(ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు)
‘నాని’ ఈ పేరే జనాన్ని ఇట్టే కట్టిపడేస్తుంది. తెలుగునాట ఎందరో నానీలు ఉన్నారు. చిత్రసీమలో మాత్రం నాని తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. అతనికి ఎవరి అండాదండా లేకున్నా, తారాపథంలో తకధిమితై అంటూ సాగుతున్నాడు. నాని సినిమా వస్తోందంటే చాలు అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని ఆశిస్తున్నారు జనం. నిజంగానే నాని చిత్రాల్లో ఏదో ఓ వైవిధ్యం ఇట్టే కనిపిస్తుంది.. అదీగాక నానిని చూడగానే మనకు బాగా పరిచయమున్న వాడిలా కనిపిస్తాడు. మన పక్కింటి అబ్బాయిలా ఉంటాడనీ చాలామంది అంటారు. అందుకే కాబోలు జనానికి ఇట్టే కనెక్ట్ అయిపోయాడు అనిపిస్తుంది.
నాని కటౌట్ లో పెద్ద స్పెషాలిటీ ఏమీ ఉండదు. అయితే అతని రూపురేఖలు మాత్రం నాని మనోడే అనేలా ఉంటాయి. అందుకనే జనం కూడా మనోడి సినిమా ఓ సారి చూస్తే పోలా అంటూ నాని సినిమాల వైపు పరుగులు తీస్తున్నారు..’అష్టాచెమ్మా’తో మొదలయిన నాని నటన, మొన్నటి ‘శ్యామ్ సింగరాయ్’ దాకా జనాన్ని అలరిస్తూనే ఉంది. ప్రతి చిత్రంలో ఏదో ఒక వైవిధ్యం కోసం తపించాడు నాని. ఆ తపనలోనే విలక్షణమైన పాత్రలను ఎంపిక చేసుకుంటున్నాడు. ఆ విలక్షణమే జనాన్ని విశేషంగా ఆకట్టుకుంటోంది.
‘అష్టాచెమ్మా’తో తెరపై కనిపించక ముందు నాని మనసు డైరెక్షన్ వైపు సాగింది. అయితే పరిచయస్థుల సలహా మేరకు అతను నటనలో అడుగుపెట్టాడు… సినిమా రంగంలో గుమ్మడి కాయంత ప్రతిభ కన్నా ఆవగింజంత అదృష్టం ఉండాలని అంటారు. నానికి ఆరంభంలోనే ఆవగింజకంటే ఎక్కువగా అదృష్టం కలిసొచ్చిందని చెప్పాలి. వరుసగా జనాన్ని ఆకట్టుకొనే చిత్రాలు నాని సరసన వాలసాగాయి. అతను కూడా తనకు లభించిన పాత్రలకు న్యాయం చేయడానికి ఎంతగానో శ్రమించేవాడు.
రాజమౌళి సినిమాలో చిన్న వేషం వేసినా చాలు అనుకొనేవారు ఎందరో ఉన్నారు. నానిలోని టాలెంట్ ను గుర్తించి తన ‘ఈగ’ చిత్రంలో ప్రధాన పాత్రనే అందించారు రాజమౌళి. ఇంకేముంది, ‘ఈగ’తో నాని స్టార్ డమ్ కూడా రివ్వున పైకి దూసుకుపోయింది.. తనకు లభించిన స్టార్ డమ్ ను నిలుపుకోవడానికి నాని ఆచితూచి అడుగులు వేస్తున్నాడు… వైవిధ్యానికి పెద్ద పీట వేస్తూ సాగుతున్నాడు… అదే అందరిలోకి నానిని భిన్నంగా చూపిస్తోంది. అక్కడ నుంచీ వైవిధ్యంతోనే సాగుతూ వచ్చాడు నాని.
విజయాలు పలకరించగానే నాని పులకరించిపోయాడు. వెండితెరపై వెలిగిపోవడమే కాదు, నిర్మాతగానూ అలరించాలని తపించాడు. ప్రథమ ప్రయత్నంగా ‘అ!’ అనే చిత్రాన్ని నిర్మించాడు. టైటిల్ లో వైవిధ్యమున్నట్టే సినిమాలోనూ అది కనిపించేలా చేశాడు. ఆ తరువాత విశ్వక్సేన్ హీరోగా ‘హిట్’ తీసి టైటిల్ జస్టిఫికేషన్ చేశాడు. నిర్మాతగానూ నాని తన అభిరుచిని చాటుకోవడానికి ఈ రెండు చిత్రాలు ఉపయోగపడ్డాయి.
పన్నెండేళ్ళ వ్యవధిలో నాని పాతిక పైగా చిత్రాలు పూర్తి చేశాడు. నాని 25వ చిత్రంగా ‘వి’ రూపొందింది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలో సందడి చేస్తుందని అందరూ అనుకుంటున్న సమయంలోనే కరోనా కల్లోలంలో లాక్ డౌన్ మొదలయింది. దాంతో నాని నటించిన ‘వి’ ఓటీటీలో ముందుగా ప్రత్యక్షమయింది. తరువాత నాని ‘టక్ జగదీశ్’తో జనం ముందుకు వచ్చాడు. అందులో అతని ‘టక్’ సరిగానే ఉన్నా, అంతగా కిక్ ఇవ్వలేక పోయింది. ఇక ‘శ్యామ్ సింగరాయ్’ ఈ తరం ‘మూగమనసులు’అనే పేరు తెచ్చుకుంది. వైవిధ్యమే ఆయుధంగా సాగుతున్న నాని ప్రస్తుతం ‘అంటే సుందరానికి’ అనే వెరైటీ టైటిల్ తో ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సారి ఏ తీరున నాని జనాన్ని మురిపిస్తాడో చూడాలి.