భారతీయ యవనికపై పోతపోసిన గ్రీకు శిల్పంలా నిలిచి జనం మనసు గెలిచాడు హృతిక్ రోషన్. గ్రీకువీరుడులాంటి శరీరసౌష్టవం సొంతం చేసుకున్న హృతిక్ ఎంతోమంది అమ్మాయిల కలల రాకుమారుడు అయిపోయాడు.
తొలి చిత్రం ‘కహోనా ప్యార్ హై’తోనే హృతిక్ అందరి దృష్టినీ ఆకర్షించాడు. అప్పటికే హృతిక్ తండ్రి రాకేశ్ రోషన్ కు మీడియాతోనూ, రాజకీయంగానూ మంచి అనుబంధం ఉన్న కారణంగా, తనయుడిని స్టార్ గా నిలపడం ఆయనకు కష్టమేమీ కాలేదు. ఇక హృతిక్ రోషన్ పెళ్లి అయితే మూడు రోజుల పాటు టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డెయిలీలోనే ఫ్రంట్ పేజీలను ఆక్రమించిందంటే అతనికి ఎలాంటి పబ్లిసిటీ లభించిందో అర్థం చేసుకోవచ్చు. ఓ నాటి సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, తరువాతి సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తో కలసి హృతిక్ రోషన్ నటించిన ‘కభీ ఖుషీ కభీ ఘమ్’తో నటునిగానూ మార్కులు సంపాదించాడు. ‘లక్ష్య’ చిత్రంలో ప్రభుదేవా నేతృత్వంలో హృతిక్ చేసిన డాన్సులు జనాన్ని ఫిదా చేశాయి. ఇక తనయుడు హృతిక్ ను సూపర్ హీరోగా నిలపడానికి రాకేశ్ రోషన్ ‘క్రిష్’ సీరీస్ మొదలు పెట్టాడు. తండ్రి అంచనాలను మించి హృతిక్ అలరించడం విశేషం. ‘ధూమ్’ సిరీస్ రెండో భాగంలో హృతిక్ సాగిన తీరు అనితరసాధ్యమనే అనిపిస్తుంది. ఇలా తెరపై చెలరేగిపోయిన హృతిక్ నిజజీవితంలో భార్య సుజన్నేకు దూరమయ్యాడు. అయినా తమ మధ్య స్నేహబంధం కొనసాగుతూనే ఉందని పలుమార్లు నిరూపించాడు. విడిపోయినా, పిల్లలను వారిద్దరూ చూసుకొనే తీరు అందరినీ ఆకర్షించింది.
నవతరం కథానాయకుడు టైగర్ ష్రాఫ్ తో కలసి హృతిక్ నటించిన ‘వార్’ వసూళ్ళ వర్షం కురిపించింది. అయితే, ఆ సినిమా హృతిక్ కంటే టైగర్ ష్రాఫ్ కు మంచి పేరు సంపాదించి పెట్టింది. దీంతో హృతిక్ మళ్ళీ ఓ భారీ సక్సెస్ కోసం చెకోర పక్షిలా ఎదురు చూడవలసి వస్తోంది. ఈ పుట్టినరోజు తరువాత హృతిక్ కెరీర్ మళ్ళీ మునుపటిలా ఊపందుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘విక్రమ్ వేద’ రీమేక్ లో హృతిక్ నటిస్తున్నాడు. తరువాత ‘ఫైటర్’ అనే మూవీలోనూ టైటిల్ రోల్ అలరించనున్నాడు. మరి ఈ సినిమాలతో మునుపటిలా హృతిక్ మ్యాజిక్ సాగుతుందేమో చూడాలి.