తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘జై భీమ్’ నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో నిలచింది. ఒక వేళ ‘జై భీమ్’ థియేటర్లలో విడుదలై ఉంటే ఎలా ఉండేదో కానీ, మొత్తానికి నెటిజన్లను ఈ సినిమా భలేగా ఆకట్టుకుంటోంది. ‘ఇంటర్నెట్ మూవీ డేటాబేస్’ వెబ్ సైట్ రేటింగ్ లో ఇప్పుడు ‘జై భీమ్’కు జనం జైకొట్టారు. అగ్రస్థానంలో నిలిపి పట్టం కట్టారు. ఈ చిత్రానికి పదికి 9.6 పాయింట్స్ లభించాయి. ఈ చిత్రాన్ని నెటిజన్స్ ఇంతగా మెచ్చడానికి ఇందులోని కథాంశమే కారణమని చెప్పక తప్పదు. ఒకప్పుడు మారుమూల గిరిజనులను రక్షకభట వ్యవస్థ తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటూ ఉండేది. అసలైన దోషులకు కొమ్ముకాస్తూ, వారి స్థానంలో అమాయకులైన గిరిజనులను నేరస్థులుగా చిత్రీకరించి, శిక్షలు పడేలా చేసేది. ‘జై భీమ్’లో ఓ దొంగతనం కేసులో అసలు వారిని వదిలేసి, అమాయకులైన గిరిజనులను ఆ దొంగతనం ఒప్పుకోమని వేధించడం, వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోతే, మళ్ళీ పోలీసులు డ్రామా ఆడడం ప్రధానాంశం. అప్పుడు అడ్వకేట్ చంద్రు న్యాయ పోరాటం చేసి, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చేస్తారు. ఈ తరహా కథాంశాలు కొత్తకాకపోయినా, ‘జై భీమ్’ను దర్శకుడు జ్ఞానవేల్ తెరకెక్కించిన తీరు జనాన్ని భలేగా ఆకట్టుకుంటోంది. అందుకే నెటిజన్స్ 9.6 రేటింగ్ తో ఈ చిత్రాన్ని అగ్రస్థానంలో నిలిపారు.
తరువాతి స్థానాల్లో…
1994లో రూపొందిన తెరకెక్కిన హాలీవుడ్ మూవీ ‘ద ష్వాషంక్ రిడెంప్షన్’ 9.3 పాయింట్స్ తో రెండో స్థానం చేజిక్కించుకుంది. ఈ చిత్రంలోనూ జైలులో బాధలు పడ్డవారి కథనే ప్రధానాంశం కావడం విశేషం. టిమ్ రాబిన్స్, మోర్గాన్ ఫ్రీమేన్ నటించిన ఈ సినిమా చాలా ఏళ్ళ నుంచీ జనాన్ని ఆకట్టుకుంటూనే ఉంది. ఇక మహానటుడు మార్లిన్ బ్రాండో నటించిన 1972 నాటి ఆస్కార్ బెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్-1’ చిత్రం 9.2 రేటింగ్ తో మూడో స్థానం ఆక్రమించింది. ఇందులో న్యాయం వైపు నిలచి, ఓ గాడ్ ఫాదర్ అన్యాయం పాలయిన వారిని చట్టవిరుద్ధంగా రక్షించడం ప్రధానాంశం. ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా రూపొందించిన ఈ చిత్రం ఆ నాటి నుంచీ ఈ నాటి దాకా అలరిస్తూ ఉండడం విశేషం. గత సంవత్సరం నేరుగా ఓటీటీలో విడుదలైన సూర్య చిత్రం ‘సూరారై పొట్ట్రు’ 9.1 రేటింగ్ తో నాల్గవ స్థానంలో నిలచింది. సామాన్యులకు ఫ్లైట్ లో విహరించే అవకాశం కల్పించిన డక్కన్ ఎయిర్ వేస్ జి.ఆర్. గోపీనాథ్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. మన తెలుగు దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. విక్కీ కౌశల్ హీరోగా ఈ యేడాదే విడుదలయిన ‘సర్దార్ ఉద్దమ్’ 9.0 పాయింట్స్ తో ఐదో స్థానం ఆక్రమించింది. జలియన్ వాలాబాగ్ దుస్సంఘటనకు కారకుడైన ఆంగ్లేయుని చంపడానికి ఉద్ధమ్ సింగ్ ఎలా పథకం వేశాడన్న ఇతివృత్తంతో ఈ చిత్రం రూపొందింది.
