Site icon NTV Telugu

Ram Pothineni: ‘రాపో’ – ‘ద వారియర్’

Ram

Ram

అభిమానులకు నచ్చితే చాలు మెచ్చి మెడల్స్ వేస్తూంటారు. హీరో రామ్ ఫ్యాన్స్ అతడిని ‘రాపో’ అంటూ ముద్దుగా పిలుచుకొంటూ అతనిలోనే ‘ర్యాంబో’ను చూసుకుంటున్నారు. రామ్ పోతినేని అనే పూర్తి పేరును కుదించేసి ‘రాపో’గా మార్చేశారు. రామ్ సైతం జనాన్ని ఆకట్టుకొనేందుకు ప్రతి సినిమాలోనూ వైవిధ్యం ప్రదర్శించడానికే ప్రయత్నిస్తున్నాడు. ప్రతీ ప్రయత్నం ఫలించదు కదా, ఓ సారి అహో అనిపిస్తే, మరోసారి అదరహో అనిపిస్తాయి, ఇంకోసారి అదిరిపోయేలా చేస్తాయి. ‘దేవదాస్’గా జనం ముందు నిలచిన రామ్ 16 ఏళ్ళ కెరీర్ లో పలు పదనిసలు పలికించాడు. ఈ సారి ‘ద వారియర్’గా మురిపిస్తాననే కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు.

రామ్ పోతినేని 1988 మే 15న హైదరాబాద్ లో జన్మించాడు. ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిశోర్ సోదరుని కుమారుడే రామ్. పెదనాన్న నిర్మించే చిత్రాలను చూస్తూ పెరిగాడు. చిన్నతనంలోనే రామ్ కు నటనపై మనసు మళ్ళింది. 14 ఏళ్ళ ప్రాయంలో ‘అడయాలం’ అనే తమిళ లఘు చిత్రంలో నటించాడు. వైవియస్ చౌదరి తెరకెక్కించిన ‘దేవదాస్’తో 18 ఏళ్ళకే హీరోగా వెలిగిపోయాడు రామ్. తరువాత సుకుమార్ ‘జగడం’లోనూ యువతకు ప్రతినిధిగా కనిపించాడు. శ్రీను వైట్ల ‘రెడీ’లో నవ్వులు పూయించాడు. బి.గోపాల్ ‘మస్కా’లో మైమరిపించాడు. ఇలా సాగిపోతున్న రామ్ కెరీర్ లోనూ కొన్ని ఎత్తులు, కొన్ని పల్లాలు ఉన్నాయి. ప్రేక్షకులను రంజింప చేయడానికి నవతరం కోరే పాత్రలను ఎంచుకుంటూ సాగుతున్నాడు. ఈ నేపథ్యంలోనే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ బంపర్ హిట్ అయింది. ఆ తరువాత డ్యుయల్ రోల్ ప్లే చేస్తూ ‘రెడ్’లో నటించాడు రామ్. ఈ సినిమా అంతగా అలరించలేకపోయినా, రామ్ అభినయం మాత్రం మంచి మార్కులే సంపాదించింది.

ఓ వైపు మాస్ ను మెప్పిస్తూ, మరోవైపు తన సినిమాలకు క్లాస్ నూ రప్పించుకుంటున్నాడు రామ్. తమిళ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో రామ్ ‘ద వారియర్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా జూలై 14న జనం ముందుకు రానుంది. ఈ సినిమాలో సత్య ఐ.పి.యస్. పాత్రలో రామ్ కనిపించబోతున్నాడు. ఇప్పటి దాకా తాను చేయనటువంటి భిన్నమైన పాత్రను ‘ద వారియర్’లో పోషించానని రామ్ అంటున్నాడు. మరి ఈ సినిమాతో రామ్ జనాన్ని ఏ రీతిలో ఆకట్టుకుంటాడో చూడాలి.

Exit mobile version