(జనవరి 24న దర్శకనిర్మాత సుభాష్ ఘై బర్త్ డే)
నటులు కావాలని కలలు కని, తరువాత మెగాఫోన్ పట్టి మ్యాజిక్ చేసిన వారు ఎందరో! అలాంటి వారిలో సుభాష్ ఘైని మరవకుండా పేర్కొనాలి. నటనతో జనాన్ని ఆకట్టుకోవాలని కలలు కన్న సుభాష్ ఘై దర్శకత్వంతో జనం నాడిని పట్టి సినిమాలు తెరకెక్కించారు. సుభాష్ రూపొందించిన అనేక చిత్రాలు తెలుగులోనూ రీమేక్ అయి ఆకట్టుకున్నాయి.
సుభాష్ ఘై 1945 జనవరి 24న సుభాష్ ఘై నాగ్ పూర్ లో జన్మించారు. సుభాష్ తండ్రి ఢిల్లీలో దంతవైద్యునిగా పనిచేసేవారు. అక్కడ కొంతకాలం చదువుకున్న సుభాష్, హర్యానాలోని రోహ్తక్ లో బి.కామ్, చదివారు. అది కాగానే సినిమాలపై ఆసక్తితో పూనాలోని ఫిలిమ్ అండ్ టెలివిజన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో చేరారు. ఫిలిమ్ సర్టిఫికెట్ సంపాదించగానే ముంబై చేరారు. ఆరంభంలో ఏ పరిచయమూ లేకపోవడంతో స్టూడియోస్ లోపలికి కూడా ఎంట్రీ లభించేది కాదు. దాంతో డేల్ కార్నెగీ రాసిన ‘హై టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ ఫ్లూయెన్స్ పీపుల్’ పుస్తకం చదివారు. అందులోని కొన్ని మెలకువలు పట్టుకొని మెల్లగా సినీజనంతో సంబంధాలు ఏర్పరచుకున్నారు. అదే సమయంలో ‘యునైటెడ్ ప్రొడ్యూసర్స్ ఫిలిమ్ ఫేర్ టాలెంట్ కాంటెస్ట్’లో పాల్గొన్నారు. ఐదువేలమంది పాల్గొనగా అందులో రాజేశ్ ఖన్నా, ధీరజ్ కుమార్, సుభాష్ ఘై విజేతలుగా నిలిచారు. రాజేశ్ ఖన్నాకు మొదట్లోనే అవకాశం లభించింది. మరో యేడాదికి సుభాష్ ఘై కూడా తెరపై నటునిగా కనిపించారు. “తక్దీర్, ఆరాధన, ఉమంగ్, గుమ్రాహ్” వంటి చిత్రాలలో చిన్న పాత్రలు, కీలక పాత్రల్లో కనిపించారు. ఇలాగయితే లాభం లేదని భావించారు, తానే దర్శకునిగా మారారు. నిర్మాత ఎన్.ఎన్.సిప్పీ అతనిలోని పట్టుదలను గమనించారు. సుభాష్ దర్శకత్వంలో శత్రుఘ్న సిన్హా హీరోగా ‘కాళీచరణ్’ రూపొందించే అవకాశం కల్పించారు సిప్పీ. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. దాంతో సుభాష్ ఘై పేరు ముంబయ్ లో మారుమోగి పోయింది.
‘కాళీచరణ్’ తెలుగులో శోభన్ బాబుతో ‘ఖైదీ కాళిదాస్’గా రూపొందింది. తరువాత శత్రుఘ్న సిన్హాతోనే ‘విశ్వనాథ్’ తెరకెక్కించారు సుభాష్ ఘై. ఈ చిత్రం కూడా సూపర్ హిట్. ఇది తెలుగులో యన్టీఆర్ ‘లాయర్ విశ్వనాథ్’గా రీమేక్ అయింది. మూడో సినిమా ‘గౌతమ్-గోవింద’ ఫరవాలేదనిపించింది. సుభాష్ ఘై , రిషి కపూర్ తో తెరకెక్కించిన ‘కర్జ్’ ఘనవిజయం చేజిక్కించుకుంది. ఈ సినిమాతోనే సుభాష్ నిర్మాతగా కూడా మారారు. ఈ చిత్రం తెలుగులో బాలకృష్ణతో ‘ఆత్మబలం’గా రూపొందింది. ఘై దర్శకత్వంలో రూపొందిన ‘విధాత, క్రోధి’ కూడా ఆకట్టుకున్నాయి. ఇక జాకీ ష్రాఫ్ ను హీరోగా పరిచయం చేస్తూ సుభాష్ రూపొందించిన ‘హీరో’ అనూహ్య విజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో నాగార్జున పరిచయ చిత్రంగా ‘విక్రమ్’ పేరుతో తెరకెక్కించగా, విజయాన్ని అందుకుంది. సుభాష్ ఘై ‘మేరీ జంగ్’ ఆధారంగా తెలుగులో ‘విజృంభణ’ చిత్రం రూపొందింది.
తరువాత సుభాష్ ‘కర్మ’ చిత్రం రూపొందించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇందులో శ్రీదేవి నాయిక. ఇదే చిత్రంలో కైకాల సత్యనారాయణ ఓ పాత్రలో నటించారు. ఇక “రామ్ లఖన్, సౌదాగర్, ఖల్ నాయక్, పర్దేశ్, తాల్, యాదే, కిష్ణ : ద వారియర్ పొయెట్, బ్లాక్ అండ్ వైట్, యువరాజ్, కాంచి : ది అన్ బ్రేకబుల్” చిత్రాలను స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. వీటిలో కొన్ని సుభాష్ ఘై మునుపటి చిత్రాల్లా అలరించాయి, కొన్ని పరాజయాలనూ చవిచూశాయి. ప్రస్తుతం ’36 ఫామ్ హౌస్’ అనే సినిమాను నిర్మిస్తున్నారు.
ఘై 1970లో పూనాకు చెందిన రెహనాను ప్రేమించి పెళ్ళాడారు. ఆమె పేరును తరువాత ముక్తాగా మార్చారు. ఆమె పేరు మీదే ‘ముక్తా ఆర్ట్స్’ సంస్థ నెలకొల్పారు. వారికి ఇద్దరు అమ్మాయిలు – మేఘ్నా ఘై పురి, ముస్కాన్ ఘై. 2000లో తన ‘ముక్తా ఆర్ట్స్’ను సుభాష్ ఘై పబ్లిక్ కంపెనీగా రూపొందించారు. దానికి ఆయన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. 2006లో నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో ఘై నిర్మించిన ‘ఇక్బాల్’కు బెస్ట్ ఫిలిమ్ ఆన్ అదర్ సోషల్ ఇష్యూస్ కేటగిరీలో నేషనల్ అవార్డు లభించింది. అదే సంవత్సరం ‘విజిలింగ్ ఊడ్స్’ అనే పిలిమ్ ఇన్ స్టిట్యూట్ ను ఏర్పాటు చేశారు ఘై. దీనికి ఆయన పెద్ద కూతురు మేఘ్నా ఘై పురి అధ్యక్షురాలు. ఏది ఏమైనా సుభాష్ ఘై రూపొందించిన అనేక చిత్రాలు జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి. ఆయన స్ఫూర్తితో ఎంతోమంది చిత్రసీమలో అడుగు పెట్టారు. ఆయన నెలకొల్పిన ఇన్ స్టిట్యూట్ ద్వారా కూడా పలువురు సినిమా రంగంలో ప్రవేశిస్తున్నారు.