(ఏప్రిల్ 25న బోయపాటి శ్రీను పుట్టినరోజు)
తెలుగు చిత్రసీమలో ఈ తరం మాస్ మసాలా డైరెక్టర్ ఎవరంటే బోయపాటి శ్రీను పేరు ముందుగా వినిపిస్తుంది. ఆయన అన్నిచిత్రాలలోనూ యాక్షన్ ఎపిసోడ్స్ జనాన్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ‘లెజెండ్’ చిత్రంతో ఉత్తమ దర్శకునిగా నంది అవార్డుకు ఎంపికైన బోయపాటి శ్రీ నుకు, బి.యన్. రెడ్డి అవార్డును కూడా ప్రకటించడం విశేషం!
గుంటూరు జిల్లా పెదకాకాని బోయపాటి శ్రీను స్వస్థలం. అక్కడే వారికి ఓ సొంత ఫోటో స్టూడియో ఉండేది. దాంతో శ్రీనుకు ఫోటోగ్రఫి అంటే ఎంతో ఇష్టం కలిగింది. కొంతకాలం ఈనాడు దినపత్రికకు ఫోటోగ్రాఫర్ గానూ పనిచేశారు శ్రీను. ఫోటోగ్రఫిపై ఉన్న ఆసక్తి సినిమాలవైపుకు మళ్ళింది. రచయిత పోసాని కృష్ణ మురళితో బంధుత్వం కారణంగా చిత్రసీమలో అడుగు పెట్టారు శ్రీను. పోసాని, బోయపాటిని దర్శకుడు ముత్యాల సుబ్బయ్య వద్ద అసిస్టెంట్ గా చేర్పించారు. సుబ్బయ్య వద్ద “గోకులంలో సీత, పెళ్ళిచేసుకుందాం, అన్నయ్య, పవిత్ర ప్రేమ, మనసున్న మారాజు” వంటి చిత్రాలకు అసోసియేట్ గా పనిచేశారు శ్రీను. తరువాత సొంతగా కథను రూపొందించుకొని దిల్ రాజును కలిశారు. శ్రీను కథ నచ్చడంతో దిల్ రాజు ‘భద్ర’ సినిమా నిర్మించారు. ఆ సినిమా బోయపాటి శ్రీనుకు మంచి పేరు సంపాదించి పెట్టింది. తరువాత వెంకటేశ్ తో ‘తులసి’ తెరకెక్కించి విజయం చూశారు. టాలీవుడ్ ఫ్యాక్షనిజానికి హీరోయిజం తీసుకు వచ్చిన బాలకృష్ణతో ‘సింహా’ రూపొందించిన బోయపాటి శ్రీనుకు అనూహ్య విజయం చేజిక్కింది. దాంతో బోయపాటి పేరు మరింతగా మారుమోగి పోయింది. తరువాత జూనియర్ యన్టీఆర్ తో ‘దమ్ము’తో దుమ్ము రేపారు. అల్లు అర్జున్ ను ‘సరైనోడు’గా తీర్చిదిద్ది మురిపించారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తో ‘జయ జానకీ నాయక’ తెరకెక్కించి అలరించారు. రామ్ చరణ్ తో ‘వినయ విధేయ రామా’ లోనూ ధనాధన్ ఫటాఫట్ అనిపించారు.
బోయపాటి శ్రీను ఎన్ని సినిమాలు తెరకెక్కించినా, నటసింహ నందమూరి బాలకృష్ణతో ఆయన తీసిన చిత్రాలే జనాన్ని విశేషంగా అలరించాయి. బాలయ్య, బోయపాటి కాంబోలో రూపొందిన తొలి చిత్రం ‘సింహా’ అప్పట్లో 90కి పైగా కేంద్రాలలో శతదినోత్సవం చూసి, డైరెక్టుగా 200 రోజులు ఆడి అదరహో అనిపించింది. ఇక వారి కలయికలో తెరకెక్కిన రెండవ చిత్రం ‘లెజెండ్’ 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో విడుదలై అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం రెండు కేంద్రాలలో రోజూ 4 ఆటలతో వజ్రోత్సవం చూసిన ఏకైక చిత్రంగా నిలచింది. అందులో ఎమ్మిగనూరు – మినీ శివలో డైరెక్టుగా డైమండ్ జూబ్లీ జరుపుకుని చరిత్ర సృష్టించింది. దక్షిణాదిన వెయ్యి రోజులకు పైగా ప్రదర్శితమైన ఏకైక చిత్రంగానూ రికార్డు నెలకొల్పింది. ఇన్ని విధాలుగా బాలయ్య, బోయపాటి కాంబో అలరించింది. దాంతో వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన ‘అఖండ’పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే గత సంవత్సరం డిసెంబర్ 2న విడుదలైన ‘అఖండ’ అదరహో అంటూ విజయం సాధించింది. అలా బాలయ్యతో హ్యాట్రిక్ చూశారు బోయపాటి. ‘అఖండ’ చిత్రం 24 కేంద్రాలలో వందరోజులు చూసి, చిలకలూరి పేటలో డైరెక్ట్ గా సిల్వర్ జూబ్లీకి పరుగులు తీస్తోంది. ఓటీటీ, శాటిలైట్ ఫ్లాట్ ఫామ్స్ లో ‘అఖండ’ సందడి చేసినా, థియేటర్లలో ఇంకా సాగుతూ ఉండడం విశేషం!
ప్రస్తుతం హీరో రామ్ తో సినిమా తెరకెక్కిస్తున్న బోయపాటి, ‘అఖండ’కు సీక్వెల్ ఉందంటూ ప్రకటించారు. దాంతో మళ్ళీ ఫ్యాన్స్ లో ఉత్సాహం మొదలైంది. రాబోయే సినిమాలతో బోయపాటి ఏ స్థాయిలో అలరిస్తారో చూడాలి.