Prabhas: నటసింహ నందమూరి బాలకృష్ణ ‘ఆహా’లో నిర్వహిస్తోన్న ‘అన్ స్టాపబుల్’ టాక్ షోకు క్రేజ్ పెరుగుతూనే వస్తోంది. అయితే ఇప్పటి దాకా బాలయ్య పలువురు స్టార్స్ తో ముచ్చట్లు సాగించినా, ‘బాహుబలి’ స్టార్ ప్రభాస్ తో జరిపిన టాక్ షోకే ఎక్కువ క్రేజ్ కనిపిస్తోంది. ఇటీవల షూట్ జరుపుకున్న ఈ షోలో కేవలం కొన్ని క్లిప్స్ కలిపి ‘గ్లింప్స్’ అలా వదిలారో లేదో ఇలా దూసుకుపోతోంది. ఇప్పటి దాకా ఈ టాక్ షోలో ఈ ఒక్క ‘గ్లింప్స్’కే ఇంత ఆదరణ లభించడం విశేషం! ఇంతకూ బాలకృష్ణ, ప్రభాస్ తో చేసిన టాక్ షోకే ఇంత క్రేజ్ రావడానికి కారణమేంటి అంటూ అభిమానులు ఆరాలు తీస్తున్నారు. ఫ్యాన్స్ మదిలో మెదలుతున్న భావాలు ఆసక్తికరంగా ఉండడం విశేషం!
తెలుగునాట బాలకృష్ణకు ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి నేడు కొత్తగా చెప్పవలసిన పనిలేదు. అలాగే ‘బాహుబలి’ సిరీస్ తో ప్రభాస్ కు ఇంటర్నేషనల్ స్టార్ ఆఫ్ ఇండియాగా పేరు లభించింది. అందువల్ల ఈ ఇద్దరు హీరోల కలయిక నిస్సందేహంగా అందరిలోనూ ఆసక్తి కలిగించక మానదు. ఇది అందరికీ తెలిసిన కోణం! కానీ, అభిమానుల మదిలోని భావాలు మరో తీరున ఉండడం గమనార్హం! ఆరంభంలో ప్రభాస్ కు ఆట్టే విజయాలు లభించలేదు. ఆయనకు తొలి గ్రాండ్ సక్సెస్ ను అందించిన చిత్రం ‘వర్షం’. ఈ వర్షానికి బాలయ్యకు ఓ బంధం ఉంది. అదేమిటంటే, ‘వర్షం’ విడుదల రోజునే బాలకృష్ణ ‘లక్ష్మీనరసింహా’ చిత్రం కూడా 2004 సంక్రాంతి కానుకగా విడుదలయింది. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. ఆ తరువాత ఈ ఇద్దరు స్టార్స్ 2005లో పోటీ పడ్డారు. ఆ యేడాది ప్రభాస్ ‘ఛత్రపతి’ తరువాత వారం గ్యాప్ లో బాలయ్య ‘అల్లరి పిడుగు’ వచ్చింది. ‘ఛత్రపతి’ సూపర్ హిట్ గా నిలచింది. 2008లో ప్రభాస్ ‘బుజ్జిగాడు’ మే 22న రాగా, బాలయ్య ‘పాండురంగడు’ మే 30న విడుదలయింది. రెండూ అంతగా మురిపించలేక పోయాయి. 2010లో బాలకృష్ణ ‘సింహా’ ఏప్రిల్ 30న రాగా, ఆ చిత్రానికంటే వారం ముందు ఏప్రిల్ 23న ప్రభాస్ ‘డార్లింగ్’ రిలీజయింది. ‘సింహా’ బ్లాక్ బస్టర్ గా నిలచింది. ఇలా వీరిద్దరి పోటీలోనూ ఎవరో ఒకరికి బిగ్ హిట్ లభిస్తూనే ఉంది. అందువల్ల బాలయ్య, ప్రభాస్ జోడీపై మరింత ఆసక్తి నెలకొందని అభిమానుల భావన.
‘బాహుబలి’ సిరీస్ తరువాత ప్రభాస్ సినిమాలకు భలే క్రేజ్ ఉన్నప్పటికీ ఆయన హీరోగా రూపొందిన ‘సాహో’, ‘రాధేశ్యామ్’ అంతగా అలరించలేక పోయాయి. పైగా రాబోయే ప్రభాస్ సినిమా ‘ఆదిపురుష్’పై ఇప్పటికే ట్రోల్స్ సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలయ్యతో భేటీ తరువాత ప్రభాస్ కు సూపర్ హిట్ లభిస్తుందని ఆయన అభిమానుల అభిలాష. కాగా, ఈ షో తరువాత రాబోయే సంక్రాంతిలో బాలయ్య ‘వీరసింహారెడ్డి’ ఘనవిజయం సాధిస్తుందని ఈయన ఫ్యాన్స్ ఆశ. మరి అభిమానుల లెక్కలు ఇలా ఉంటే, త్వరలోనే బాలయ్య ‘అన్ స్టాపబుల్’లో ప్రభాస్ పాల్గొన్న షో టీజర్ రానుంది. మరి ఆ టీజర్ ఏ స్థాయిలో దూసుకుపోతుందో, టాక్ షో ఏ రీతిన అలరిస్తుందో చూడాలి.