మిగిలిన ఐదు…
ఈ రేటింగ్ లో ఆరో స్థానాన్ని క్రిష్టఫర్ నోలాన్ తెరకెక్కించిన ‘ద డార్క్ నైట్’ 9.0 రేటింగ్ తో ఆక్రమించింది. ఈ చిత్రం 2008లో విడుదలైన బ్యాట్ మేన్ సీరిస్ సినిమా. 1974లో రూపొందిన ‘గాడ్ ఫాదర్’ రెండో భాగం 9.0 రేటింగ్ తో ఏడో స్థానంలో నిలచింది. అదే 9.0 రేటింగ్ తో 1957 నాటి ’12 యాంగ్రీ మేన్’ ఎనిమిదో స్థానంలో నిలచింది. సిడ్నీ లుమెట్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కోర్టు రూమ్ డ్రామాస్ కు పెద్ద బాలశిక్ష వంటిదని ఇప్పటికీ సినీమేధావులు అభిప్రాయపడుతూనే ఉంటారు. 2003లో తెరకెక్కిన ‘ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్: రిటర్న్ ఆఫ్ ద కింగ్’ చిత్రం 8.9 రేటింగ్ తో 9వ స్థానం ఆక్రమించింది. అప్పట్లో ఆబాలగోపాలాన్నీ ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంది. 1994లో క్వెంటిన్ టరంటినో రూపొందించిన క్రైమ్ డ్రామా ‘పల్ప్ ఫిక్షన్’ 8.9 రేటింగ్ తో పదో స్థానంలో నిలచింది.
ఓటింగ్ ఎలా సాగింది?
ఈ జాబితాచూశాక, ఒకే పాయింట్స్ ఉన్న సినిమాలకు రేటింగ్ లో తేడా ఎలా వచ్చింది అన్న సందేహం కలుగవచ్చు. ఓ సినిమా విడుదలై ఎన్ని రోజులయింది. అప్పటి నుంచీ ఆ చిత్రానికి ఎన్ని ఓట్లు వచ్చాయి అన్న అంశాలను ప్రధానంగా తీసుకుంటారు. తక్కువ సమయంలో ఎక్కువ మంది లైక్స్ సంపాదించిన చిత్రానికి ఎక్కువ పాయింట్స్ లభిస్తాయి. ఐ.ఎమ్.డి.బి. రేటింగ్స్ ప్రకారం ఈ పది చిత్రాలు టాప్ టెన్ గా నిలిచాయి. వీటి తరువాత దాదాపు 990 ఉత్తమ చిత్రాలు లైన్ లో ఉన్నాయి. అంటే ఐఎమ్.డి.బి. మొత్తం వెయ్యి చిత్రాలను రేటింగ్స్ ద్వారా వెలికి తీసింది. నిజానికి గత కొన్నేళ్ళుగా ‘గాడ్ ఫాదర్’, ’12 యాంగ్రీ మెన్’ వంటి చిత్రాలు పోటీలో నిలుస్తూనే ఉండడం గమనార్హం! ఇప్పటి దాకా ఐఎమ్.డి.బి. రేటింగ్స్ లో పదికి పది పాయింట్స్ సంపాదించిన చిత్రంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన ‘దిల్ బేచారా’ నిలచింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించిన కొద్ది రోజులకే ఈ సినిమా విడుదలయింది. దాంతో ఈ చిత్రం రాగానే నెటిజన్స్ కొద్ది గంటల్లోనే దీనికి ఓట్లేసేశారు. అందువల్ల పదికి పది పాయింట్స్ సంపాదించగలిగింది. ఆ తరువాత ఈ సినిమా స్థానం తగ్గుతూ