విలక్షణ నటుడిగా ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసినట్లు ఒదిగిపోయే అతి తక్కువ మంది నటుల్లో కోట శ్రీనివాసరావు ఒకరు. దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరైన కోట శ్రీనివాస రావు గురించి తెలుగు వారికి పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ సినిమాల్లోనూ కోట ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు. ఆయన గత వారంలో రిలీజ్ అయిన పాన్ ఇండియా సినిమా ‘కబ్జ’లో కూడా ఒక పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ మంచి పాత్రలు ఉంటే ఇవ్వండి నటిస్తాను, తెలుగు వారికి అవకాశం ఇవ్వండి బాగా నటిస్తారు అని అడిగే కోట శ్రీనివాసరావు మరణించాడు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
ఈ వార్త ఎక్కువగా వైరల్ అయ్యి విపరీతంగా ఫోన్స్ వస్తుంటే… ప్రాణాలతో ఉన్న మనిషి కదా నువ్వు చనిపోయవా అని తననే అడుగుతూ ఉంటే లేదు నేను ఇంకా బ్రతికే ఉన్నాను అని చెప్పుకోవడానికి ఇబ్బంది అనిపించి ఉంటుంది. నేను ఇంకా బ్రతికే ఉన్నాను, నన్ను చంపెయకండి అని పేరు పేరున చెప్పకోలేక. అందిరికీ ఒకేసారి చెప్పడానికి కోట శ్రీనివాసరావు ఒక వీడియోని రిలీజ్ చేశారు. “ఉదయం నుంచి నేనే 50 ఫోన్స్ మాట్లాడను. అభిమానులు, సన్నిహితులు ఆందోళన చెందకండి, నేను బాగానే ఉన్నాను. ఉగాది పండగ ఏర్పాట్లలో ఉన్నాను, నేను మరణించాను అనే వార్తలో నిజం లేదు. దయచేసి సోషల్ మీడియాలో ఇలాంటి వాటిని రాయకండి” అని కోట శ్రీనివాసరావు చేతులు జోడించి నమస్కారం చేసి అడిగారు. డబ్బులు సంపాదించుకోవడానికి ఎన్నో దారులు ఉంటాయి కానీ ఒక మనిషిని చనిపోయాడు అని వార్త రాస్తూ ప్రచారం చేసుకోవడం తప్పు, ప్రజలు కూడా అలా రాసే వాళ్లకి బుద్ధి చెప్పాలని కోట శ్రీనివాసరావు ఈ వీడియో ద్వారా కోరుకున్నారు.