NTV Telugu Site icon

April 28th: అదీ… ఏప్రిల్ 28 సెంటిమెంట్!

April 28th

April 28th

సెంటిమెంట్స్ కు నిలయం సినిమా రంగం! తెలుగు చిత్రసీమలో ఏప్రిల్ 28వ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది. ఆ తేదీన విడుదలయ్యే భారీ చిత్రాలు తప్పకుండా ఘనవిజయం సాధిస్తాయని చాలామందిలో ఓ సెంటిమెంట్ నెలకొంది. అంతేకాదు, ఆ తేదీన విడుదలైన చిత్రాలు ఏదో విధంగా ప్రత్యేకతను సంతరించుకున్నవే కావడం విశేషం! ఈ ‘ఏప్రిల్ 28’ వతేదీకి అంత క్రేజ్ సంపాదించి పెట్టిన ఘనత యన్టీఆర్, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్ లో రూపొందిన తొలి చిత్రం ‘అడవిరాముడు’కే చెందుతుంది. ఈ సినిమా 1977 ఏప్రిల్ 28న విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ నాటికీ పలు చెరిగిపోని, తరిగిపోని రికార్డులు నెలకొల్పింది. ఈ చిత్రానికి సరిగా ఓ యేడాది ముందు కె.రాఘవేంద్రరావు తండ్రి కె.యస్.ప్రకాశరావు దర్శకత్వంలో ఏయన్నార్ హీరోగా రూపొందిన ‘సెక్రటరీ’ సినిమా రిలీజ్ అయింది. 1976 ఏప్రిల్ 28న విడుదలైన ‘సెక్రటరీ’ ప్రత్యేకత ఏమిటంటే- అన్నపూర్ణ స్టూడియోస్ లో నిర్మితమైన తొలి చిత్రం’సెక్రటరీ’. ఇప్పుడు మళ్ళీ ఆ తేదీని ఎందుకు గుర్తు చేసుకుంటున్నామంటే, ఓ భారీ విజయం కోసం ఎదురుచూస్తోన్న అక్కినేని మనవడు అఖిల్ నటించిన తాజా చిత్రం ‘ఏజెంట్’ ఈ యేడాది అదే ఏప్రిల్ 28న విడుదలవుతోంది.

ఒక్క ‘అడవిరాముడు’ ఘనవిజయంతోనే ఏప్రిల్ 28కి ప్రత్యేకత వచ్చిందా? ఆ తేదీన విడుదలై విజయఢంకా మోగించిన ఇతర చిత్రాలు లేవా? ఉన్నాయ్. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే కృష్ణ, కృష్ణంరాజు హీరోలుగా రూపొందిన ‘అడవిసింహాలు’ 1983 ఏప్రిల్ 28న విడుదలైంది. ఇదే చిత్రాన్ని హిందీలో రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే ధర్మేంద్ర, జితేంద్ర హీరోలుగా ఏకకాలంలోనే ‘జానీదోస్త్’గా రూపొందించారు. ఆ సినిమా కూడా అదే తేదీకి వెలుగు చూసింది. సి.అశ్వనీదత్ నిర్మించిన ‘అడవిసింహాలు’ ఆ రోజుల్లో భారీ ఓపెనింగ్స్ చూసిన సినిమాగా నిలచింది. ఇక 2006లో ఏప్రిల్ 28న విడుదలైన మహేశ్ బాబు ‘పోకిరి’ చిత్రం కూడా తరిగిపోని,చెరిగిపోని రికార్డులు సృష్టించింది. ‘అడవిరాముడు’ విడుదలైన సరిగా 40 ఏళ్ళకు అంటే 2017లో ఏప్రిల్ 28న రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి-2’ విడుదలయింది. ఈ చిత్రానికి కె.రాఘవేంద్రరావు సమర్పకులు కావడం గమనార్హం! ఈ నాటికీ ‘బాహుబలి-2’ టాప్ గ్రాసర్ గా నిలచే ఉంది. ఇలా పలు ఘనవిజయాలు విడుదలైన ఏప్రిల్ 28వ తేదీనే అఖిల్ ‘ఏజెంట్’గా వస్తున్నాడు. అదే రోజున మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్-2’ విడుదలవుతోంది. మరి ఈ సినిమాలకు ఏప్రిల్ 28వ తేదీ ఏ తీరున కలసి వస్తుందో చూడాలి.