Site icon NTV Telugu

Hollywood : అత్యద్భుతం ‘అవతార్ -2’!

Avatar 2

Avatar 2

హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ పేరు తెలియని సినీఫ్యాన్స్ ఉండరంటే అతిశయోక్తి కాదు. జేమ్స్ తెరకెక్కించిన ‘అవతార్’ మొదటి భాగం విడుదలై ఈ యేడాదికి 13 ఏళ్ళయింది. ఆ సినిమాకు సీక్వెల్ గా ‘అవతార్ -2’ ఈ యేడాది డిసెంబర్ 16న జనం ముందుకు రానుంది. ‘అవతార్-1’ విడుదలై పుష్కరకాలం దాటినా ఇంకా ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా టాప్ గ్రాసర్స్ లో నంబర్ వన్ స్థానంలో నిలవడం విశేషం! ‘అవతార్’ మొదటి భాగం పదమూడేళ్ళ క్రితమే 2,847,246,203 అమెరికన్ డాలర్లు పోగేసింది. మన కరెన్సీలో రూ. 21, 812 కోట్లు! దీనిని మొదటి వారాంతంలో అధిగమించామని చంకలు గుద్దుకున్న ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’ తరువాత చల్లబడి రెండో స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. అదలా ఉంచితే ప్రస్తుతం లాస్ వెగాస్ లో జరుగుతోన్న ‘సినిమాకాన్’లో ‘అవతార్’ సిరీస్ ట్రైలర్స్ ను ప్రదర్శించనున్నారట! లాస్ వెగాస్ లోని సీజర్స్ పాలెస్ థియేటర్ లో సినిమాకాన్ నిర్వహిస్తున్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన ‘అవతార్-2’, దాని తరువాత వచ్చే సీక్వెల్స్ కు సంబంధించిన వీడియోస్ ను ప్రదర్శించడానికి ఈ థియేటర్ లో బార్కో, క్రిస్టీ అనే ప్రత్యేకమైన లేజర్ ప్రొజెక్షన్స్ కూడా ఏర్పాటు చేశారట!

ఓ వేడుకలోనే ‘అవతార్’కు సంబంధించిన ప్రచార చిత్రాలను ప్రదర్శించడానికి ఇంత శ్రద్ధ వహిస్తోంటే, ఇక ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించడానికి ఎంత శ్రద్ధ వహించాల్సి వస్తుందో?ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా లక్షకు పైగా థియేటర్లలో బార్కో, క్రిస్టీ లేజర్ ప్రొజెక్షన్స్ ను ‘అవతార్-2’ కోసం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. మునుముందు మరికొన్ని వేల థియేటర్లలోనూ ఈ ప్రొజెక్షన్స్ చోటు చేసుకొనే అవకాశం ఉంది. దాదాపు 160 భాషల్లో ‘అవతార్-2’ను విడుదల చేసే ప్రయత్నంలో ఉన్నారు. అందుకోసం ఐ మాక్స్, 4జీ, 3డి, పీఎల్ఎఫ్ ఫార్మాట్స్ లోనూ ఏర్పాట్లు సాగుతున్నాయి. అంతేకాదు వర్చువల్ రియాలిటీలోనూ ‘అవతార్-2’ ప్రదర్శితం కానుందని, గతంలోనే ప్రకటించారు. ఈ విధానంలో ప్రేక్షకుడు సినిమాలో జరుగుతున్న కథలోని ప్రదేశాల్లోకి వెళ్ళి చూసిన అనుభూతి కలుగుతుందట!

ప్రపంచంలోనే ఇప్పటికి అందుబాటులో ఉన్న మోడరన్ టెక్నాలజీతో రూపొందిన తొలి చిత్రంగా ‘అవతార్-2’ రానుంది. టెక్నాలజీతో చిత్రాలను రూపొందిస్తూనే, తనదైన కథ, కథనంతోనూ జేమ్స్ తన సినిమాలను తెరకెక్కిస్తారు. ‘అవతార్ -1’లో జేక్ సల్లీ, నెయితిరి ప్రేమలో పడడం, తరువాత మానవులతో పోరాటంతో కథ ముగుస్తుంది. ఈ సారి రాబోయే ‘అవతార్-2’లో హాయిగా సాగిపోతున్న జేక్ సల్లీ, నెయితిరి సంసారం మళ్ళీ భూలోకవాసుల దాడులతో అతలాకుతలమవుతుంది. దాంతో వారిద్దరూ కలసి పండోరా గ్రహంలో తామున్న ప్రదేశాన్ని వీడి, మరికొన్ని ప్రదేశాలలోకి వెళ్ళి తలదాచుకోవడంతో కథ ముగుస్తుందట! ‘అవతార్’ అన్న పదమే సంస్కృతం నుండి తీసుకున్నారు. పైగా ‘అవతార్’ కథలను చూస్తే, మన పురాణాలలోని పలు గాథలు గుర్తుకు రాకుండా పోవు. అందువల్ల భారతదేశంలోనూ ‘అవతార్’ సీక్వెల్స్ కోసమై సినీఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారందరికీ కనువిందు చేస్తూ డిసెంబర్ 16న ‘అవతార్-2’ జనం ముందుకు వస్తుంది. ఆ తరువాత ‘అవతార్-3’ 2024 డిసెంబర్ 20న విడుదల కానుంది. ఆ పై 2026లో ‘అవతార్-4’, 2028లో ‘అవతార్-5’ డిసెంబర్ నెలల్లోనే విడుదల అవుతాయి. అంటే అవతార్ సీరిస్ మొత్తం పూర్తి కావాలంటే మరో ఆరేళ్ళు పడుతుందన్న మాట!

Exit mobile version