పట్టువదలని విక్రమార్కులు ఎక్కడైనా కొందరుంటారు. పరాజయం పలకరించినా, అదరక బెదరక ప్రయత్నం మాత్రం వీడరు. నటుడు, నిర్మాత, కథకుడు అయిన జాన్ అబ్రహామ్ ను ఆ కోవలోని వాడే అని భావించవచ్చు. ఏప్రిల్ 1న జాన్ హీరోగా నటించి, కథ అందించిన ‘ఎటాక్ పార్ట్ 1’ మూవీ జనం ముందు నిలచింది. ఏ మాత్రం జనాన్ని ఆకట్టుకోలేక పోయింది. ఓ మాటలో చెప్పాలంటే అట్టర్ ఫ్లాప్ గా మిగిలింది. అయితే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దాంతో ముందుగానే భావించినట్టు ‘ఎటాక్ పార్ట్ 2’ను తీసే యోచనలోనే ఉన్నారు నిర్మాతలు, దర్శకుడు. వారికి కథకునిగా, నటునిగా జాన్ అబ్రహామ్ ప్రోత్సాహమిస్తున్నాడు. రాబోయే ‘ఎటాక్’ రెండో భాగాన్ని భారీగా నిర్మించి, జనం ముందు నిలిపితే ఆకట్టుకుంటుందని జాన్ అంటున్నారు. అందులో భాగంగా ‘ఎటాక్-2’లో యాక్షన్ హీరోస్ హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటిస్తే మరింత మేలనీ జాన్ భావిస్తున్నాడు.
గతంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలసి నటించిన ‘వార్’ చిత్రంలో నటించారు. ఆ సినిమా కథ, కథనం ఎలా ఉన్నా, వారిద్దరి కోసం జనం ఆ మూవీని విజయపథంలో నడిపించారు. ముఖ్యంగా వారిద్దరూ ‘వార్’లో చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ జనాన్ని కట్టిపడేశాయని విమర్శకులు సైతం అంగీకరించారు. అందువల్ల హృతిక్, టైగర్ తమ ‘ఎటాక్ పార్ట్ 2’లో నటిస్తే ఆ సినిమాకే వన్నె వస్తుందని జాన్ ఆశిస్తున్నాడు. నిర్మాతల్లో ఒకరైన జయంతీలాల్ గడా కూడా అందుకు సుముఖంగా ఉన్నారని జాన్ అంటున్నాడు. మరి హృతిక్, టైగర్ ఏమంటారో చూడాలి!