిన యన్టీఆర్, 1994లో నాన్ స్టాప్ 12 గంటల పాటు రవీంద్ర భారతిలో నృత్యం చేసి, ఆ రోజుల్లో రికార్డు సృష్టించారు. నందమూరి తారక రామారావు నృత్య ప్రదర్శనను ఆ రోజుల్లో ఎందరో శ్లాఘించారు. ఆ తరువాతనే ఎమ్మెస్ రెడ్డి తన `రామాయణం` చిత్రంలో శ్రీరాముని పాత్రకు ఇతనొక్కడే న్యాయం చేయగలడని భావించి, తన చి్త్ర కథానాయకునిగా ఎంచుకున్నారు.
తొలుత యన్టీఆర్ పౌరాణిక పాత్రల్లోనే కనిపించడం ద్వారా, ఆయన నటించిన సాంఘిక చిత్రం చూడాలని అభిమానులు ఆశగా ఎదురుచూశారు. తన 18వ ఏట `నిన్నుచూడాలని` అనే చిత్రంతో హీరోగా జనం ముందు నిలిచారు. అభిమానుల మదిని గెలిచినా, ఆ చిత్రం అంతగా అలరించలేకపోయింది. తరువాత వచ్చిన `స్టూడెంట్ నంబర్ వన్` సినిమాతోనే యంగ్ టైగర్ కు సాలిడ్ హిట్ లభించింది. ఇదే చిత్రం ద్వారా రాజమౌళి దర్శకునిగా పరిచయం కావడం విశేషం! ఇక మరో దర్శకుడు వి.వి.వినాయక్ తొలి చిత్రం `ఆది`లోనూ యన్టీఆరే కథానాయకుడు. ఆ సినిమా మరింత ఘనవిజయం సాధించింది. ఈ రెండు సినిమాల విజయంతో యంగ్ టైగర్ కు మాస్ హీరోగా అనూహ్యమైన ఇమేజ్ లభించింది. `అల్లరి రాముడు`లో చలాకీగా నటించేసి, `నాగ`లో స్టూడెంట్ లీడర్ గా మెప్పించేసి ఆ పై `సింహాద్రి`గా యంగ్ టైగర్ ఆకట్టుకున్న తీరు మరపురానిది. `సింహాద్రి` చిత్రం 2003లో విడుదలైన బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలచింది. అంతేకాదు, తెలుగునాట అత్యధిక కేంద్రాలలో రజతోత్సవం చూసిన సినిమాగా ఓ చరిత్ర సృష్టించింది. ఇప్పటికీ ఈ రికార్డు చెక్కుచెదరక నిలచే ఉంది. ఇక `యమదొంగ`లో తాతను పదే పదే గుర్తుకు తెచ్చారు. ఆ సినిమాలో వాచకంలోనూ భళా అనిపించారు యంగ్ టైగర్.
మరపురాని అభినయం…
ఇప్పటి దాకా యన్టీఆర్ నటించిన చిత్రాలలో “సాంబ, రాఖీ, అదుర్స్, బృందావనం,టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత“ వంటివి జనాన్ని ఆకట్టుకోవడమే కాదు, సదరు చిత్రాలలో యన్టీఆర్ అభినయం కూడా ప్రేక్షకులను ఎంతగానో మురిపించింది. బహుపాత్ర పోషణలో నందమూరి వంశానికి తిరుగులేని ఇమేజ్ ఉంది. అదే తీరున `అదుర్స్`లో ద్విపాత్రాభినయంతోనూ, `జై లవకుశ`లో త్రిపాత్రాభినయంతోనూ జూనియర్ అలరించిన తీరును ఎవరూ మరచిపోలేరు. యాక్షన్ ఎపిసోడ్స్ లో జనాన్ని కట్టిపడేసేలా ఫైట్స్ చేసే యన్టీఆర్, కామెడీ, ట్రాజెడీలను కూడా అవలీలగా పోషింపగలనని పలుమార్లు నిరూపించుకున్నారు. ఇక స్వతహాగా నృత్యంలో ఆరితేరిన యన్టీఆర్ పాటల్లో అతిసులువుగా ఎంతటి క్లిష్టమైన బిట్స్ నైనా చేసి చూపించేసి అభిమానుల జేజేలు అందుకుంటూనే ఉన్నారు. యన్టీఆర్ డాన్స్ ను సాటి హీరోలు సైతం అభిమానించడం గమనార్హం! ఇప్పటి దాకా యన్టీఆర్ నటించిన అనేక చిత్రాలు హిందీలో అనువాదమై అలరించాయి. ఆయన తొలిసారి నటించిన పాన్ ఇండియా మూవీ `ఆర్.ఆర్.ఆర్.` ఉత్తరాదివారిని సైతం తన అభినయంతో ఆకట్టుకోగలిగారు యన్టీఆర్.
