JioHotstar Trending: 12,000 కోట్ల బ్లాక్‌ బస్టర్‌కే షాక్.. జియో హాట్‌స్టార్‌లో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ దే హవా!

Thukra Ke Mera Pyaar Season2

Thukra Ke Mera Pyaar Season2

JioHotstar Trending: ఓటీటీ ప్రపంచంలో ప్రతివారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతూనే ఉంటాయి. అయితే వాటిలో చాలా వరకు కొన్ని రోజులు మాత్రమే ట్రెండింగ్‌లో కనిపించి తర్వాత మాయమైపోతాయి.అయితే కొన్నింటికి మాత్రం ప్రేక్షకుల నుంచి లభించే స్పందన భిన్నంగా ఉంటుంది. విడుదలై రోజులు గడిచినా అదే జోరు కొనసాగుతుంది. ప్రస్తుతం అలాంటి విజయాన్నే అందుకుంటోంది ‘తుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2’ (Thukra Ke Mera Pyaar Season 2). ప్రేమ, మోసం, ప్రతీకార థీమ్స్ తో రూపొందిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ వెబ్ సిరీస్, జియో హాట్‌స్టార్‌లో వరుసగా ఎనిమిది రోజులుగా టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతూ ప్రేక్షకులను చూపు తిప్పుకోకుండా చేస్తోంది. జూన్ 19న జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైన ఈ సిరీస్ విడుదలైనప్పటి నుంచి మంచి వ్యూయర్‌షిప్‌ను నమోదు చేస్తోంది. ప్రస్తుతం టాప్ 3 ట్రెండింగ్ జాబితాలో రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. మొదటి స్థానంలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న ‘లాఫ్టర్ చెఫ్’ కొనసాగుతుండగా, రెండో స్థానాన్ని ఈ రొమాంటిక్ థ్రిల్లర్ దక్కించుకోవడం విశేషంగా మారింది.

ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో దాదాపు రూ.12,000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన హాలీవుడ్ విజువల్ వండర్ ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ప్రస్తుతం జియో హాట్‌స్టార్ ట్రెండింగ్‌లో మూడో స్థానంలో కొనసాగుతోంది. అంటే, ఓటీటీ వ్యూయర్‌షిప్ పరంగా ‘తుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2’ ఆ భారీ చిత్రాన్ని కూడా వెనక్కి నెట్టి ముందంజలో నిలవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సిరీస్ కథ కూడా ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన కుల్దీప్ అనే యువకుడు, అదే ఊరిలో పలుకుబడి ఉన్న చౌహాన్ కుటుంబానికి చెందిన షాన్విక అనే యువతిని ప్రేమిస్తాడు. మొదట అతని ప్రేమను అంగీకరించినట్టే కనిపించే షాన్విక, అనూహ్యంగా తన కుటుంబం వైపు నిలబడి కుల్దీప్ తనను వేధిస్తున్నాడని ఆరోపిస్తుంది. ఈ సంఘటనతో కుల్దీప్ జీవితం పూర్తిగా మారిపోతుంది. అక్కడి నుంచి ప్రేమ, మోసం, న్యాయం, ప్రతీకారం చుట్టూ తిరిగే కథ ఉత్కంఠభరితంగా ముందుకు సాగుతుంది.

మొదటి సీజన్‌కు లభించిన ఆదరణతోనే రెండో సీజన్‌పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సస్పెన్స్, ఎమోషన్స్, ట్విస్టులతో కథను ముందుకు తీసుకెళ్లిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా యువత నుంచి ఈ సిరీస్‌కు మంచి స్పందన ఇస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో వరుసగా ఎనిమిది రోజులుగా టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతున్న ‘తుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2’, రాబోయే రోజుల్లో కూడా ఇదే జోరు కొనసాగిస్తుందా? లేక కొత్త రిలీజ్ లు దాని స్థానాన్ని దక్కించుకుంటాయా? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మాత్రం ఓటీటీ ప్రేక్షకుల మదిలో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ టాప్ ఛాయిస్‌గా నిలుస్తోంది.