Jogi Naidu: యాంకర్ ఝాన్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె తెలియని వారు టాలీవుడ్ లో లేరు. యాంకర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఝాన్సీ ప్రస్తుతం నటిగా కొనసాగుతోంది. మంచి సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటుంది. అయితే ఝాన్సీ భర్త జోగినాయుడు అని చాలా తక్కువ మందికి తెలుసు. జోగి బ్రదర్స్ గా గుర్తింపు తెచ్చుకున్న అన్నదమ్ములో జోగి నాయుడు చిన్నవాడు. స్వామిరారా, కుమారి 21 ఎఫ్, కార్తికేయలాంటి సినిమాలతో జోగి నాయుడు మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన ఏపీ క్రియేటివ్ అండ్ కల్చర్ కమీషన్ క్రియేటివ్ హెడ్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇక తాజాగా ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన వ్యక్తిగత విషయాలను బయటపెట్టాడు. ఝాన్సీతో పరిచయం దగ్గరనుంచి విడిపోయి ఆయన రెండో పెళ్లి చేసుకొనేవరకు మొత్తం ఏకరువు పెట్టాడు.
“నేను, ఝాన్సీ 1995 లో కలుసుకున్నాం. అప్పుడామె ఇంటర్ చదువుతుంది. నేనేమో జీకే మోహన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్నాను. తను ఆయన డైరెక్షన్ లో సినిమా చేసింది. అప్పటి నుంచి మా పరిచయం త్వరగానే ప్రేమగా మారింది. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా.. ఆమె యాంకర్ గా ప్రయత్నాలు చేస్తూ ఉండేవాళ్ళం.. అలా ఇద్దరం ఎదిగాం. 9 ఏళ్ళు చూస్తూనే గడిచిపోయాయి. ఇద్దరం కలిసే ఉండేవాళ్ళం.. కానీ పెళ్లయ్యాక మాత్రం ఏడాది కూడా కలిసి ఉండలేకపోయాం. అప్పటికే మాకు ధన్య అనే పాప ఉంది. ఆమెను చూడడానికి నేను పడిన కష్టం మామూలుదికాదు. తనని వదలలేక నేను ఎంతో సతమతమయ్యేవాడిని. మమ్మల్ని కలపడానికి చిరంజీవి గారు, బ్రహ్మానందం గారు చాలా ప్రయత్నించారు. గంటలు గంటలు మాట్లాడి కలిసి మోటివేట్ చేసేవారు.. కానీ కలిసి ఉండడానికి ఝాన్సీ ఒప్పుకోలేదు. దీంతో విడాకులు తీసుకున్నాం. నా కూతురిని చిన్నప్పుడు తల్లి దగ్గర, పెద్దయ్యాక నా దగ్గర ఉండేలా కోర్టు నిర్ణయించింది.
వారానికొకసారి నా చిట్టి తల్లిని చూడడానికి అనుమతి ఇచ్చింది. ఆ గంట కోసం నేను చాలా పోరాటం చేసేవాడిని. వాళ్ళ మామయ్య పాపను తీసుకొచ్చి గంట అవ్వగానే తీసుకెళ్లిపోయేవాడు.. ఇంకో అరగంట.. పావుగంట అని.. అడిగేవాడిని ఆ బాధ చూసిన పాప ఎప్పుడు ఏడుస్తూనే వెళ్ళేది.. ఆ తరువాత ఆ బాధ తట్టుకోలేక పాపను తీసుకురావద్దని చెప్పాను. కానీ, స్కూల్ ల్లో, కాలనీలో చూడాలని వారి ఇంటి దగ్గర ఇల్లు తీసుకున్నాను. అయితే నా వల్ల వారు ఇబ్బందిపడుతున్నారని తెలిసి బయటికి వచ్చేశాను. ఇక ఈ బాధ నుంచి నేను బయటపడడానికి 8 ఏళ్లు పట్టింది. తరువాత ఇంట్లో వాళ్ళు నాకు రెండో పెళ్లి చేశారు. ఇక ధన్యను దూరం చేసుకున్న బాధ మాత్రం ఇప్పటికీ ఉంది. ఏదో రోజు ఆమె నా దగ్గరకే వస్తుంది అని అనుకుంటూ ఉంటా.. ఇక నా అన్నను కోల్పోవడం అతిపెద్ద లోటు.. ఇక ధన్యను దూరం చేసిన దేవుడు.. నాకు మరో ఇద్దరు ఆడపిల్లలను ఇచ్చాడు. వారిలోనే నా పెద్ద కూతురును చూసుకుంటున్నాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.