ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ తెచ్చుకొని అభిమానులను నిరాశపరిచిన విషయం విదితమే. దీంతో ప్రభాస్ అభిమానులందరూ ఆయన నెక్స్ట్ సినిమాలపై భారీ అంచనాలను పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం డార్లింగ్ అభిమానులందరి చూపు ప్రాజెక్ట్ కె మీదనే ఉంది అంటే అతిశయోక్తి కాదు. మహానటి చిత్రంతో అందరి మనసులను కంటతడి పెట్టించిన దర్శకుడు నాగ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె నటిస్తుండగా.. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు.
ఇక ప్రస్తుతం ఈ సినిమాపై యక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రాజెక్ట్ కె అని చెప్పడమే కానీ అందులో కె అంటే ఏంటీ అనేది ఎవరికి అంతుచిక్కని ప్రశ్న. అందరికి తెలిసినట్లు ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ కానీ, టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న సినిమా కాదట. మహాభారతంలోని రెండు ప్రధాన పాత్రలను తీసుకొని దాని చుట్టూ అల్లుకున్న కథ అని తెలుస్తోంది. ఆ రెండు పాత్రలు ఎంటంటే.. ఒకటి విష్ణుమూర్తి అవతారం కాగా .. రెండు అశ్వద్ధామ అవతారం. కలియుగాంతంలో విష్ణుమూర్తి కల్కిగా అవతరించాడు. అదే పాత్రను ఈ సినిమాలో ప్రభాస్ చేస్తున్నాడట. అంటే.. కె అంటే కల్కి అని అర్థమట. ఇక అశ్వద్ధామ గా అమితాబ్ బచ్చన్ కనిపించనున్నారట. కల్కి అంటే తెల్లటి గుర్రంపై వీర ఖడ్గం పట్టుకొని దుష్టసంహారం చేసే అవతారం. దీన్ని బేస్ చేసుకొని, దానికి సైన్స్ కలిపి కొత్తగా ప్రయోగం చేయబోతున్నాడట నాగ అశ్విన్. ఇక ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మతి ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే మేకర్స్ నోరు విప్పేవరకు ఆగాల్సిందే.