సస్పెన్స్… ఈ పదం వినగానే అనుకోకుండా మన మనసుల్లో ఓ థ్రిల్ కలుగుతుంది. అలాంటి థ్రిల్ ను తన సినిమాల ద్వారా అనేక సార్లు అందించిన ఘనుడు ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్. సస్పెన్స్ అన్న పదానికి మారుపేరుగా నిలిచారు హిచ్ కాక్. అందుకే ఆయనను మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ అన్నారు. ఓటీటీ పుణ్యమా అని సస్పెన్స్ థ్రిల్లర్స్ కు ప్రస్తుతం కొదువే లేకుండా ఉంది. యువత ఈ సస్పెన్స్ థ్రిల్లర్స్ చూసి తెగ మురిసిపోతున్నారు. తమను ఆకట్టుకున్న దర్శకులకు జేజేలు పలుకుతున్నారు. జనం ఆదరణ పొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్స్ రూపొందించే వారందరికీ గురువు హిచ్ కాక్ అనే చెప్పాలి.
ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్ 1899 ఆగస్టు 13న జన్మించారు. ఆయన తండ్రి విలియమ్ ఎడ్గార్ హిచ్ కాక్, తల్లి ఎమ్మా జేన్ హిచ్ కాక్. కేథలిక్ క్రిస్టియన్ కుటుంబంలో పుట్టిన హిచ్ కాక్ కు మతఛాందసం కూడా బాగానే ఉండేది. చిన్నప్పటి నుంచీ ముద్దుగా బొద్దుగా ఉండేవాడు హిచ్. చాలా అల్లరివాడు. ఏదైనా కొత్త వస్తువు కనిపిస్తే చాలు దానిని ఊడదీసి, అందులో ఏముందో చూసి, మళ్ళీ అలాంటి దానిని తయారు చేయడానికి పూనుకొనేవాడు. అలాంటి అల్లరి అబ్బాయి తాను చేసే ప్రతి పనిలో ఏదో ఒక వైవిధ్యం ప్రదర్శించాలని తపించేవాడు. ఆ తపనతోనే కళల పట్ల ఆకర్షితుడయ్యారు హిచ్. సకల కళలకు సినిమా రంగం వేదిక అని గుర్తించారు. అటువైపు పరుగులు తీశారు. తన 21 యేట ‘ద గ్రేట్ డే’ (1920) అనే సైలెంట్ మూవీని తెరకెక్కించారు. ఆ సినిమా మంచి ఆదరణ చూరగొంది. అంటే హిచ్ కాక్ దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘ద గ్రేట్ డే’ విడుదలై వందేళ్ళు దాటిందన్న మాట! తొలి చిత్రం తరువాత దాదాపు ఓ తొమ్మిదేళ్ళ పాటు హిచ్ కాక్ మూకీ సినిమాలతోనే అలరిస్తూ సాగారు.
ప్రపంచంలోనే తొలి మాటల చిత్రంగా ‘జాజ్ సింగర్’ (1927) విడుదలయింది. అమెరికాలో రూపొందిన ఈ సినిమా గురించి, చలనచిత్రాలను ప్రేమించే దేశాలన్నీ విశేషంగా చర్చించుకున్నాయి. ఆ సమయంలో హిచ్ కాక్ రూపొందించిన సైలెంట్ మూవీ ‘ద రింగ్ ‘ 1927 అక్టోబర్ 1న బ్రిటన్ లో విడుదలయింది. ఈ సినిమా విడుదలైన ఐదు రోజులకు అంటే అక్టోబర్ 6న తొలి టాకీగా ‘జాజ్ సింగర్’ అమెరికాలో వెలుగు చూసింది. తరువాత బ్రిటన్ లోనూ ఆ సినిమా సందడి చేసింది. అయితే హిచ్ కాక్ రూపొందించిన మరో చిత్రం ‘డౌన్ హిల్’ కూడా అదే నెల 24న విడుదలయింది. మాటల చిత్రంగా వచ్చిన ‘జాజ్ సింగర్’ అందరినీ ఆకట్టుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అప్పట్లో మాటల సినిమాలు ఓ వింత. అయినా, హిచ్ రూపొందించిన రెండు సినిమాలు భలేగా ఆదరణ పొందాయి. అప్పటి నుంచీ హిచ్ ను కూడా టాకీ మూవీస్ తెరకెక్కించమని శ్రేయోభిలాషులు కోరారు. ముందుగా చేసుకున్న ఒప్పందాల ప్రకారం హిచ్ మరో నాలుగు మూకీలు తెరకెక్కించాక, తన తొలి టాకీగా ‘బ్లాక్ మెయిల్’ (1929)ని రూపొందించారు. చిత్రమేమంటే, ఈ సినిమాను అటు సైలెంట్ మూవీగానూ, ఇటు టాకీగానూ విడుదల చేశారు. బహుశా, ఇలాంటి అరుదైన ఘనత హిచ్ కాక్ ఒక్కరికే దక్కిందేమో!
