Site icon NTV Telugu

Nithiin: నితిన్ ఎమోషనల్ పోస్ట్.. ఏం చెప్పాలో మాటలు రావడం లేదు

Nithin 1

Nithin 1

యంగ్ హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని నితిన్ సంపాదించుకున్నాడు. జయం సినిమాతో టాలీవుడ్‌లోకి నితిన్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా విడుదలై నేటికి 20 ఏళ్లు అవుతోంది. అంటే రెండు దశాబ్దాలు. ఓ హీరోకు 20 ఏళ్ల కెరీర్ అంటే ఎంత ముఖ్యమో తెలిసిన విషయమే. హీరో నితిన్‌కు ఈ 20 ఏళ్లలో ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి. జూన్ 14, 2002న నితిన్ తొలి సినిమా జయం సినిమా విడుదలైంది. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో నితిన్‌కు వరుస అవకాశాలు వచ్చాయి. రెండో సినిమా దిల్ కూడా సూపర్ డూపర్ హిట్. ఆ తర్వాత శ్రీ ఆంజనేయం, సై, ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే, అ..ఆ, రంగ్‌దే వంటి హిట్లను కూడా నితిన్ సొంతం చేసుకున్నాడు.

కాగా తన సినిమా కెరీర్‌కు 20 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో హీరో నితిన్ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులు, ఫ్యాన్స్, దర్శక నిర్మాతలు, సన్నిహితులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. ముఖ్యంగా ఫస్ట్ మూవీని డైరెక్ట్ చేసిన దర్శకుడు తేజకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు. తేజ తనను ఎంతో నమ్మి వెండితెరకు పరిచయం చేశారన్నాడు. 20 ఏళ్ల క్రితం జయం సినిమాతో తన సినీ ప్రయాణం మొదలు పెట్టానని… కానీ ఇప్పుడు ఏం చెప్పాలో కూడా తనకు మాటలు రావట్లేదని నితిన్ పేర్కొన్నాడు. తన కెరీర్ ప్రయాణంలో మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరినీ గుర్తుచేసుకున్నాడు. వాళ్లు లేకపోతే ఈ రోజు తాను ఇలా ఉండేవాడిని కాదని నితిన్ అభిప్రాయపడ్డాడు. ఇన్నేళ్లుగా తనను అభిమానిస్తూ తననే ఫాలో అవుతూ చెరగని ప్రేమని అందిస్తున్న అభిమానుల ప్రేమకు అయితే ఎప్పటికీ హృదయాపూర్వకంగా రుణపడి ఉంటానని తెలిపాడు. కాగా నితిన్ ఎమోషనల్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Exit mobile version