హైదరాబాద్ లోని ఓ సినిమా థియేటర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది, తన అభిమాన హీరో సినిమాను వెండితెరపై చూస్తూ ఆనందంగా గడపాల్సిన సమయంలో, ఓ అభిమాని అనంతలోకాలకు వెళ్ళిపోయారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా చూస్తూ ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించిన ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. రిటైర్డ్ ఏఎస్సై ఆనంద్ కుమార్ చిరంజీవికి వీరాభిమాని, కూకట్‌పల్లిలోని అర్జున్ థియేటర్‌లో ఈరోజు ఉదయం 11:30 గంటల షోకు ఆయన వెళ్లారు. సినిమా ప్రారంభమై, ఉత్సాహంగా సాగుతున్న క్రమంలో ఆనంద్ కుమార్ ఒక్కసారిగా సీట్లోనే కుప్పకూలిపోయారు. గమనించిన పక్కనే ఉన్న ప్రేక్షకులు వెంటనే థియేటర్ యాజమాన్యానికి సమాచారం అందించారు.
Also Read: Chiranjeevi – Anil Ravipudi: బ్లాక్ బస్టర్ వరప్రసాద్.. మెగా హగ్ వైరల్
అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆనంద్ కుమార్‌ను పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు, తీవ్రమైన గుండెపోటు రావడం వల్లే ఆయన ప్రాణాలు కోల్పోయి ఉంటారని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీస్ శాఖలో సేవలు అందించి పదవీ విరమణ పొందిన ఆనంద్ కుమార్, ఇలా సినిమా చూస్తూ హఠాత్తుగా మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మెగాస్టార్ సినిమా చూస్తూ అభిమాని మృతి చెందడం స్థానికంగా మరియు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
