అంతకు ముందు ఎన్ని చిత్రాల్లో నటించినా జెన్నీఫర్ ఆనిస్టన్ ‘ఫ్రెండ్స్’ సిరీస్ తోనే ‘హౌస్ హోల్డ్ నేమ్’గా మారిపోయింది. ‘ఫ్రెండ్స్’ 10 సీజన్లలో 236 ఎపిసోడ్స్ ప్రసారమయ్యాయి. ఒక్కో సీజన్ అయిపోయిగానే, కొత్త సీజన్ ఎప్పుడు వస్తుందా అని జనం ఎదురుచూశారు. అంతలా ‘ఫ్రెండ్స్’ అలరించడానికి జెన్నీఫర్ ఆనిస్టన్ కారణమని చెప్పక తప్పదు. అందులో ఆమె పోషించిన రేచల్ గ్రీన్ పాత్ర ఎంతోమందిని ఆకట్టుకుంది. ‘ఫ్రెండ్స్’తోనే ఆనిస్టన్ కు లక్షలాది మంది అభిమానులు పోగయ్యారు. చిత్రమేమిటంటే, ఒకప్పుడు ‘ఫ్రెండ్స్’ చూసి ఆమెను ఎంతగానో అభినందించిన వారు ఇప్పుడు విమర్శిస్తున్నారట! కాలం మారుతూ ఉంటే ప్రేక్షకుల మనోభావాల్లోనూ మార్పులు చోటు చేసుకుంటాయని ఆనిస్టన్ అంటోంది.
‘ఫ్రెండ్స్’ సిరీస్ ను ఒకప్పుడు ఎంతగానో ఎంజాయ్ చేసినవారు, ఇప్పుడు అందులో యువతను పాడు చేసే ప్రమాదకరమైన జోక్స్ ఉన్నాయని అంటున్నారట. ఇంతలో ఇంత మార్పు ఎలా? అని ఆశ్చర్యపోతోంది జెన్నీఫర్ ఆనిస్టన్. నిజం చెప్పాలంటే ఇప్పుడు వస్తున్న సిట్ కామ్ సిరీస్ కంటే ‘ఫ్రెండ్స్’ ఎంతో ఉన్నతంగా ఉందని ఆమె అంటోంది. అంతేకాదు, హాస్యంలోని అసలైన గొప్పతనం ఏమిటంటే, మనపై మనమే జోక్స్ వేసుకొని నవ్వుకోగలగాలి. అప్పుడే అందరమూ ఆరోగ్యకరంగా ఉంటామని ఆనిస్టన్ చెబుతోంది. ఈ తరం నవ్వడం మరచిపోతోందని, అందువల్లే ‘ఫ్రెండ్స్’లోని సిట్ కామ్ ను ఒకప్పుడు ఎంజాయ్ చేసి, ఇప్పుడు ప్రమాదకరమైన జోక్స్ ఉన్నాయని చాటింపు వేస్తున్నారని జెన్నీఫర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. అన్నట్టు జెన్నీఫర్ నటించిన యాక్షన్ కామెడీ ‘మర్డర్ మిస్టరీ-2’ శుక్రవారం నుండే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. మరి ‘మర్డర్ మిస్టరీ-1’ చూసినవాళ్ళు ఈ రెండో భాగం చూసి ఏం ప్రమాదకరమైన అంశాలు ఉన్నాయని అంటారో అని ఆందోళన చెందుతోంది ఆనిస్టన్.