ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, విలక్షణ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప ది రైజ్’ ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. 2021 బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ‘పుష్ప’ చిత్రం దాదాపు రూ. 350 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి అల్లు అర్జున్ కెరీర్ అతిపెద్ద విజయంగా నిలిచింది ఈ సినిమా. విశేషం ఏమంటే ‘పుష్ప’ లోని మాటలు, మేనరిజమ్స్, పాటలు ప్రపంచాన్ని ఊపేశాయి. అంతే కాదు అల్లు అర్జున్ నటనపై ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లోనూ ప్రశంశల వర్షం కురిసింది. కరోనా సమయంలో కూడా రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసి.. అల్లు అర్జున్ అసలు సిసలైన పాన్ ఇండియా స్టార్ గా మార్చేసింది ‘పుష్ప’.
ఇంతటి సంచలన విజయం సాధించిన ఈ సినిమా రెండో భాగం ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఎంతో కాలంగా వేచి చూస్తున్నారు. ఈ ఎదురు చూపులకు సమాధానం దొరికింది. తాజాగా దాని సీక్వెల్ ‘పుష్ప: ద రూల్’ పూజా కార్యక్రమాలు జరిగాయి. సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు నిరాడంబరంగా ఈ కార్యక్రమాలను నిర్వహించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విదేశాలలో ఉండటంతో ఈ వేడుకలో పాల్గొనలేదు. అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. విశేషం ఏమంటే… ఇప్పుడీ సీక్వెల్ ను సుకుమార్ రైటింగ్స్ తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.
