Jayamalini: అక్కాచెల్లెళ్ళైన జ్యోతిలక్ష్మీ, జయమాలిని లను తెలుగు సినిమా ప్రేక్షకులెవ్వరూ అంత తేలిగ్గా మర్చిపోలేరు. జ్యోతిలక్ష్మీ వివాహానంతరం కూడా నటించింది. అంతేకాదు… తన కుమార్తె జ్యోతి మీనాను సైతం సినిమాల్లోకి తీసుకొచ్చింది. ఇంకా విశేషం ఏమంటే.. ఆమెతో కలిసి తాను కూడా సినిమాల్లో డాన్సులు చేసింది. అలానే కొన్ని టీవీ సీరియల్స్ లోనూ జ్యోతిలక్ష్మి నటించింది. అయితే అనారోగ్యంతో ఆమె 2016లో కన్ను మూసింది. కానీ జయమాలిని కథ వేరు… కుటుంబ పోషణార్థం సినిమాల్లోకి వచ్చిన జయమాలిని, చిన్న వయసులోనే డాన్సర్ గా మారిపోయింది. అయితే కెరీర్ ప్రారంభంలో ‘కరాటే కమల’ వంటి ఒకటి రెండు సినిమాల్లో హీరోయిన్ గానూ నటించింది. ఆపైన స్టార్ హీరోలందరితోనూ ఐటమ్ సాంగ్స్ చేసింది. ఎనభై లలో కుర్రకారంతా జయమాలిని డాన్స్ ఉందంటే చాలు ఎగబడి థియేటర్ కు వెళ్ళేవారు. అలాంటి జయమాలిని పోలీస్ అధికారి పార్తీబన్ తో వివాహానంతరం నటనకు దూరమైంది. కుటుంబానికే ప్రాధాన్యమిచ్చి… జీవితాన్ని గడుపుతూ వస్తోంది.
జయమాలిని, ఆమె భర్త పార్తీబన్ ఇద్దరూ కూడా పిల్లల్ని ఉన్నత విద్యావంతుల్ని చేశారు. వారి కుమారుడు శ్యామ్ హరి బీబీఏ, ఈడీఎం, ఎంఐఎం చేశాడు, అదీ స్పెయిన్ లో! అతని వివాహం నిశ్చయమైంది. చెన్నయ్ కే చెందిన ప్రియాంకతో రేపు మద్రాస్ వీజీపీ గోల్డెన్ బీచ్ రిసార్ట్స్ లో ఉదయం జరుగబోతోంది. ఈ సందర్భంగా అదే వెన్యూలో ఈ రోజు రాత్రి మ్యారేజ్ రిసెప్షన్ ను ఏర్పాటు చేశారు. సినిమా రంగానికి చెందిన అలనాటి నటీనటులు కూడా ఈ వేడుకకు హాజరుకాబోతున్నట్టు తెలుస్తోంది.