Site icon NTV Telugu

Jamuna-ANR: ఏయన్నార్ – జమున చిత్రబంధం!

Jamuna Anr

Jamuna Anr

Jamuna-ANR: మహానటుడు అక్కినేని నాగేశ్వరరావుకు హిట్ పెయిర్ గా సాగారు జమున. అన్నపూర్ణ వారి తొలి చిత్రం ‘దొంగరాముడు’లో ఏయన్నార్ కు చెల్లెలిగా నటించారు జమున. తరువాత “మిస్సమ్మ, తెనాలి రామకృష్ణ” చిత్రాలలో ఏయన్నార్ కు జోడీగా అభినయించారామె. వారిద్దరూ నటించిన ‘ఇల్లరికం’చిత్రం ఆ రోజుల్లో సూపర్ హిట్ గా నిలచింది. తరువాత “గుండమ్మ కథ, మూగమనసలు”లోనూ జమున నాగేశ్వరరావు నాయికగా నటించి, జనాన్ని మురిపించారు. వారిద్దరూ జోడీగా నటించిన “పెళ్ళినాటి ప్రమాణాలు, మురళీకృష్ణ, మూగనోము, మనసు-మాంగల్యం, దొంగల్లో దొర, పూలరంగడు, బందిపోటు దొంగలు” వంటి చిత్రాలు జనాన్ని అలరించాయి. ఈ చిత్రాలన్నీ ఏయన్నార్ కు రిపీట్ రన్స్ లోనూ వసూళ్ళు చూపించినవి కావడం విశేషం!

Read also: NTR-Jamuna: యన్టీఆర్‌తో జమున అభినయబంధం!

ఏయన్నార్ తో ‘ఇల్లరికం’ తరువాత ఓ సందర్భంలో అనుకోకుండా విభేదించారు జమున. దాంతో ఏయన్నార్ తోపాటు యన్టీఆర్ సైతం జమునను కొద్ది రోజులు దూరం పెట్టారు. చక్రపాణి- నాగిరెడ్డి జోక్యంతో మనస్పర్థలు తొలగిపోయాయి. తరువాత ఏయన్నార్ తో జమున నటించన ‘గుండమ్మకథ’ ఘనవిజయం సాధించింది. ఆ పై మళ్ళీ జమున,ఏయన్నార్ కాంబినేషన్ జనాన్ని అలరించసాగింది. 1967లో ‘పూలరంగడు’కు ముందు ఏయన్నార్ వరుసగా పరాజయాన్ని చవిచూశారు. ఆ సమయంలో జమునతో కలసి ఏయన్నార్ నటించిన ‘పూలరంగడు’ చిత్రం సూపర్ హిట్ గా సాగింది. అలా జమున ఏయన్నార్ కు విజయనాయికగా నిలిచారు.

Read also: Jamuna: అలనాటి నటి జమునకు ప్రముఖుల నివాళులు

అప్పట్లో విభేదించుకున్నా తరువాతి రోజుల్లో ఏయన్నార్, జమున హైదరాబాద్ లోనే ఉంటూ ఎంతో సఖ్యంగా ఉన్నారు. తరచూ వారిద్దరికే సన్మానాలు జరుగుతూ ఉండేవి. ఇద్దరూ కలసి టీవీ ప్రోగ్రామ్స్ లోనూ పాల్గొని అలరించారు. వర్ధమాన నటీనటులను ప్రోత్సహిస్తూ ఏయన్నార్, జమున పలు కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. అప్పుడు తరచూ పాత విషయాలను నెమరు వేసుకుంటూ కొత్తవారికి ఉత్సాహం కలిగించేవారు. ఏది ఏమైనా ఏయన్నార్ – జమున జంట తెలుగువారిని విశేషంగా అలరించిందనే చెప్పాలి.
Weather Forecast: ఉదయం చలి.. మధ్యాహ్నం వేడి.. ఏమిటీ పరిస్థితి..

Exit mobile version