హిచ్ కాక్, తన చిత్రాలలో సస్పెన్స్ కు పెద్ద పీట వేస్తూ సాగారు. ఇది హాలీవుడ్ జనాన్ని భలేగా ఆకట్టుకుంది. దాంతో ప్రముఖ నిర్మాత డేవిడ్ సెల్జెనిక్, హిచ్ కాక్ ను హాలీవుడ్ కు ఆహ్వానించారు. ఆయన నిర్మించిన చిత్రాలకు హిచ్ కాక్ దర్శకత్వం వహించి, తనదైన బాణీ పలికించారు. 1940లో హిచ్ కాక్ తెరకెక్కించిన ‘రెబెకా’ ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అవార్డునూ సొంతం చేసుకుంది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఇంగ్లండ్ కు చేరుకొని, కొన్ని డాక్యుమెంటరీస్ కూడా రూపొందించారు హిచ్. తరువాత మళ్ళీ హాలీవుడ్ కు వెళ్ళి తన బాణీ చూపించారు. ‘స్పెల్ బౌండ్’ (1945)లో హీరో కుర్చీలో కూర్చుని కల కనే డ్రీమ్ సీక్వెన్స్ ఈ నాటికీ చూపరులకు ఆశ్చర్యం గొలుపుతూనే ఉంది. మధ్యలో తెరకెక్కించిన “మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్’ (1941) రొమాంటిక్ కామెడీగా తెరకెక్కి అలరించింది. “సస్పీసియస్, శాబోటీర్, లైఫ్ బోట్” వంటి చిత్రాలు సైతం విశేషాదరణ చూరగొన్నాయి. హాలీవుడ్ లో రూపొందించిన “నొటారియస్, రోప్, ఐ కన్ఫెస్, రియర్ విండో, ద మేన్ హూ న్యూ టూ మచ్, వెర్టిగో, నార్త్ బై నార్త్ వెస్ట్” చిత్రాలతో హిచ్ మార్కు ప్రపంచాన్ని ఆకర్షించింది. 1960లో హిచ్ కాక్ రూపొందించిన ‘సైకో’ చిత్రం పండిత, పామరులను ఆకట్టుకుంది. ఈ రోజుకు ఇందులోని బాత్ రూమ్ సీన్ చిత్రీకరణ గురించి, దర్శకులు, ఛాయాగ్రాహకులు విశేషంగా చెప్పుకుంటూనే ఉన్నారు.
2012లో ‘హిచ్ కాక్’ పేరుతోనే ఆయన బయోగ్రఫీని సచా గెర్వాసీ అనే అమెరికన్ డైరెక్టర్ తెరకెక్కించారు. ఇందులో హిచ్ కాక్ పాత్రలో ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు ఆంథోనీ హాప్కిన్స్ నటించారు. హిచ్ ఎన్ని చిత్రాలు రూపొందించినా, ఆయ న పేరు వినగానే సస్పెన్స్ థ్రిల్లర్స్ ముందుగా గుర్తుకు వస్తాయి. సస్పెన్స్ కు మారుపేరుగా నిలచిన హిచ్ కాక్ ను సినీగోయెర్స్ ఎన్నటికీ మరచిపోలేరు.