NTV Telugu Site icon

రివ్యూ: ఇచ్చట వాహనములు నిలుపరాదు

Ichata Vahanamulu Nilupa Radu Movie Review

Ichata Vahanamulu Nilupa Radu Movie Review

అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా, నాగార్జున మేనల్లుడుగా చిత్రసీమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుశాంత్… నిజానికి ప్రముఖ నిర్మాత ఎ.వి. సుబ్బారావు మనవడు కూడా. ఆ రకంగా అటు తండ్రి, ఇటు తల్లి నుండి అతనికి సినిమా రంగంతో గాఢానుబంధమే ఉంది. తొలి చిత్రాల సంగతి ఎలా ఉన్నా, ఆ మధ్య వచ్చిన ‘చి.ల.సౌ.’ చిత్రం డీసెంట్ హిట్ అయ్యి, సుశాంత్ కు నటుడిగా మంచి పేరే తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆడియెన్స్ కు సుశాంత్ మరింత చేరువయ్యాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం వచ్చింది ‘ఇక్కడ వాహనములు నిలుపరాదు’ సినిమా.

అరుణ్ (సుశాంత్) ఓ ఆర్కిటెక్చర్ కంపెనీలో పనిచేస్తుంటాడు. అదే కంపెనీలో ఇంటర్నెషిప్ చేయడానికి వచ్చిన మీనాక్షి (మీనాక్షి చౌదరి)తో ప్రేమలో పడతాడు. ఆమె అన్నయ్య నర్సింగ్ యాదవ్ (వెంకట్) కార్పొరేటర్. అతనికీ మాజీ కార్పొరేటర్ భూషణ్ గౌడ్ (రవి వర్మ)కు మధ్య పొలిటికల్ రైవలరీ నడుస్తుంటుంది. ఓ రోజున కొత్త బైక్ కొనుక్కుని, మీనాక్షి ఇంటికి వెళ్లి ఆమెను తీసుకుని రైడ్ కు వెళ్ళాలని అరుణ్ ప్లాన్ చేస్తాడు. కానీ అది కాస్త వికటిస్తుంది. తనకు తెలియకుండానే రాజకీయ వైకుంఠపాళిలో పావుగా మారిపోతాడు. అందులోంచి అరుణ్ ఎలా బయట పడ్డాడు? ఆ కుట్రకు కారకులైన అసలు వ్యక్తుల ముసుగును ఎలా తొలగించాడు? అనేది మిగతా కథ.

‘కాళిదాస్’ సినిమాతో సుశాంత్ హీరోగా ఎంట్రీ ఇచ్చి పుష్కర కాలం అయ్యింది. అప్పటి నుండి చేసింది చేతి వేళ్ళ మీద లెక్కించే సినిమాలే అయినా… అతని నటనతో పరిపక్వత సినిమా సినిమాకూ పెరుగుతూ వస్తోంది. ఈ సినిమాలోనూ అదే కనిపించింది. ముఖ్యంగా డాన్స్ లో మంచి స్కిల్స్ ను ప్రదర్శించాడు. బాడీ లాంగ్వేజ్ లోనూ ఈజ్ కనిపించింది. మధ్య తరగతి కుర్రాడిగా అరుణ్ పాత్రకు చక్కటి న్యాయం చేర్చాడు. హీరోయిన్ మీనాక్షిచౌదరి నటన డీసెంట్ గా ఉంది. చాలా కాలం తర్వాత వెంకట్ మంచి పాత్ర చేశాడు. అతని భార్య పాత్రలో ఫ్యాషన్ డిజైనర్ నిహారిక రెడ్డి మెరుపులా మెరిసింది. హీరో తల్లిగా ఐశ్వర్య, స్నేహితులుగా ‘వెన్నెల’ కిశోర్, ప్రియదర్శి, నిర్మాతల్లో ఒకరైన హరీశ్ కోయలగుండ్ల నటించారు. వెంకట్ బావమరిదిగా అభినవ్ గోమటం ఇంతవరకూ పోషించిన వాటికంటే భిన్నమైన పాత్రను చేశాడు.

సాంకేతిక నిపుణులలో సుకుమార్ కెమెరాపనితనం, ప్రవీణ్‌ లక్కరాజు నేపథ్య సంగీతం ఓకే. ‘నీ వల్లే నీవల్లే…’, ‘హే మనసెందుకిలా’ పాటలు వినసొంపుగా ఉన్నాయి. వాటి చిత్రీకరణ కూడా బాగుంది. అయితే… ఓ చిన్న పాయింట్ తీసుకుని రెండుగంటలకు పైగా నిడివి ఉన్న సినిమాగా మలచడంలో కొత్త దర్శకుడు దర్శన్ కొంత మేరకే సఫలమయ్యాడు. కొత్త బైక్ కొనుక్కుని హీరోయిన్ ను సర్ ప్రైజ్ చేయాలనుకున్న హీరో ఆశలు ఎలా అడియాశలు అయ్యాయో చూపించే క్రమంలో దర్శకుడు తడబడ్డాడు. పాలిటిక్స్ ను, పోలీస్ కేసుల్ని, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను, మదర్ అండ్ ఫ్రెండ్స్ సెంటిమెంట్ ను అందులో మిళితం చేసే క్రమంలో కథ, కథనాలు కంగాళీగా తయారయ్యాయి. ఒకానొక సమయంలో హీరో, హీరోయిన్ ఇంటి నుండి బయటపడలేక అక్కడక్కడే తచ్చాడటం… థియేటర్ లో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్టు అయ్యింది. పోనీ ఆ తర్వాత అయినా కథ చక చకా సాగుతుందా అంటే అదీ లేదు! సుశాంత్ ను యాక్షన్ హీరోగా నిలబెట్టడం కోసం దర్శక నిర్మాతలు చేసిన ప్రయత్నంగా పోరాట సన్నివేశాలు కనిపిస్తాయి. హీరోహీరోయిన్ల మధ్య బాండింగ్ అండ్ లవ్ సీన్స్ కు ఎక్కడా సానుకూల వాతావారణం లేకపోయింది. దాంతో ఆ ఫీల్ ను ప్రేక్షకులు పొందలేకపోయారు. ఏతా వాతా టైటిల్ తరహాలో ఏదో కొత్తదనాన్ని తెలుగు ప్రేక్షకులకు ఇవ్వాలని ఇటు దర్శకుడు, అటు నిర్మాతలు పడిన ఆరాటం వృధా ప్రయాసగా మిగిలింది. ఈ కొత్త అంశాన్ని మరింత హోమ్ వర్క్ చేసుకుని, ఇంకొంచెం కొత్తగా తెరకెక్కించి ఉంటే బాగుండేది. ఈ థ్రిలింగ్ యాక్షన్ లవ్ స్టోరీని అలనాటి నటి భానుమతి వారసులు రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రితో కలిసి హాస్యనటుడు, ‘అమృతం’ ఫేమ్ హరీశ్ నిర్మించాడు. వారి ప్రయత్నం మంచిదే అయినా ఏ స్థాయి ఫలితం దక్కుతుందో వేచి చూడాలి. రొటీన్ కు భిన్నంగా కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ ఓ మేరకు నచ్చే ఆస్కారం ఉంది.

ప్లస్ పాయింట్స్

మైనస్ పాయింట్

ట్యాగ్ లైన్: పేరులోనే కొత్తదనం!

రేటింగ్: 2.5 / 5