ప్రముఖ యాంకర్ సుమ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 6 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా విడుదల చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ కూడా ఆసక్తిని పెంచుతోంది. ఇక ట్రైలర్ విషయానికొస్తే ” భర్తకు ఆపరేషన్ చేయించడానికి డబ్బు కోసం జయమ్మ అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే కూతురు పుష్పవతి కావడంతో ఆమెకు ఫంక్షన్ చేసి చదివింపుల ద్వారా వచ్చిన డబ్బును భర్త ఆపరేషన్ కోసం ఉపయోగించాలనుకుంటుంది. కానీ ఇంతలోనే ఒక అనుకోని సమస్య జయమ్మ పై పడుతుంది. దీంతో ఆమె తన సమస్యతో గ్రామా పెద్దల ముందు పంచాయితీ పెడుతోంది.
ఆమె సమస్య పెద్దలకు విడ్డురంగా ఉండడంతో వారు ఏమి చేయాలో తోచని పరిస్థితిలో కనిపించారు. ఇక మరోవైపు కూతురు వెంటపడే కుర్రాడికి జయమ్మ బుద్ధిచెప్పడం, మరో ప్రేమ జంట జయమ్మ కంట పడడం లాంటివి చూపించారు. అసలు జయమ్మ పంచాయితీ ఏంటి..? ఆమె సమస్యను ఊరి పెద్దలు ఎందుకు తీర్చలేకపోతున్నారు..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక చివర్లో చావు బతుకుల గురించి ‘చావడం సులువే కానీ.. బ్రతికి బాధ్యత తీసుకోవడమే కష్టం’ అని సుమ చెప్పడం ఆకట్టుకుంటుంది. ఇక ఈ ట్రైలర్ కు ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు అనూష్ కుమార్ సినిమాటోగ్రఫీ అదనపు ఆకర్షణగా నిలిచాయి. మొత్తానికి ట్రైలర్ లోనే అన్ని ఎమోషన్స్ చూపించి మెప్పించాడు దర్శకుడు. మరి ఈ సినిమాతో సుమ విజయాన్ని అందుకుంటుందా..? లేదా అనేది చూడాలి.
