JD Chakravarthy: జేడీ చక్రవర్తి అంటే కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, ఒక విలక్షణమైన వ్యక్తిత్వం. సుమారు మూడున్నర దశాబ్దాల సినీ ప్రయాణంలో ఆయన ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. అయితే ఇటీవల ఆయన తన వ్యక్తిగత జీవితం, జీవనశైలి గురించి పంచుకున్న విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా, తనకంటూ కొన్ని కఠినమైన నియమాలను ఏర్పరచుకుని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నట్లు తెలిపారు జేడీ.
‘బయటి ప్రపంచంతో కట్’..
జేడీ చక్రవర్తి తన దైనందిన జీవితం గురించి వివరిస్తూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిరోజూ తెల్లవారుజామున 4:30 నుంచి 5:15 గంటల మధ్యే నిద్రలేస్తాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీస్ పనులు, షూటింగ్‌లతో బిజీగా గడిపినప్పటికీ, సాయంత్రం 7:30 గంటలకు ఒక ‘డెడ్ లైన్’ పెట్టుకున్నాను. ఆ సమయం దాటితే తన ఫోన్‌ను పక్కన పెట్టేస్తానని, బయటి ప్రపంచానికి, సినిమా ఈవెంట్స్‌కు లేదా పార్టీలకు అస్సలు అందుబాటులో ఉండనన్నారు. ఆ సమయాన్ని కేవలం తన కోసం, తన తల్లి కోసం మాత్రమే కేటాయిస్తానని చెప్పారు. గత 33 ఏళ్లుగా ఈ అలవాటును ఒక్క రోజు కూడా మార్చుకోలేదని చెప్పారు.
అమ్మే నా సర్వస్వం.. తోడు అవసరం లేదు
పెళ్లి, ఒంటరితనం గురించి జేడీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. “నాకు ఒక తోడు కావాలని లేదా ఎవరితోనైనా విషయాలు పంచుకోవాలని ఎప్పుడూ అనిపించలేదు” అని ఆయన అన్నారు. ఏదైనా సమస్య వస్తే దానిని పరిష్కరించగలిగే వారితోనే పంచుకోవాలని, అనవసరంగా అందరికీ చెప్పాల్సిన అవసరం లేదని నేను నమ్ముతారనన్నారు. తన తల్లిని ఒక స్నేహితురాలిగా, ఒక గొప్ప తోడుగా భావిస్తానని, ఆమెతో ఉన్న అనుబంధం తనకు పూర్తి సంతృప్తిని ఇస్తుందని చెప్పారు. ఎదుటివారు ఏమనుకుంటారో అని కాకుండా, మనకు ఏది ప్రశాంతతను ఇస్తుంది అనేదే ముఖ్యమని జేడీ చక్రవర్తి స్పష్టం చేశారు.