గానంతోనూ…
యంగ్ టైగర్ నటన, నర్తనంతో ఆకట్టుకోవడమే కాదు, గాయకునిగానూ మురిపించారు. `యమదొంగ` చిత్రంలో తొలిసారి “ఓలమ్మి తిక్కరేగిందా…“ పాట పాడి ఆకట్టుకున్నారు. ఆ తరువాత `కంత్రి`లో `వన్ టూ త్రీ…నేనో కంత్రి…` పాటనూ ప్రొఫెషనల్ లాగా పాడి అలరించారు. `అదుర్స్`లో “చారి…“ పాటలో యన్టీఆర్ గళ విన్యాసాలను ఎవరూ మరచిపోలేరు. `ఊసరవెల్లి`లో “శ్రీ ఆంజనేయం…“ అంటూ సాగే పాటను, `నాన్నకు ప్రేమతో`లో “ఫాలో ఫాలో…“ పాటనూ పాడి మురిపించారు. తన మాతృమూర్తి శాలిని మాతృభాష కన్నడ. అందువల్ల కన్నడలోనూ ఆయనను పాట పాడమని రాజ్ కుమార్ తనయుడు పునీత్ రాజ్ కుమార్ కోరగానే అతను హీరోగా నటించిన `చక్రవ్యూహ` కన్నడ సినిమాలో “గెలెయా… గెలెయా…“ అనే కన్నడ పాటనూ పాడి కన్నడిగులను ఎంతగానో అలరించారు.
అనేక చిత్రాలలో జనం మెచ్చేలా నటించిన యన్టీఆర్ కు 2016 వరకు ఉత్తమనటునిగా నంది అవార్డు లభించక పోవడంపై ఆయన అభిమానులు తరచూ ఆవేదన వ్యక్తంచేసేవారు. 2016లో యన్టీఆర్ నటించిన `నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్` చిత్రాలు ఆయనను ఉత్తమ నటునిగా నిలిపాయి. భవిష్యత్ లో తమ హీరో మరిన్ని ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకుంటారని అభిమానులు ఆశిస్తున్నారు. పాతికేళ్ళ కెరీర్ లో దాదాపు 30 చిత్రాలలో కనిపించిన యన్టీఆర్, భవిష్యత్ లో మరిన్ని మంచి చిత్రాలతో ప్రేక్షకులను మురిపిస్తారని అభిలసిస్తున్నారు.
పాలిటిక్స్ లో…
తాత యన్టీఆర్, మేనమామ చంద్రబాబు, తండ్రి హరికృష్ణ, బాబాయ్ బాలకృష్ణ, బావ లోకేశ్, మేనత్త పురందరేశ్వరి, మరో మేనమామ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇలా అందరూ రాజకీయాల్లో రాణించారు. తాతయ్య స్ఫూర్తితోనే 2009లో యన్టీఆర్ `తెలుగుదేశం` పార్టీ తరపున ప్రచారం చేసి వస్తూ ఉండగా ప్రమాదానికి గురయ్యారు. ఆ తరువాత నుంచీ జూనియర్ యన్టీఆర్
రాజకీయాల్లోకి రావాలని అభిమానులు ఆశిస్తూనే ఉన్నారు. ఆయన ద్వారా తెలుగుదేశం సీట్లు సంపాదించి, ఎమ్మెల్యేలుగా మారిన కొందరు ప్రస్తుతం పార్టీని వీడినా, తాను మాత్రం ప్రాణమున్నంత వరకూ తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని యన్టీఆర్ ఓ సందర్భంలో చెప్పారు. అందువల్ల తెలుగుదేశంకు పూర్వ వైభవం రావాలంటే యన్టీఆర్ రాజకీయ ప్రవేశం చేయాలని ఎంతోమంది అభిలషిస్తున్నారు. మరి సినిమాలతో అభిమానులను అలరిస్తున్న యన్టీఆర్, భవిష్యత్ లో ఏదో ఒక రోజు ఫ్యాన్స్ కోరిక మన్నిస్తూ రాజకీయాల్లో అడుగు పెడతారేమో చూడాలి!