Jayasudha: ఇప్పుడంటే రకరకాల బిజినెస్ లు వచ్చాయి కాబట్టి.. అందులో సెలబ్రిటీలు ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. కానీ, అప్పట్లో సెలబ్రిటీలు డబ్బులు ఉంటే స్థలాలు, పొలాలు కొనేవారు. అలా చెన్నైలో శోభన్ బాబు కొన్న స్థలాలు ఇప్పుడు ఎన్నో కోట్లు విలువ చేస్తున్నాయి. ఇక అలా అప్పటిల్ప్ చెన్నైలో ఆస్తులు కొన్నవారిలో జయసుధ ఒకరు. సహజనటిగా ఆమె ఎన్నో సినిమాల్లో నటించింది. ఇప్పటికీ సహాయపాత్రల్లో నటిస్తుంది. రాజకీయాల్లో కూడా చేరిన జయసుధ ప్రస్తుతం కొన్ని సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె తన గతం తాలూకు జ్ఞాపకాలను నెమరువేసుకుంది.
” నా అసలు పేరు సుజాత. జ్యోతి సినిమాతో నా కెరీర్ మలుపు తిరిగింది. సుజాత అనే పేరును తమిళ దర్శక రచయిత గుహనాథన్ .. జయసుధగా మార్చారు. జయప్రద, శ్రీదేవి వంటి గ్లామరస్ హీరోయిన్స్ మధ్య నేను సహజనటిగా మంచి పేరు తెచ్చుకున్నాను. వాళ్లతో కలిసి నటించిన సినిమాలలో, నాకు అవార్డులు రావడం విశేషం. ఇక నా ఆస్తులు గురించి చెప్పాలంటే.. అప్పట్లో నేను చెన్నైలో ఒక బిల్డింగ్ కట్టాను. అది విని శోభన్ బాబు గారు చాలా మంచి పని చేసావ్ అన్నారు. ఆ తరువాత దాన్ని అమ్మేయాల్సి వచ్చింది. ఇది కాకుండా ఒక 9 ఎకరాల స్థలాన్ని కొన్నాను.. ఆ స్థలంలో బోర్ వేస్తే పడలేదు. అందుకే దాన్ని కూడా అమ్మేశాను. ఇప్పుడు ఆ స్థలం విలువ దాదాపు రూ. వందకోట్లు ఉంటుంది. ఆస్తులు వెనకేసుకోవడానికి కూడా అదృష్టం ఉండాలి ” అని చెప్పుకొచ్చింది.