Jabardasth Venu: సాధారణంగా చిత్ర పరిశ్రమలో ఒకరు అనుకున్న కథ.. ఇంకొకరి మదిలో కూడా మెదులుతూ ఉంటుంది. వారిద్దరిలో ఎవరి సినిమా మొదట వస్తే రెండో వ్యక్తి ఆ కథ తనదే అని కాపీ రైట్స్ కేసు పెడుతూ ఉంటాడు. ఇది చాలాసార్లు చాలా చోట్ల జరిగేదే. తాజాగా జబర్దస్త్ వేణు సైతం ఈ కాపీ రైట్స్ ఇష్యూస్ ఎదుర్కొంటున్నాడు. బలగం సినిమాతో వేణు దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే మంచి దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించడంతో సినిమాపై అంచనాలు పెరిగి ప్రేక్షకులు థియేటర్ వైపు అడుగులు వేశారు. అనుకున్నట్లుగానే సినిమా మంచి విజయం అందుకుంది. ఈలోపే ఆ సినిమా కథ నాది అంటూ పాత్రికేయుడు గడ్డం సతీష్, వేణుపై ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. 2011 లో ఆ కథను తాను రాసుకున్నాను అని, అది తన తాతగారు చనిపోయాక తాను ఎంతో మనోవేదనతోరాసుకున్న కథ అని చెప్పుకొచ్చాడు. 2014 లో పచ్చికి అనే పేరుతో ప్రచురితమయిందని, దాన్ని కాపీ కొట్టి వేణు ఈ సినిమా తీసినట్లు తెలిపాడు. సినిమాకు రివ్యూ రాద్దామని ప్రివ్యూ కు వెళ్లిన తనకు తన కథను తనకే చూపించారని వాపోయాడు.
Ajith- Shalini: షాలినిని పెళ్లి చేసుకోవద్దు.. అజిత్ కు వార్నింగ్ ఇచ్చిన నటుడు
ఇక సతీష్ వ్యాఖ్యలను వేణు ఖండించాడు. ఆ సినిమా సతీష్ ది కాదని వాదించాడు. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో వేణు మాట్లాడుతూ.. ” గడ్డం సతీష్ బలగం కథ నాదే అనడం హాస్యాస్పదంగా ఉంది. ఆయన రాసిన కథను నేను చదవేలేదు. నా కథ చరిత్రలో ఉన్న సంప్రదాయం.. పిట్ట ముట్టుడు సంప్రదాయం ఎవరి సొత్తు కాదు. తెలుగు సంప్రదాయాలు, సంస్కృతిపై ఒక్కొక్కరు ఒకలా స్పందిస్తారు..సతీష్ మా సినిమాను అబాసుపాలు చేయడం సబబు కాదు.. ఇప్పటివరకు రచయితల సంఘాన్ని సతీష్ గడ్డం ఎందుకు సంప్రదించలేదు. దిల్ రాజు ఈ సినిమాను తీయకపోతే తెలంగాణ సంస్కృతిలో ఈ పాయింట్ ప్రపంచానికి ఎలా తెలిసేది.. మా బలగం సినిమా వల్ల ఎన్నో మంచి కథలు రాబోతున్నాయి. సతీష్.. దిల్ రాజుతో కాదు నాతో మాట్లాడు.. ఆయన బొమ్మ పెట్టుకొని సతీష్ చిల్లర వ్యాపారం చేస్తున్నాడు. బలగం సినిమాకు దిల్ రాజు ముందు ఉండటం వల్ల తెలంగాణ సంస్కృతి ఏంటో తెలిసింది. అసలు బలగం కథ మా ఇంట్లోనే జరిగింది. మా నాన్న చనిపోయినప్పుడు ఆ ఆలోచన నాలో మెదిలింది. ఆరేళ్ళు పరిశోధన చేసి ఈ కథను రాసుకున్నాను. నేను రాసింది కథ కాదు ప్రజల జీవితాల్లో జరిగే చర్యలు.. దమ్ముంటే నాతో మాట్లాడు సతీష్.. నేను చెప్తాను” అంటూ వేణు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం వేణు వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.