‘మా’ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈరోజు నుంచి సెప్టెంబర్ 29 వరకూ నామినేషన్లను స్వీకరించనున్నారు. 30న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ ఉపసంహరణకు వచ్చే నెల 1, 2 తేదీల్లో సాయంత్రం 5 గంటల వరకూ గడువు ఇచ్చారు. అక్టోబర్ రెండో తేది సాయంత్రం బరిలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటన, అనంతరం అక్టోబర్ 10న ఎన్నికలు, అదే రోజు రాత్రి ఏడు గంటలకు ఫలితాలను వెల్లడించి ‘మా’ అధ్యక్షుడు ఎవరో తేల్చేయనున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు తమ నామినేషన్లను వేశారు.
ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ “నామినేషన్స్ వేశాం. 900 మంది ఉన్న అసోసియేషన్ ఇది. దీనిని అభివృద్ధి చేయడానికి మేము పోటీ చేస్తున్నాం. రాజకీయ పార్టీల జోక్యం ఎవరు చేస్తున్నారో తెలీదు. ఇవి రాజకీయ ఎలక్షన్స్ కాదు కేవలం సినిమా ఎలక్షన్స్. పవన్ కళ్యాణ్ మాటల్లో ఆవేశం, అర్థం రెండు ఉన్నాయి” అని అన్నారు.
Read Also : ‘మా’ ఎన్నికల నామినేషన్ వేసిన ప్రకాష్ రాజ్
‘మా’ జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్న జీవిత మాట్లాడుతూ “ఈ రోజు ప్రకాశ్ రాజ్ గారి ప్యానెల్ అంతా నామినేషన్ వేశాము. ఈ ఎన్నికలు హెల్డిగా, డిగ్నిఫైడ్ గా జరగాలి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే తలెత్తుకు తిరిగేలా వుండాలి. మంచి వాతావరణంలో ఒకరిని ఒకరు కించ పరుచుకోకుండా ఎన్నికలు జరగాలి. మేమందరం కాన్ఫిడెంట్ గా వున్నాము. అయితే ఎలక్షన్ అంటే ఎవరు ఏమి చేస్తారు అనేది చెప్పుకోవడం సాధారణం. మా ఎలక్షన్స్ ని భూతద్దంలో చూపించకండి. ప్రకాష్ రాజ్ అజెండాలో ఏమి చెప్పారో వాటిపై పూర్తి స్పష్టత ఉంది. గెలిచిన ఓడినా ఈ ఇండస్ట్రీ లోనే పని చేయాలి. మా అభివృద్ధి కోసం ప్రకాష్ రాజ్ గారు గ్రౌండ్ వర్క్ చేసి ప్లాన్ రెడీ చేశారు. ప్రకాష్ రాజ్ గారి అలోచనలు బాగున్నాయి కాబట్టి మేము వారికి సపోర్ట్ చేస్తున్నాం.
కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి. మొన్న పృథ్వి ఆరోపణలు చాలా చిన్న పిల్లల వ్యవహారం లాగా అనిపించింది. ఆ వ్యాఖ్యలతో నేను చాలా ఇబ్బంది పడ్డాను. నేను అసోసియేషన్ కి శక్తి వంచన లేకుండా కృషి చేశాను. ఇక ఎన్నికలప్పుడు సహజంగానే పోటీ వుంటుంది. కానీ విష్ణు మోహన్ బాబు కొడుకు అవ్వడం వల్ల మోహన్ బాబు వర్సెస్ చిరంజీవి లాగా చూస్తున్నారు. కానీ చిరంజీవి గారు ఎక్కడా మాకు సపోర్ట్ చేస్తున్నట్టు చెప్పలేదు. చిరంజీవి అందరివాడు. ఇండస్ట్రీ వాళ్లకు చిరంజీవి ఆశీస్సులు వుంటాయి. ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది సింగిల్ ఫ్యామిలీ” అని తెలిపారు.
