NTV Telugu Site icon

PAPA: ఇరవై యేళ్ళ కెరీర్ లో ఇది 19వ చిత్రం: కళ్యాణి మాలిక్

Papa

Papa

Kalyani Malik: 2003లో ‘ఐతే’ సినిమాతో సంగీత దర్శకుడిగా ప్రస్థానం ప్రారంభించాడు కళ్యాణి మాలిక్. ప్రస్తుతం ఆయన పలు చిత్రాలకు సంగీతాన్ని అందిస్తున్నారు. అందులో 19వ చిత్రం ‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’. అంటే సగటున యేడాదికి ఒక సినిమా చేస్తున్నట్టు లెక్క. చేసింది తక్కువ సినిమాలే అయినా ఈ ప్రయాణంలో తన సంగీతానికి దక్కిన ప్రశంసలు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయని కళ్యాణి మాలిక్ చెబుతున్నారు. టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మించిన ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ఈ నెల 17న విడుదల కాబోతోంది. నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా నటించిన ఈ సినిమాను శ్రీనివాస్ అవసరాల తెరకెక్కించారు.

తన సినీ ప్రయాణం గురించి కళ్యాణి మాలిక్ మాట్లాడుతూ, “‘చెక్’ సినిమా తర్వాత కోవిడ్ కారణంగా కాస్త విరామం వచ్చింది. కానీ 2022 ద్వితీయార్థం నుంచి జీవితంలో ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉన్నాను. ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ఈ నెల 17న విడుదలవుతోంది. దాని తర్వాత ‘ఇంటింటి రామాయణం’, ‘విద్య వాసుల అహం’ రానున్నాయి. వీటితో పాటు మరో రెండు వెబ్ సిరీస్ లు చేస్తున్నాను. ప్రస్తుతం వర్క్ పరంగా సంతృప్తిగా ఉన్నాను. ఇటీవల విడుదలైన ‘కనుల చాటు మేఘమా’ పాటకు వస్తున్న స్పందన నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది” అని చెప్పారు. ఆ పాట విజయానికి కారణాలు వివరిస్తూ, “ప్రేమలు చాలా రకాలుగా ఉంటాయి. ఇది మోహం లేని మధురమైన ప్రేమ. ఇటువంటి సందర్భంలో వచ్చిన ప్రేమ పాటను నేను ఇప్పటివరకు చేయలేదు. శ్రీనివాస్ గారి అభిరుచికి తగ్గట్లుగా స్వరపరచడం జరిగింది. కేవలం ట్యూన్ మాత్రమే కాదు.. లక్ష్మీభూపాల్ గారు రాసిన లిరిక్స్, ఆభాస్ జోషి గాత్రం ఎంతో నచ్చాయి. ఈ పాట హిట్ అవ్వడంలో వాళ్ళ ప్రమేయం చాలా ఉంది. రూపుదిద్దుకుంటున్నప్పుడే ఈ పాట హిట్ అవుతుందని నాకు తెలుసు. అందుకే ముందు నుంచే ఆ పాట పట్ల ప్రేమ పెంచుకుంటూ వచ్చాను. దానికి తగ్గట్టుగానే విడుదలవ్వగానే అందరికీ నచ్చడం సంతోషాన్నిచ్చింది” అని చెప్పారు.

సంగీత దర్శకుడిగా ‘ఏం సందేహం లేదు’ వంటి గొప్ప పాటలను ఇచ్చినా రావాల్సినంత పేరు రాలేదనే విషయాన్ని వివరిస్తూ, “హిట్ అయితే అవకాశాలు వస్తాయన్న అభిప్రాయంతో అందరూ హిట్ కోసం ఎదురుచూస్తుంటారు. కానీ నా విషయంలో మాత్రం దానికి విరుద్ధంగా జరుగుతోంది. ఏ హిట్ వచ్చినా ఆ తర్వాత దానికి తగ్గ అవకాశం రాలేదు. “ఆంధ్రుడు, ఐతే, అలా మొదలైంది, అష్టాచమ్మా” ఇలా ఏ సినిమా తీసుకున్నా నేను ఊహించిన విధంగా కెరీర్ లేదు. అయితే దానికి కారణమేంటి అని ఆలోచించడం కన్నా.. ఇంకా బాగా కష్టపడాలి అనే దృష్టితో పని చేసుకుంటూ వెళ్తున్నాను. నాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానా లేదా అనే ఆలోచన మాత్రమే నాకు ఉంటుంది. నా పని పట్ల నేను చాలా సంతృప్తిగా ఉన్నాను” అని అన్నారు.

‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’కి తొలుత వివేక్ సాగర్ సంగీత దర్శకుడు. ఆ తర్వాత కళ్యాణీ మాలిక్ లైన్ లోకి వచ్చారు. ఆ విషయాలు చెబుతూ, “ఇందులోని ఐదు పాటల్లో వివేక్ సాగర్ ఓ పాట స్వరపరిచారు. ఈ సినిమా 2019 లోనే మొదలైంది కానీ కోవిడ్ కారణంగా దాదాపు రెండేళ్లు గ్యాప్ వచ్చింది. ఆ తరువాత వివేక్ గారు, శ్రీనివాస్ గారు అడగడంతో నేను ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చాను. వివేక్ సాగర్ స్వరపరిచిన పాట అప్పటికే షూటింగ్ అయిపోవడంతో మిగతా నాలుగు పాటలు, నేపథ్యం సంగీతం నేను అందించాను” అని చెప్పారు. కీరవాణి సోదరుడిగా ఆయన స్వరపరిచిన పాట ఆస్కార్ బరిలో నిలవడం గర్వంగా ఉందని, అవార్డ్ సంగతి పక్కన పెడితే నామినేషన్స్ పొందడమే చాలా సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. కొన్ని కాంబినేషన్స్ అలానే కొనసాగితేనే బాగుంటుందని చెబుతూ, “రాజమౌళి-కీరవాణి; సుకుమార్ – దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్లు నాకు చాలా ఇష్టం. రాజమౌళి సినిమాలకు అన్నయ్య అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నప్పుడు.. ఆ స్థానాన్ని ఎవరు భారీ చేస్తారని ఆలోచించడం అనవసరం. అలాగే సుకుమార్ గారంటే నాకు చాలా ఇష్టం. సుకుమార్ రైటింగ్స్ లో ఆయన నిర్మించే సినిమాకి నేను సంగీతం అందించాలని కోరుకుంటాను కానీ ఆయన దర్శకత్వం వహించే సినిమాకి సంగీతం అందించాలని కోరుకోను. రాజమౌళి – కీరవాణి, సుకుమార్ – దేవిశ్రీప్రసాద్ ఆ కాంబినేషన్ లు అలా ఉంటేనే బాగుంటుందనేది నా అభిప్రాయం” అని చెప్పారు.