Jaya Prakash Reddy: టాలీవుడ్ కమెడియన్స్ లో చెప్పుకోదగ్గ నటుడు జయప్రకాశ్ రెడ్డి. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా ఎన్నో మంచి సినిమాలలో నటించి మెప్పించారు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. జయప్రకాశ్ రెడ్డి కర్నూలు జిల్లా, శిరివెళ్ళ మండలంలోని వీరారెడ్డి పల్లి గ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో 1946, మే 8న జన్మించాడు. మొదటి నుంచి చదువులో ఫస్ట్ ఉండే ఆయన మ్యాథ్స్ టీచర్ గా పనిచేశారు. జయప్రకాశ్ రెడ్డి.. మంచి నాటక కళాకారుడు. ఒక కాలేజ్ లో గప్ చుప్ అనే నాటకాన్ని ప్రదర్శిస్తుండగా దాసరి నారాయణరావు కు అతని నటన నచ్చి నిర్మాత రామానాయుడుకు పరిచయం చేశాడు. అలా ఆయన సినీ రంగ ప్రవేశం జరిగింది. 1988లో విడుదలైన బ్రహ్మపుత్రుడు చిత్రంతో పరిచయమైన జయప్రకాశ్ రెడ్డి వెనక్కి తిరిగి చూసుకోలేదు. దాదాపు 150 సినిమాలకు పైనే ఆయన నటించి మెప్పించారు. ముఖయంగా జయప్రకాశ్ రెడ్డి రాయలసీమ యాస, కామెడీ టైమింగ్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయేవారు.
కబడ్డీ కబడ్డీ చిత్రంలో ‘ఏందిరయ్యా.. ఏం చేస్తున్నావ్.. దున్నపోతుకు పాలు పితుకుతున్నావా దున్నపోతా..’. సమరసింహారెడ్డి చిత్రంలో బాలకృష్ణకు ధీటైన విలన్ గా ‘ఢిల్లీలో కాదు సీమ సందుల్లోకి రారా సూసుకుందాము నీ పెతాపమూ నా పెతాపమూ పోరాతాయ్’… రెడీ చిత్రంలో ‘ఏమిరా పులి.. పంతుల్ని పిండిలేపిస్తున్నావ్.. చిన్నబ్బి యాడెడా చెబితే.. ఆడాడ ఇరిసిపారేయండి’ ఈ డైలాగ్స్ ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. ఇక చివరిగా సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ‘పొడుగ్గా మాంచి కూజా లెక్కున్నావ్.. కొడితే చెంబైపోతావ్’ అంటూ విలన తండ్రిగా నటించి మెప్పించాడు. కొన్ని రోజుల్లో సినిమాల్లో రిటైర్మెంట్ తీసుకొని రెస్ట్ తీసుకుంటాను అని చెప్పిన ఆయన సెప్టెంబర్ 8 న ఉదయం బాత్ రూమ్ లో గుండెపోటు తో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన అలా బాత్ రూమ్ లోనే ఎవరికి తెలియకుండానే కన్నుమూశారు. జేపీ మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.